- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీడీపీ - జనసేన నేతల్లో గుబులు.. అభ్యర్థుల తొలి జాబితా విడుదల మరింత జాప్యం
టీడీపీ –జనసేన కూటమి నేతల్లో సీటు గుబులు పట్టుకుంది. చంద్రబాబు తొలి జాబితా సిద్దం చేసినా విడుదలకు వెనకాడుతున్నారు. జనసేన పోటీ చేసే చోట్ల టీడీపీ నేతలు సహకరిస్తారా.. తిరుగుబావుటా ఎగరేస్తారా అనేది ముచ్చెమటలు పట్టిస్తోంది. ఇప్పటిదాకా ఇన్చార్జులుగా కొనసాగుతున్న నేతలు సీటు తమదేనన్నట్లు వ్యవహరించారు. రానున్న ఎన్నికల్లో విజయం తమదేనన్న ప్రచారాన్ని చంద్రబాబు వ్యూహాత్మకంగా పార్టీ యంత్రాంగంలోకి తీసుకెళ్లారు. కూటమి అధికారానికి వస్తే సీట్లు దక్కని నేతలకు సముచిత పదవులు కేటాయిస్తామనే భరోసా ఇచ్చేందుకు ఇది దోహదపడుతోంది. అయినా జనసేనకు కేటాయించే స్థానాల్లోని పార్టీ నేతలను బుజ్జగించడం అంత తేలిక్కాదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ, జనసేన అభ్యర్థుల తొలి జాబితాను ఎన్నికల నోటిఫికేషన్ వెలువడేదాకా విడుదల చేయకపోవచ్చని తెలుస్తోంది. టిక్కెట్ దక్కని నేతలు పక్క చూపులు చూసే అవకాశం లేకుండా చేయాలనేది చంద్రబాబు వ్యూహంగా కనిపిస్తోంది. ఎక్కడా ఇబ్బందుల్లేని నియోజకవర్గాల్లోనైనా తొలి విడత అభ్యర్థులను ఖరారు చేయాలని పార్టీ నాయకులు కోరుకుంటున్నారు. నోటిఫికేషన్ వెలువడేదాకా ఆగితే పార్టీ యంత్రాంగాన్ని ఏకతాటిపై నడిపించడం కష్టమని భావిస్తున్నారు. ప్రస్తుతం వివిధ నియోజకవర్గాల ఇన్చార్జులు ఖర్చు పెట్టడానికీ వెనకాడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని జనసేనకు కేటాయించాలనుకుంటున్న సీట్లను మినహాయించి తొలి జాబితా విడుదల చేస్తే బావుంటుందని పార్టీ శ్రేణుల నుంచి వినిపిస్తోంది.
చంద్రబాబు ముందుజాగ్రత్త..
ప్రధానంగా కృష్ణా జిల్లా నుంచి శ్రీకాకుళం దాకా టీడీపీ– జనసేన నేతల్లో ఆందోళన నెలకొంది. టీడీపీ బలంగా ఉన్న నియోజకవర్గాలను సైతం జనసేన కోరుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా పార్టీని నడిపించడానికి బోలెడు ఖర్చు పెట్టారు. చివరి నిమిషంలో టికెట్ లేదంటే ఏం చేయాలో దిక్కుతోచడం లేదని కొందరు నేతలు వాపోతున్నారు. జనసేన పోటీ చేయాలనుకుంటున్న స్థానాల్లో సైతం టీడీపీయే బలంగా ఉంది. అక్కడ ఓట్లు బదిలీ కావడం కత్తి మీద సామేననే అభిప్రాయం ఇరు పార్టీల్లో వ్యక్తమవుతోంది. సీట్ల పంపకం ఓ కొలిక్కి వస్తే సీటు దక్కదని భావించిన నేతలు తమదారి చూసుకునే అవకాశముంది. అందుకే చివరి నిమిషం దాకా అభ్యర్థులను టీడీపీ ప్రకటించకపోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.
వైసీపీ ఎత్తుగడ అదేనా..
మరోవైపు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపడుతున్న వైఎస్ షర్మిల దూకుడు ప్రదర్శించే అవకాశముంది. వైసీపీ నుంచి టిక్కెట్లు దక్కని నేతలను పార్టీలో చేర్చుకోవడానికి రంగం సిద్దమైంది. ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ వల్ల వైసీపీకే నష్టమని టీడీపీ, జనసేన నేతలు భావిస్తూ వచ్చారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును కూడా గణనీయంగా చీలిస్తే టీడీపీ – జనసేన విజయావకాశాలను సైతం దెబ్బతీసే ప్రమాదం లేకపోలేదు. ఈ కూటమిలో సీట్లు దక్కని నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశముంది. ఈ రెండు పార్టీల నుంచి రెబల్స్ అభ్యర్థులను ప్రోత్సహించేందుకు వైసీపీ కన్నేసినట్లు తెలుస్తోంది. అందువల్ల టీడీపీ–జనసేన మధ్య సీట్ల సర్దుబాటు, ఓట్ల బదిలీ కత్తిమీద సామేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.