Godavari flood:భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. గంటగంటకు పెరుగుతున్న వరద ఉధృతి

by Jakkula Mamatha |   ( Updated:2024-09-03 15:19:44.0  )
Godavari flood:భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. గంటగంటకు పెరుగుతున్న వరద ఉధృతి
X

దిశ, ఏలూరు:ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరిలో వరద ఉధృతి గంట గంటకు పెరుగుతుంది. మహారాష్ట్రలోని నాశిక్‌లో గత వారంగా కురిసిన భారీ వర్షాలకు గోదావరి ఉరకలేస్తోంది. భద్రాచలం వద్ద గంటకు అడుగు చొప్పున వరద నీరు పెరుగుతుండడంతో ఏలూరు జిల్లా కలెక్టర్‌ కె.వెట్రి సెల్వి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. భద్రాచలం వద్ద మంగళవారం ఉదయం 11 గంటలకు 32.40 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం గంటకు అడుగు చొప్పున పెరుగుతూ సాయంత్రం 5 గంటలకు 38.05 అడుగులకు చేరింది. భద్రాచలం వద్ద వరద నీటిమట్టం 43.00 అడుగులకు చేరితే నదిలో- 9 లక్షల 32 వేల 288 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్న సమయంలో భద్రాచలం వద్ద రాత్రి 9 గంటల లోపు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు.

48 అడుగులకు చేరితే నదిలో 11 లక్షల 44 వేల 645 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుంటుంది. అప్పుడు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. 53 అడుగులు నీటి మట్టం దాటిపోతే 14 లక్షల 26 వేల 684 క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తుంటుంది. దీన్ని అత్యంత ప్రమాదకర స్థాయిగా నిర్ణయించి 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. దీంతో దిగువన ఏలూరు జిల్లాలోని వేలేరుపాడు, కుక్కునూరు మండలలా నుండి పోలవరం ప్రాజెక్టు వద్దకు భారీ స్థాయిలో నీరు వచ్చి చేరుతోంది. భద్రాచలం వద్ద గోదావరిలో 5లక్షల 84 వేల 445 క్యూసెక్కుల వరద నీరు ప్రస్తుతం ప్రవహిస్తోంది. గంట గంటకు అడుగు చొప్పున పెరుగుతున్న వరద నీటి మట్టం నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు వద్దకు భారీగా వరద చేరింది. స్పిల్‌వే ఎగువన 29.550 మీటర్ల నీటిమట్టం నమోదయింది. దిగువన 19.980 మీటర్లు నమోదయింది. ప్రాజక్టు స్పిల్‌ వే నుండి 4లక్షల11వేల 238 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed