పిఠాపురంలో పవన్ కల్యాణ్ స్థానంలో TDP నేత.. సజ్జల సంచలన వ్యాఖ్యలు

by GSrikanth |
పిఠాపురంలో పవన్ కల్యాణ్ స్థానంలో TDP నేత.. సజ్జల సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో చంద్రబాబు వందల హామీలు ఇచ్చి తుంగలో తొక్కారని విమర్శించారు. టీడీపీ హయాంలో రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టారని అన్నారు. ఇప్పుడు టీడీపీ నేతలకు బీజేపీ కండువాలు కప్పి టికెట్లు ఇప్పించుకున్నారని విమర్శలు గుప్పించారు. అంతేకాదు.. జనసేనకు ఇచ్చిన సీట్లలోనూ టీడీపీ నేతలనే బరిలోకి దింపారని కీలక ఆరోపణలు చేశారు. ఇదంతా అందరికీ తెలిసినా జనసేన, బీజేపీ వాళ్లు ఎందుకు ఒప్పుకుంటున్నారో తెలియడం లేదని ఎద్దేవా చేశారు. పిఠాపురంలోనూ పవన్ కల్యాణ్‌ను మార్చి టీడీపీ నేతను పెట్టే ఆలోచన చేస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఒంటరిగా జగన్‌ను ఢీకొట్టే సత్తా చంద్రబాబుకు ఏనాడూ లేదని అన్నారు.

చంద్రబాబు జనాల్లో పుట్టిన నేత కాదు. సొంత మామకు వెన్నుపోటు పొడిచి రాజకీయాల్లోకి వచ్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కూటమి పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా మారిందని అన్నారు. కూటమిలో తండ్రి చంద్రబాబు, కొడుకు లోకేష్ రాజకీయం మాత్రమే నడుస్తోందని.. జనసేన, బీజేపీ లీడర్లు నామమాత్రంగా చూస్తూ ఉండిపోయే పరిస్థితికి వచ్చారని విమర్శించారు. వీరితో పాటు కూటమి అధికారంలోకి రావాలని మెగాస్టార్ చిరంజీవి కూడా కోరుకుంటున్నారని చెప్పారు. బ్యాంకులను మోసం చేసిన వ్యక్తికి ఈ ఎన్నికల్లో చిరంజీవి మద్దతు ఇచ్చారని మండిపడ్డారు. చంద్రబాబు డ్రామాలో షర్మిలది కీలక పాత్ర అని సెటైర్ వేశారు. వ్యూహాత్మకంగానే షర్మిలను ఏపీకి తీసుకొచ్చారని అన్నారు. వాలంటీలర్ల రాజీనామాలను ఆమోదించవద్దని హైకోర్టుకు వెళ్లడం ఏంటని ప్రశ్నించారు.

Advertisement

Next Story

Most Viewed