- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వ్యూహాలకు పదునేదీ? కొన్ని అంశాలకే పరిమితమైన టీడీపీ, జనసేన తొలి భేటీ
టీడీపీ, జనసేన పొత్తు ప్రకటన తర్వాత ఎట్టకేలకు తొలి అడుగుపడింది. లోకేశ్, పవన్ ఆధ్వర్యంలో రెండు పార్టీల సమన్వయ కమిటీలు భేటీ అయ్యాయి. ప్రధానంగా పోల్ మేనేజ్మెంటుతోపాటు కరెంటు చార్జీలు, ఇతర ప్రజా సమస్యలపై ఉమ్మడిగా పోరాడాలని నిర్ణయించాయి. ఇవన్నీ నిరంతరం కొనసాగాల్సినవే. ప్రత్యేకించి వైసీపీ సర్కారును వ్యతిరేకిస్తున్నదెవరు? ఏఏ సామాజిక వర్గాలు అసంతృప్తిగా ఉన్నాయి? ఈ వర్గాలను ఓట్ల రూపంలోకి మార్చుకోవడమెలా? అనే అంశాలు చర్చల్లో చోటు చేసుకోలేదు. బీజేపీ, వైసీపీల రహస్య బంధాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లకుండా వైసీపీ విముక్త రాష్ట్రాన్ని ఎలా సాధిస్తారనేది రెండు పార్టీల శ్రేణుల్లో చర్చనీయాంశమవుతోంది.
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షాన్ని కేసులు, కోర్టుల చుట్టూ తిప్పుతూ ప్రజా సమస్యలను పక్కదారి పట్టించడంలో అధికార పార్టీ విజయం సాధించింది. ప్రతి నియోజకవర్గంలో టీడీపీ సానుభూతిపరుల ఓట్లను ఫాం 7 దరఖాస్తులతో తొలగింపు కార్యక్రమాన్ని చాపకింద నీరులా చేపట్టింది. ఇప్పటికీ 50 లక్షల ఓట్లపై అనుమానాలను నివృత్తి చేయకుండా ఎన్నికల సంఘం చేతులెత్తేసింది. పోల్ మేనేజ్మెంటుకు సంబంధించి ఓటర్ల చేర్పులు, తొలగింపులకు సంబంధించి బూత్ స్థాయిలో నిరంతరం పరిశీలన ఉండాలి. ఎప్పటికప్పుడు అధికారులకు ఫిర్యాదు చేయడం, స్పందించకుంటే ఆందోళనకు దిగడమనేది ఎన్నికలదాకా పర్యవేక్షణ కొనసాగాలి. ఈ అంశాలపై దృష్టి సారించాలని టీడీపీ, జనసేన సమన్వయ కమిటీలు నిర్ణయించాయి.
వారిని ఆకట్టుకునే యోచనేదీ?
వైసీపీకి వెన్నుదన్నుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలను ఎలా రాబట్టుకోవాలనే దానిపై రెండు పార్టీల సమన్వయ కమిటీల్లో చర్చకు రాలేదు. ఎప్పటినుంచో అమలవుతున్న సుమారు 29 సంక్షేమ పథకాలను రద్దు చేసిందని ఎస్సీ, ఎస్టీలు జగన్ సర్కారుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎన్ఎస్ఎఫ్డీసీ, ఎన్ఎఫ్టీడీసీలాంటి కేంద్ర పథకాలతో స్వయం ఉపాధి పొందే కార్యక్రమాలను ప్రభుత్వం అటకెక్కించిందని గుర్రుగా ఉన్నారు. మరీ ముఖ్యంగా భూమి కొనుగోలు పథకాన్ని అమలు చేయకపోవడాన్ని ఎస్సీ ఎస్టీలు తీవ్రంగా నిరసిస్తున్నారు. ఈ వర్గాలకు ఎలాంటి హామీలు ఇవ్వడం ద్వారా తమ వైపు తిప్పుకోవాలనేది టీడీపీ, జనసేన సమన్వయ భేటీలో చర్చకు రాలేదు. అలాగే కౌలు రైతులు, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపైనా దృష్టి పెట్టాలి.
ఆ వర్గాలకు చేరువయ్యే మార్గం..
ఇటీవల మణిపూర్ మారణకాండపై కేంద్ర సర్కారు తీరును నిరసిస్తూ ముస్లిం, క్రైస్తవులు పెద్ద ఎత్తున రోడ్డెక్కారు. దేశ వ్యాప్తంగా ఈ రెండు వర్గాల్లో తీవ్ర అభద్రత నెలకొంది. కేంద్రంలోని బీజేపీతో వైసీపీకి ఉన్న అనుబంధాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లకుండా ఆయా వర్గాలను టీడీపీ, జనసేన కూటమి వైపు తిప్పుకోవడం సాధ్యం కాదు. మతపరంగా ప్రజల్లో చీలిక తెచ్చి ఓట్లు కొల్లగొట్టాలని చూస్తున్న శక్తులకు వైసీపీ అండగా నిలుస్తోంది. దీనిని ప్రజల్లో ఎండగడితేనే ముస్లిం, క్రిస్టియన్ వర్గాలకు టీడీపీ, జనసేన మరింత చేరువవుతాయి. ఈ అంశంపై కూడా రెండు పార్టీలు కేంద్రీకరించలేదు.
దగా చేసిన వారిని వదలవద్దు..
ఇక రాష్ట్రానికి విభజన హామీలు నెరవేర్చకుండా దగా చేసిన కేంద్ర సర్కారు చేతిలో రాష్ట్ర ప్రభుత్వం కీలుబొమ్మగా మారింది. ప్రత్యేక హోదా నుంచి వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీలు, పోలవరం నిర్మాణం, విశాఖ స్టీల్ ప్లాంటు అమ్మకం, నెరవేరని విభజన హామీల్లాంటివి చాలా ఉన్నాయి. పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరల పెంపు, నిత్యావసరాలపై జీఎస్టీ పన్నుల బాదుడుతో సగటు ప్రజలను పీల్చిపిప్పిచేస్తున్నాయి. ఈ అంశాలన్నింటిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను టార్గెట్ చేయకుండా సామాన్య ప్రజల మద్దతు పొందలేరు. మరో భేటీలోనైనా ఈ అంశాలపై సమగ్రంగా చర్చించి కార్యాచరణను రూపొందించుకోవాలనే అభిప్రాయం రెండు పార్టీల శ్రేణుల నుంచి వ్యక్తమవుతోంది.