బొమ్మ తుపాకీతో బెదిరించి వృద్ధులను దోచేయాలనుకున్నారు.. చివరికి

by Seetharam |   ( Updated:2023-11-13 10:29:30.0  )
బొమ్మ తుపాకీతో బెదిరించి వృద్ధులను దోచేయాలనుకున్నారు.. చివరికి
X

దిశ, డైనమిక్ బ్యూరో : బొమ్మ తుపాకీతో బెదిరించి వృద్ధులను దోచేయాలని ప్లాన్ చేశారు వారంతా. అయితే వారి ప్రయత్నాలు ఫలించలేదు. గోడదూకి ఇంట్లోకి వెళ్లగా ఆ వృద్ధ దంపతులు వారిని అడ్డుకున్నారు. అంతేకాదు గట్టిగా కేకలు వేయడంతో వారు అక్కడ నుంచి పరారీ అయ్యారు. అయితే దొంగతనానికి వచ్చిన వారు అంతా అంతరాష్ట్ర దొంగలు కావడంతో పోలీసులకు కేసు విచారణ ఇబ్బందికరంగా ఉంటుందేమోనని అంతా భావించారు. కానీ ఆ వృద్ధ దంపతులు ఇంటికి రక్షణగా చేసుకున్న ఏర్పాట్లే దొంగలను పోలీసులకు పట్టించాయి. దీంతో పోలీసులు దొంగలను పట్టుకుని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరులో చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..వేల్పూరు బాలాజీ నగర్‌లో వృద్ధ దంపతులైన బండా బాబురావు భార్యతో కలిసి జీవిస్తున్నారు. అయితే ఈనెల 8న సాయంత్రం 6 గంటల సమయంలో బాబురావు ఇంటి కాలింగ్ బెల్ మోగింది. బాబూరావు ఇంటి తలుపు తెరిచి చూడగా ఇంటి బయట చేతిలో చెక్క తుపాకీ చాకుతో ముగ్గురు వ్యక్తులు బాబురావును బెదిరిస్తూ ఇంట్లోకి చొరబడడానికి ప్రయత్నించారు. అయితే బాబూరావు వారిని సమర్ధవంతంగా అడ్డుకున్నారు. ఆ పెనుగులాటలో బాబూరావు చేతికి గాయం అయినప్పటికీ వారిని ప్రతిఘటించడం ఆపలేదు. ఇంతలో భార్య దొంగలను చూసి గట్టిగా కేకలు వేసింది. దీంతో వారు అక్కడ నుంచి పరారయ్యారు.

దోపిడీకి భారీ స్కెచ్

దొంగతనం విఫలయత్నంపై బాబూరావు దంపతులు తణుకు రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే వృద్ధ దంపతులు ఏర్పాటు చేసుకున్న సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. తణుకు మండలం దువ్వలో ఓ ఫర్నిచర్ షాప్ ఉంది. షాపు యజమాని యూపీకి చెందిన వర్కర్లను తీసుకువచ్చి షాపులో మంచాలు, కుర్చీలు ఇతరత్రా సామాగ్రి వారితో తయారు చేయించి తన షాపులో అమ్మకాలు చేసేవాడు. దీంతో షాపులో పనిచేస్తున్న ఓ వ్యక్తి ఇటీవలే బాబూరావు ఇంట్లో ఫర్నీచర్ వర్క్ చేశాడు. అలాగే పాలిష్ పనుల నిమిత్తం బాబూరావు ఇంటికి వెళ్లాడు. అయితే ఆ సమయంలో ఇ ఇంట్లో ఇద్దరు వృద్ధులు మాత్రమే ఉంటున్నారని గమనించి దొంగతనానికి ప్లాన్ వేశారు. దొంగతనానికి తాము వస్తే గుర్తుపట్టేస్తారని భయంతో అదే షాపులో పనిచేస్తున్న తమ స్నేహితులైన మరో ముగ్గురిని దొంగతనం చేసేందుకు స్కెచ్ వేశారు. వృద్ధ దంపతులను బెదిరించడానికి ఓ చెక్క తుపాకీ, ఇనుప చాకులు సిద్ధం చేసుకుని దొంగతనానికి ప్రయత్నించి విఫలమయ్యారు.

యూపీకి చెందిన నిందితులు అరెస్ట్

ఇదిలా ఉంటే పోలీసు విచారణలో ఆ ఇంటి సీసీ ఫుటేజ్ కీలకంగా మారింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులను నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. అంతేకాదు ఇంటికి రక్షణగా బాబురావు సోలార్ ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేయడంతో దొంగతనానికి వీలు పడలేదని పోలీసులు తెలిపారు. నిందితులు యూపీకి చెందిన మహమ్మద్ సాధిక్, ఉస్మాన్, షాహి ఆలం, మహమ్మద్ హర్షద్‌లుగా పోలీసులు గుర్తించారు. ఈ దొంగతనంలో మరో భాగస్వామి అయిన మైనర్ దొంగ పరారయ్యాడు. ఆ మైనర్ దొంగను కూడా పట్టుకుంటామని పోలీసులు తెలియజేశారు. అలాగే దొంగతనానికి ఉపయోగించిన బొమ్మ తుపాకీ, రెండు చాకులు, ఓ తాడుని, సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed