అభివృద్ధి, అవినీతిపై ప్రమాణానికి సిద్ధమా..? వైసీపీ ఎమ్మెల్యేకు టీడీపీ నేత సవాల్

by sudharani |   ( Updated:2023-03-22 16:42:36.0  )
అభివృద్ధి, అవినీతిపై ప్రమాణానికి సిద్ధమా..?  వైసీపీ ఎమ్మెల్యేకు టీడీపీ నేత సవాల్
X

దిశ, డైనమిక్ బ్యూరో : సవాళ్లు ప్రతిసవాళ్లతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయం హీటెక్కింది. అభివృద్ధిపై చర్చించేందుకు సిద్ధమా అంటూ అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రతిపక్ష నేతల మధ్య సవాళ్లు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తుంటే పోలీసులకు మాత్రం ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. దమ్ముంటే చర్చకు రావాలని ఛాలెంజ్‌లు చేసుకుంటున్నారు. వేదికను సైతం ప్రెస్‌మీట్ పెట్టి మరీ ప్రకటనలిచ్చేస్తున్నారు. ఒకవేళ చర్చకు సై అంటూ నేతలు వెళ్లి చర్చకు దిగితే ఎలాంటి అవాంఛనీయ సంఘనలు జరుగుతాయోనని పోలీసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ నేపథ్యంలో నేతలను అదుపులోకి తీసుకుని బహిరంగ చర్చ జరగకుండా ఉండేందుకు అపసోపాలు పడుతున్నారు.

ఉగాది పర్వదినాన సైతం పోలీసులకు ఈ తిప్పలు తప్పలేదు. నరసరావుపేట అభివృద్ధిపై చర్చకు టీడీపీ ఇన్‌చార్జి చదలవాడ అరవింద్ బాబు, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిలు సవాళ్లు విసురుకున్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి, అవినీతి ఆరోపణలపై ప్రమాణం చేసేందుకు ఉగాది రోజున కోటప్పకొండకు రావాలని టీడీపీ ఇన్‌చార్జి చదవాడ అరవింద్ బాబు ఛాలెంజ్ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. టీడీపీ నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేశారు. దీంతో నరసరావుపేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

హీటెక్కించినన సవాళ్లు ప్రతిసవాళ్లు

నరసరావుపేట నియోజకవర్గంలో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. టీడీపీ ఇన్‌చార్జి చదలవాడ అరవింద్ బాబు, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డిలు చేసుకున్న సవాళ్లు నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీశాయి. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పై చదలవాడ అరవింద్ బాబు అవినీతి ఆరోపణలు చేశారు. నియోజకవర్గాన్ని అక్రమాలకు అడ్డగా మార్చేశారని ఆరోపించారు. నరసరావుపేట నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదని కానీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాత్రం అభివృద్ధి చెందుతున్నారని ఆరోపించారు.

ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై అవినీతి ఆరోపణలు నిరూపిస్తానని దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు. అవినీతి చేశారని అందుకు తగ్గ సాక్ష్యాలు తమవద్ద ఉన్నాయని చేయలేదని కోటప్పకొండలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రమాణం చేస్తారా అని ప్రశ్నించారు. టీడీపీ ఇన్‌చార్జి చదలవాడ సవాల్‌ను ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్వీకరించారు. దమ్ముంటే నియోజకవర్గం అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. ప్రమాణం చేసేందుకు తాను సిద్ధమన్నారు. అంతేకాదు నియోజకవర్గం అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. సవాళ్లు ప్రతిసవాళ్లతో నియోజకవర్గం ఒక్కసారిగా అట్టుడుకిపోయింది.

భారీగా మోహరించిన పోలీసులు

సవాళ్లకు ఫిక్స్ చేసుకున్న డేట్ రానే వచ్చేసింది. ఉగాది పర్వదినమైన బుధవారం చర్చకు సిద్ధమని నేతలు ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు చర్యలకు ఉపక్రమించారు. కోటప్పకొండ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. అలాగే ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, టీడీపీ ఇన్‌చార్జి చదలవాడ అరవింద్ బాబుల నివాసాల వద్ద భారీగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై తాను చేసిన అవినీతి ఆరోపణలు నిరూపిస్తానని అలాగే నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి శూన్యమని నిరూపిస్తానని బయలు దేరుతుండగా గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అరవింద్ బాబును హౌస్ అరెస్ట్ చేశారు. కోటప్పకొండ వెళ్లేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు.

అడ్డుకోవడమంటే ఓటమిని అంగీకరించినట్లే :చదలవాడ

ముందస్తు అరెస్ట్ చేయడంపట్ల టీడీపీ ఇన్‌చార్జి చదలవాడ అరవింద్ బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్చకు జిల్లా ఎస్పీ అనుమతి కోరినట్లు చెప్పుకొచ్చారు. అయినప్పటికీ పోలీసులు ముందుస్తు హౌస్ అరెస్ట్ చేయడం అన్యాయమన్నారు. ఇదంతా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఓటమికి నిదర్శనమంటూ అరవింద్ బాబు అన్నారు. అవినీతి ఆరోపణలపై ప్రమాణం చేయటానికి తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అవినీతి , అక్రమ, అసత్య రాజకీయాలు చేయటంలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి దిట్ట అంటూ అరవింద్ బాబు ఆరోపించారు. గోపిరెడ్డి ప్రతి అడుగులో అవినీతి ఉందని అందుకు తగిన ఆధారాలు తమ వద్ద ఉన్నట్లు వెల్లడించారు. అంతేకాదు ఇసుక, రేషన్, గుట్కా, మట్కా, గంజాయి, ల్యాండ్ మాఫియా అన్నింటిలోనూ ఎమ్మెల్యే గోపిరెడ్డిదే ప్రధాన హస్తం అని ఆరోపించారు. దోచుకో, దాచుకో అన్న చందంగా నియోజకవర్గంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాలన ఉందంటూ టీడీపీ ఇన్‌చార్జి చదలవాడ అరవింద్ బాబు ఆరోపించారు.

టికెట్ కోసం హైడ్రామా: ఎమ్మెల్యే గోపిరెడ్డి

టీడీపీ ఇన్‌చార్జి చదలవాడ అరవింద్‌బాబు విసిరిన సవాళ్లకు తాను రాలేకపోయానని వస్తున్న ప్రచారంపై ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకాకముందు చర్చకు తాను సిద్ధమని ప్రకటించినట్లు గుర్తు చేశారు. అలాగే ఉగాది రోజున అధికార యంత్రాంగం ఉండదని కాబట్టి ఈనెల 13 నుంచి 20 లోపు ఎప్పుడైనా చర్చకు తాను సిద్ధమేనని ఈనెల 13న తాను ప్రకటించినట్లు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. వీటిపై స్పందించకుండా అకస్మాత్తుగా మీడియా ముందుకు వచ్చి ఉగాది రోజున చర్చకు రావాల్సిందే అంటూ ప్రకటించడంపై మండిపడ్డారు.

అవినీతి చేయలేమని ప్రమాణం చేసేందుకు తాను సిద్ధమని మరోసారి ప్రకటించారు. నరసరావుపేట ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న చదలవాడ అరవింద్ బాబుకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు టికెట్ కన్ఫమ్ చేయలేదని అందువల్లే డ్రామాలు ఆడుతున్నారని విరుచుకుపడ్డారు. చంద్రబాబు దృష్టిలో పడేందుకు..తన ఉనికిని చాటుకునేందుకు ఇలాంటి హైడ్రామా క్రియేట్ చేస్తున్నాడని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. ఉగాది తరువాత ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు తాను సిద్ధంగా ఉన్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు.

ఇవి కూడా చదవండి :

YCP Vs TDP: ఎమ్మెల్యే గోపిరెడ్డి ప్రజలకు క్షమాపణలు చెప్పాలి

మమ్మల్ని ఎదగనివ్వడంలేదు... అది మాత్రం ఎప్పటికీ ఫలించదు: Somu Veerraju

Advertisement

Next Story