పచ్చి మోసం.. cm Jaganపై Somireddy ఆగ్రహం

by srinivas |   ( Updated:2022-11-28 14:52:18.0  )
పచ్చి మోసం.. cm Jaganపై Somireddy ఆగ్రహం
X

దిశ, డైనమిక్ బ్యూరో: సున్నా వడ్డీ రుణాలు, ఇన్ పుట్ సబ్సిడీ విషయంలో వైసీపీ ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. సున్నా వడ్డీ కోసం కోట్లాది రూపాయలు ఇచ్చామని చెప్పుకుంటున్న వైసీపీ ప్రభుత్వం వడ్డీ కూడా రైతుల చేతే కట్టిస్తోందని ఆయన తెలిపారు. టీడీపీ హయాంలో రైతు లక్ష రూపాయలు లోన్ తీసుకుంటే వడ్డీ ప్రభుత్వమే కట్టేదని గుర్తు చేశారు. చంద్రబాబు హయాంలో 35 లక్షల మందికి రూ.1719.36 కోట్లు సున్నా వడ్డీ చెల్లించేటట్లు చేసినట్లు పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం ఈ ఏడాది 8 లక్షల 22 వేల మందికి ఇచ్చామని ప్రకటిస్తుందంటే ఎంతమందిని అనర్హులుగా చేసిందో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. వైఎస్ జగన్ మూడున్నరేళ్ల పాలనలో రైతులకు లక్ష 37 వేల 975 కోట్లు ఇచ్చినట్లు పత్రికల్లో అడ్వర్టైజ్ మెంట్ ఇవ్వడం పచ్చి మోసమని సోమిరెడ్డి మండిపడ్డారు.

'ధాన్యం కొనుగోలు 48వేల 793 కోట్లు అనటం అన్యాయం. ఇతర పంటలకు 7,156 కోట్లు ఇచ్చామనడం పచ్చి మోసం. ఉచిత విద్యుత్ 27,800 కోట్లు అనడం దగా. ఆక్వా రైతులకు కరెంటు సబ్సిడీ 2,647 కోట్లు అనడం రైతులను మోసం చేయడమే. కోట్ల రూపాయలు అడ్వర్‌టైజ్‌మెంట్లకు తగలేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు.' అని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. ధాన్యం కొనుగోలుకి 48 వేల 793 కోట్లు, ఇతర పంటలకు 7,156 కోట్లు ఇచ్చామనడం పచ్చి మోసమని మండిపడ్డారు. కష్టాల్లో ఉన్న అన్నదాతలను ఆదుకోవాల్సిన జగన్ రెడ్డి మోసపూరిత ప్రకటనలతో వంచిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్‌కి రైతులంటే ద్వేషమని ఆరోపించారు. అన్నంపెట్టే రైతుల కష్టం జగన్‌కు తెలియదని విమర్శించారు. పక్క రాష్ట్రం తెలంగాణలో ఎకరాకు 10 వేలు చొప్పున ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు రైతు పథకం ఇస్తుంటే మన రాష్ట్రంలో రైతు భరోసా పథకం కింద రూ.7,500 ఇవ్వడం మోసం కాదా? అని నిలదీశారు. తెలంగాణలో 24 గంటలు విద్యుత్ సరఫరా ఇస్తుంటే మన రాష్ట్రంలో 7 గంటలే విద్యుత్ ఇస్తున్నారని.. ఇది మోసం కాదా? అని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిలదీశారు

Advertisement

Next Story

Most Viewed