వేగవంతంగా విజయవాడ విమానాశ్రయం విస్తరణ పనులు: కేంద్రమంత్రి

by Jakkula Mamatha |
వేగవంతంగా విజయవాడ విమానాశ్రయం విస్తరణ పనులు: కేంద్రమంత్రి
X

దిశ, ఏపీ బ్యూరో:విజయవాడ విమానాశ్రయం విస్తరణ పనులు వేగవంతం చేసి పూర్తి చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం ఆయన గన్నవరం విమానాశ్రయం విశిష్ట అతిథులు భవనంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు, సాధారణ పరిపాలన విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, ఇతర అధికారులతో కలిసి విజయవాడ విమానాశ్రయం విస్తరణ అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షించారు.

ఈ సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనులు అత్యంత ప్రాధాన్యత కింద చేపడుతున్నామన్నారు. జూన్ 2025 నాటికి అన్ని పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఆ దిశగా అధికారులు కృషి చేయాలని సూచించారు. విమానాశ్రయ అభివృద్ధి పనులు ఇప్పటి వరకు 52 శాతం మాత్రమే పూర్తి చేయడం పట్ల ఆయన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ నిధులు, మెటీరియల్ కొరత లేదని అయినప్పటికీ ఆలస్యానికి గల కారణాలపై ఆరా తీశారు. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా పనులు కొంతమేర మందగించాయని, వేగవంతం చేసి నిర్దేశిత సమయానికి పనులను పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు.

ఈ పనులకు సంబంధించి ఒక వాట్సాప్ గ్రూప్ రూపొందించి దానిలో ప్రతి రోజు జరుగుతున్న పనుల పురోగతిని పోస్ట్ చేస్తూ తనకు వివరించాలని కేంద్ర మంత్రి సూచించారు. పనులు పూర్తయ్యేంతవరకు నెలకు ఒకసారి క్రమం తప్పకుండా పురోగతిని సమీక్షిస్తామన్నారు. విజయవాడ విమానాశ్రయ విస్తరణలో భాగంగా నెలకొన్న భూ సమస్యలు, కోర్టు వివాదాలు, ఏలూరు కాలువ పై వంతెన నిర్మాణం, రైతులకు పరిహారం చెల్లింపు వంటి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కేంద్ర మంత్రి అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో గన్నవరం విమానాశ్రయ జనరల్ మేనేజర్ రామాచారి, డైరెక్టర్ లక్ష్మి కాంత్ రెడ్డి, గన్నవరం మండలం తహసీల్దార్ శివయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed