ఎంపీ గురుమూర్తి చొర‌వ‌...నెర‌వేరిన‌ ద‌శాబ్దాల క‌ల‌..!

by srinivas |   ( Updated:2024-01-19 15:36:58.0  )
ఎంపీ గురుమూర్తి చొర‌వ‌...నెర‌వేరిన‌ ద‌శాబ్దాల క‌ల‌..!
X

దిశ, తిరుపతి: తిరుప‌తి ఎంపీ డాక్ట‌ర్ మ‌ద్దిల గురుమూర్తి కృషితో కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగులు, విశ్రాంతి ఉద్యోగుల ద‌శాబ్దాల క‌ల నెర‌వేరింది. తిరుప‌తికి సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ హెల్త్ స్కీమ్ వెల్నెస్ సెంటర్ మంజూరైంది. ఈ సెంట‌ర్ ఏర్పాటుకు భ‌వ‌నం ఎంపిక కోసం హైద‌రాబాద్ నుంచి సీజీహెచ్ఎస్ అడిష‌న‌ల్‌ డైరెక్ట‌ర్ ల‌క్ష్మ‌య్య‌, ఆయ‌న బృందం అక్క‌డికి వెళ్లింది. తిరుప‌తి ఎంపీ డాక్ట‌ర్ మ‌ద్దిల గురుమూర్తితో చ‌ర్చించిన అనంత‌రం ఆ బృందం న‌గ‌రంలోని ప‌లు ఆస్ప‌త్రులు, కేంద్ర ప్ర‌భుత్వ భ‌వ‌నాల‌ను ప‌రిశీలించారు. కేంద్ర ప్ర‌భుత్వానికి సంబంధించి 24 విభాగాల వ‌ర్కింగ్‌ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల‌కు ఆరోగ్య కేంద్రం లేదు. తిరుప‌తిలో ఏర్పాటు చేసేందుకు స్థానిక ఎంపీ డాక్ట‌ర్ మ‌ద్దిల గురుమూర్తి కేంద్ర ప్ర‌భుత్వంతో ప‌లు ద‌ఫాలు చ‌ర్చించారు. సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ రిటైర్డ్ అండ్ స‌ర్వింగ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ కోఆర్డినేష‌న్ క‌న్వీన‌ర్లు దామోద‌రం, రంగ‌య్య స‌హ‌కారంతో హెల్త్ కేంద్రం ఏర్పాటు ఆవ‌శ్య‌క‌త‌ను కేంద్రానికి ఎంపీ వివ‌రించారు. తిరుప‌తి ప‌రిధిలో కేంద్ర ప్ర‌భుత్వ ప‌రిధిలో వివిధ శాఖ‌ల‌కు సంబంధించి 15 వేల మంది రెగ్యుల‌ర్‌, రిటైర్డ్ ఉద్యోగుల కుటుంబాల‌కు ప్ర‌యోజ‌నం క‌లిగించే విష‌యాన్ని కేంద్ర ప్ర‌భుత్వ పెద్ద‌ల దృష్టికి తీసుకెళ్లారు.

దీంతో తిరుప‌తిలో సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ హెల్త్ స్కీమ్ వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు కేంద్ర వైద్యారోగ్య‌శాఖ ముందుకొచ్చింది. ఈ కేంద్రాన్ని తిరుప‌తిలో ఏర్పాటు చేసే నిమిత్తం భ‌వ‌నాల ప‌రిశీల‌న‌కు హైద‌రాబాద్ నుంచి సీజీహెచ్ఎస్ అడిష‌న‌ల్‌ డైరెక్ట‌ర్ ల‌క్ష్మ‌య్య‌, ఆయ‌న బృందం అక్క‌డికి వెళ్లింది. న‌గ‌రంలోని బీఎస్ఎన్ఎల్ భ‌వ‌నం, ప‌ద్మావ‌తి ఆస్ప‌త్రి, అలాగే రుయా, ఈఎస్ఐ ఆస్ప‌త్రుల‌ను ప‌రిశీలించారు. ఎక్క‌డ ఏర్పాటు చేయాల‌నే విష‌యమై ఉన్న‌తాధికారులు తుది నిర్ణ‌యం తీసుకోనున్నారు.

ఈ హెల్త్ సెంట‌ర్ ఏర్పాటుతో కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, వారి కుటుంబ స‌భ్యులు ఆరోగ్య ప‌రీక్ష‌ల కోసం బెంగ‌ళూరు, చెన్నై త‌దిత‌ర సుదూర ప్రాంతాల‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం లేకుండా పోతుంది. తిరుప‌తిలో సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ హెల్త్ స్కీమ్ వెల్నెస్ సెంటర్ ఏర్పాటుతో రాయ‌ల‌సీమ ప‌రిధిలోని కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగులు, విశ్రాంతి ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల‌కు వైద్యం అందుబాటులోకి రానుంది

Advertisement

Next Story