Thirupati Issue: లడ్డు అంశంలో పవన్ కళ్యాణ్‌కు ప్రకాశ్ రాజ్ స్ట్రాంగ్ కౌంటర్

by Ramesh Goud |
Thirupati Issue: లడ్డు అంశంలో పవన్ కళ్యాణ్‌కు ప్రకాశ్ రాజ్ స్ట్రాంగ్ కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఒక రాష్ట్రంలో జరిగిన సమస్యను ఎందుకు జాతీయంగా వ్యాపింపజేస్తున్నారని సినీ నటుడు ప్రకాశ్ రాజ్ అన్నారు. తిరుపతి లడ్డూ వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. జాతీయ స్థాయిలో సనాతన ధర్మ రక్షణ బోర్డు ని ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైనది అని ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన ప్రకాశ్ రాజ్ పవన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలో ఇది జరిగిందని, దయచేసి దీనిపై దర్యాప్తు చేసి, దోషులను కనుగొని కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే మీరు ఈ ఆందోళనలను ఎందుకు వ్యాపింపజేస్తున్నారని, సమస్యను జాతీయంగా ఎందుకు ఊదరగొడుతున్నారని ప్రశ్నించారు. అంతేగాక దేశంలో ఇప్పటికే మనకు తగినన్ని మతపరమైన ఉద్రిక్తతలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక కేంద్రంలోని మీ స్నేహితులకు ధన్యవాదాలు అంటూ.. చివరగా జస్ట్ ఆస్కింగ్ అనే హ్యాష్ ట్యాగ్ ను జత చేశారు.

కాగా లడ్డూ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని వచ్చిన ఓ ట్వీట్ కు ప్రతిస్పందనగా పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ఇందులో తిరుపతి బాలాజీ ప్రసాద్‌లో జంతువుల కొవ్వు (చేపనూనె, పందికొవ్వు మరియు గొడ్డు మాంసం కొవ్వు) కలిపినట్లు గుర్తించినందుకు మనమందరం తీవ్రంగా కలత చెందామని, వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డు ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పాలని అన్నారు. అలాగే సాధ్యమైనంత కఠిన చర్యలు తీసుకోవడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. కానీ, ఇది దేవాలయాల అపవిత్రత, దాని భూమి సమస్యలు, ఇతర ధార్మిక పద్ధతులకు సంబంధించిన అనేక సమస్యలపై వెలుగునిస్తుందని తెలిపారు. ఇక మొత్తం భారత్‌లోని దేవాలయాలకు సంబంధించిన అన్ని సమస్యలను పరిశీలించేందుకు జాతీయ స్థాయిలో 'సనాతన ధర్మ రక్షణ బోర్డు'ని ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. అంతేగాక జాతీయ స్థాయిలో విధాన నిర్ణేతలు, మత పెద్దలు, న్యాయవ్యవస్థ, పౌరులు, మీడియా, వారి సంబంధిత డొమైన్‌లందరిచే చర్చ జరగాలని సూచించారు. ‘సనాతన ధర్మాన్ని’ ఏ రూపంలోనైనా అపవిత్రం చేయడానికి ప్రయత్నిస్తే మనమందరం కలిసి రావాలని తాను భావిస్తున్నానని ఎక్స్ లో రాసుకొచ్చారు.




Next Story

Most Viewed