జగనన్న వచ్చాక ఈ లెక్క మారిపోయింది: మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు

by Seetharam |
జగనన్న వచ్చాక ఈ లెక్క మారిపోయింది: మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు అందడంలో ఆలస్యంపై మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు సెటైర్లు వేశారు. చంద్రబాబు హయాంలో దసరా, దీపావళి, రంజాన్‌ లాంటి ముఖ్యమైన పండుగలకు వారం ముందే ఉద్యోగులు జీతాలందుకునేవారని గంటా గుర్తు చేశారు. అలాంటి పరిస్థితి నుంచి‘జగనన్నా పండగొస్తోంది.. మా జీతాలన్నా.. మమ్మల్ని కరుణించన్నా’ అని అడుక్కునేలా పరిస్థితులు నెలకొన్నాయి అని ఆవేదన వ్యక్తం చేశారు. జీతాల విషయంలో అమ్మో ఒకటో తారీఖు అనేది పాత మాట అని.. ఇప్పుడు ఆ తేదీనే ఉద్యోగులు మర్చిపోయే పరిస్థితికి వచ్చిందన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఒకటో తేదీన జీతాలు పడిన సంఘటనలు చాలా అరుదుగా ఉన్నాయని మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు. ఈ మేరకు గంటా శ్రీనివాసరావు ట్వీట్ చేశారు.‘గతంలో ఉద్యోగులు, పెన్షనర్లకు ఒకటో తేదీ ఉదయాన్నే జీతం పడినట్లు మెసేజ్‌ వచ్చేది. జగనన్న వచ్చాక ఈ లెక్క మారిపోయింది. జీతం ఎప్పుడు వస్తుందో తెలియదు.. ఏ తేదీన వస్తుందో తెలియదు.. అంతా అయోమయం జగన్మాయగా మారిపోయింది. నెల నెలా ఈఎంఐలు ఎలా చెల్లించాలో తెలియక ఉద్యోగులు లబోదిబో మంటున్నారు. 2019లో రాష్ట్రానికి జరగకూడని నష్టమే జరిగిపోయింది. ఆంధ్రప్రదేశ్‌ ఉద్యోగుల పరిస్థితి మింగలేక.. కక్కలేక.. అనేలా తయారైంది. రాష్ట్రంలోని విద్యావంతులు ఆలోచించాలి. విజన్‌కు ఉన్న విలువ.. విధ్వంసం తెచ్చే వినాశనం ఏంటో ఇప్పటికే అర్థమై ఉంటుంది. 2024లో ఏపీ భవిష్యత్‌కు మీరు దిక్సూచిలా ముందుండాలి. రాష్ట్రాన్ని రక్షించుకోండి’ అని మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు ట్వీట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed