ఆ రెండు సీట్లపై రాజుకున్న వివాదం.. సై అంటే సై అంటున్న జేసీ, పరిటాల కుటుంబాలు

by Shiva |
ఆ రెండు సీట్లపై రాజుకున్న వివాదం.. సై అంటే సై అంటున్న జేసీ, పరిటాల కుటుంబాలు
X

దిశ ప్రతినిధి, అనంతపురం: ఎన్నికలు సమీపించే కొద్దీ అనంతపురం జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. తాజాగా, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, మాజీమంత్రి పరిటాల సునీత చేసిన ప్రకటనలు వారి వర్గీయుల్లో ఉత్సాహం నింపుతుండగా.. వ్యతిరేక వర్గీయులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. అదే సమయంలో పార్టీ శ్రేణులను గందరగోళంలో పడేస్తున్నాయి.

ఆ రెండు స్థానాలూ మావే: జేసీ ప్రభాకర్ రెడ్డి

రాబోయే ఎన్నికల్లో టీడీపీ తరఫున జేసీ కుటుంబం నుంచి ఇద్దరు అభ్యర్థులు పోటీ చేస్తారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. పెద్ద వడుగూరు మండలంలో యువ చైతన్య బస్సు యాత్ర ముగింపు సందర్భంగా ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాడిపత్రి ఎమ్మెల్యే స్థానంతో పాటు అనంతపురం ఎంపీ స్థానం కూడా టీడీపీ అధినేత చంద్రబాబు తమకే కేటాయిస్తారన్నారు. తమది సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం కాబట్టి ఒక కుటుంబానికి ఒకే టికెట్ నిబంధన తమకు వర్తించదని అన్నారు.

అనంతపురం ఎంపీగా తన సోదరుడైన జేసీ దివాకర్ రెడ్డి తనయుడు జేసీ పవన్ రెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యేగా తన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి పోటీ చేస్తారని స్పష్టం చేశారు. బీసీ అభ్యర్థికి అధికార వైసీపీ అనంతపురం ఎంపీ స్థానాన్ని కేటాయించినందున టీడీపీ కూడా బీసీ అభ్యర్థికే ఆ టికెట్ కేటాయిస్తుందని ప్రచారం జరుగుతోంది కదా అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు కుండబద్దలు కొట్టినట్టు ఆయన సమాధానమిచ్చారు. అనంతపురం ఎంపీ నియోజకవర్గం ఓసీ నియోజకవర్గమని తెలిపారు.

మొదటి నుంచి అక్కడ ఓసీ అభ్యర్థులే పోటీ చేస్తున్నారని గుర్తు చేశారు. రెండుసార్లు మాత్రమే బీసీ అభ్యర్థులు అక్కడ గెలుపొందారని పేర్కొన్నారు. నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడని వ్యక్తికి మళ్లీ టికెట్ ఇవ్వాలా.. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంటే నిబంధనలు పక్కన పెట్టాలా.. అనే ప్రశ్నలకు పవన్ రెడ్డి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే పక్షంలో సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. చంద్రబాబు ఈ అంశాలేవీ పరిగణన లకి తీసుకోకుండా టికెట్ కేటాయిస్తారా.. జేసీ వ్యాఖ్యాలతో జత కడతారా అనేది ఆసక్తికరంగా మారింది.

తమకే టికెట్లు అని పరిటాల సునీత ధీమా

రాప్తాడు, ధర్మవరం నుంచి తాను, తన కుమారుడు పరిటాల శ్రీరామ్ పోటీ చేస్తామని పరిటాల సునీత స్పష్టం చేశారు. చెన్నేకొత్తపల్లి మండలం కనుముక్కల గ్రామంలో రెండు రోజుల క్రితం ఆమె మాట్లాడారు. ఆ రెండు చోట్లా నియోజకవర్గ ఇన్చార్జీలుగా పరిటాల సునీత, శ్రీరామ్ కొనసాగుతున్నారు. కాబట్టి వారికే టికెట్లు వస్తాయనే ఎవరైనా అనుకుంటారు. కానీ, ఒక కుటుంబానికి ఒకే టికెట్ నిబంధనను ఏమి చేస్తారనేది అర్థం గాని ప్రశ్నగా మిగిలింది. 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా టీడీపీ తరఫున గెలుపొంది, 2019 ఎన్నికల్లో అదే పార్టీ తరఫున ఓటమి చవిచూసిన గోనుగుంట్ల సూర్యనారాయణ ఆ తరువాత బీజేపీలో చేరారు. ఇప్పుడు తిరిగి టీడీపీ గూటికి చేరుకుని ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చూస్తున్నారు.

ఒకే కుటుంబానికి రెండు చోట్ల టికెట్ ఇస్తే ప్రచారం పరంగా ఇబ్బందులు తప్పని అధిష్టానం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇలాంటి తరుణంలో అటు జేసీ ప్రభాకర్ రెడ్డి, ఇటు పరిటాల సునీత చేసిన ప్రకటనలు మరోసారి జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే అనంతపురంలో ప్రభాకర్ చౌదరి, జేసీ వర్గాలుగానూ, ధర్మవరంలో పరిటాల శ్రీరామ్, గోనుగుంట్ల సూర్యనారాయణ వర్గాలుగానూ పార్టీ శ్రేణుల్లో విభజన వచ్చింది. ఒకరికి టికెట్ ఇస్తే మరొకరు వ్యతిరేకంగా పనిచేస్తారనే ప్రచారం జరుగుతోంది. చిక్కుముడిగా మారిన ఈ సమస్యను పార్టీ అధినేత చంద్రబాబు ఎలా పరిష్కరిస్తారో చూడాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed