Nara Chandra Babu Naidu : ఇక దూకుడే..! రేపటి నుంచి సీమలో పర్యటన

by sudharani |   ( Updated:2023-07-31 15:57:05.0  )
Nara Chandra Babu Naidu : ఇక దూకుడే..! రేపటి నుంచి సీమలో పర్యటన
X

నిత్యం జనంలో ఉండే ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు గత నెల రోజుల నుంచి స్తబ్దుగా ఉండిపోయారు. నియోజకవర్గాల సమీక్షలు, పార్టీ అంతర్గత సమావేశాలకే పరిమితమయ్యారు. నీటిపారుదల ప్రాజెక్టులపై వరుస మీడియా సమావేశాలు నిర్వహించారు. ఆగస్టు నుంచి రాష్ట్ర సర్కారుపై బహుముఖ దాడికి సిద్దమయ్యారు. ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యంపై గురి పెడుతున్నారు. తొలుత సీమ జిల్లాల నుంచి ఆయన పర్యటన ప్రారంభమవుతుంది. మరోవైపు స్త్రీ శక్తి పేరుతో ఎంపిక చేసిన మహిళా కార్యకర్తలతో నియోజకవర్గాల పర్యటనలు ఖరారు చేశారు. ఇంకోవైపు యథావిధిగా నారా లోకేశ్​ యువగళం యాత్ర సాగుతుంది. ఇలా మూడు వైపుల నుంచి ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు చంద్రబాబు సిద్దమయ్యారు.

దిశ, ఏపీ బ్యూరో : గత ఎన్నికల ముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో కొనసాగుతున్న సుమారు 198 నీటి పారుదల ప్రాజెక్టుల పనులను వైసీపీ సర్కారు రాగానే నిలిపేసిందని చంద్రబాబు నాయుడు చెబుతున్నారు. 2014 –2019 మధ్య కాలంలో ప్రాజెక్టులకు రూ.68 వేల కోట్లు ఖర్చు పెట్టినట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం గడచిన నాలుగేళ్లలో కేవలం రూ.2011 కోట్లు మాత్రమే వెచ్చించినట్లు పేర్కొంటున్నారు.

సీమ ద్రోహి జగన్..

ప్రధానంగా రాయలసీమ ప్రాజెక్టుల పనులన్నీ నిలిపేసి సీఎం జగన్​ సీమ ద్రోహిగా మారినట్లు చంద్రబాబు ఆరోపిస్తున్నారు. అందుకే ఆగస్టు 1 నుంచి అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లోని ప్రాజెక్టుల సందర్శించడానికి సిద్దమయ్యారు. చంద్రబాబు వ్యాఖ్యలపై మంత్రి అంబటి దీటుగా సమాధానం ఇచ్చారు. ప్రాజెక్టుల పేరుతో జరుగుతున్న దోపిడీని మాత్రమే తాము నిలువరించామన్నారు. పనులు మాత్రం కొనసాగుతూనే ఉన్నట్లు కౌంటర్​ ఇచ్చారు.

మహిళల ప్రచారంపై ఆశలు..

ప్రస్తుతం నియోజకవర్గాలవారీగా టీడీపీ నాయకుల బస్సు యాత్రలు కొనసాగుతున్నాయి. ఈ యాత్రలకు ప్రజల నుంచి ఆశించిన మేర స్పందన వస్తున్నట్లు కనిపించడం లేదు. దీంతో స్త్రీ శక్తి పేరుతో ఎంపిక చేసిన మహిళా కార్యకర్తలతో నియోజకవర్గాల్లో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ప్రతి రోజు ఎంపిక చేసుకున్న నియోజకవర్గాల్లో ఇంటింటికీ వెళ్లి మహిళలను కలుస్తారు. ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాల కంటే ప్రతి కుటుంబం నుంచీ ప్రభుత్వం ఎంత ఎక్కువ దోపిడీ చేస్తున్నదో వివరిస్తారు. టీడీపీ మినీ మేనిఫెస్టో గురించి తెలియచేస్తారు. ఈ ప్రోగ్రాం సత్ఫలిస్తుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.

మారనున్న లోకేశ్ ప్రసంగాలు..

ఇంకోవైపు యువనేత నారా లోకేశ్​ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. ఇక నుంచి లోకేశ్​ పాదయాత్రలో పలు మార్పులు చేసుకోనున్నాయి. సీఎం జగన్​తోపాటు ప్రభుత్వంపై విమర్శలు తగ్గించి టీడీపీ అ ధికారానికి వస్తే ఏం చేస్తుందనే దానిపైనే ఎక్కువగా ఫోకస్​ పెట్టాలని భావిస్తున్నారు. లోకేశ్​ హామీ ఇస్తే తప్పకుండా నెరవేరుస్తారనే విశ్వసనీయతను పెంచేట్లు ఆయన ప్రసంగాలుంటాయని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ప్రత్యేకించి పార్టీ అధికారానికి వస్తే యువత, మహిళల కోసం వినూత్నంగా చేపట్టనున్న కార్యక్రమాలపై కసరత్తు చేస్తున్నారు. ఇలా ప్రభుత్వంపై ముప్పేట దాడి చేసేందుకు చంద్రబాబు వ్యూహాలు అమలు చేస్తున్నట్లు ఆ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఈ దఫా ఎన్నికల్లో విజయం సాధించడానికి చంద్రబాబు అన్నిరకాలుగా ప్రయత్నిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి India Today Survey : YCP కి తగ్గనున్న సీట్లు, TDP కి బూస్ట్..పత్తాలేని Janasena

Advertisement

Next Story

Most Viewed