BRSతో పొత్తుకు సై...ఢిల్లీ పెద్దలకు Ycp చెక్​!

by srinivas |   ( Updated:2022-12-13 15:12:01.0  )
BRSతో పొత్తుకు సై...ఢిల్లీ పెద్దలకు Ycp చెక్​!
X

దిశ, ఏపీ బ్యూరో: "ప్రత్యేక హోదా, సకాలంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. పోరాడడమంటే కర్రలు తీసుకొని కొట్టుకోవడం కాదు కదా. కేంద్ర ప్రభుత్వాన్ని అనేక వేదికలపై నుంచి అడుగుతూ వస్తున్నాం. కేంద్రాన్ని అడగాల్సింది అడుగుతూనే ప్రజలకు ఏం చెప్పాలో అది చెబుతాం. బీఆర్‌ఎస్‌తో పొత్తనేది ఇప్పటికింకా పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అవసరమైతే ఆలోచిస్తాం." అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు తెలుగు రాజకీయవర్గాల్లో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతుందని ఈపాటికే పార్టీ సీనియర్​నేత, మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలతో వైసీపీ ఢిల్లీ పెద్దలతో తాడోపేడో తేల్చుకోవాలని భావిస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

ఇప్పటిదాకా అటు కేంద్రంలోగానీ, ఇటు రాష్ట్రంలోగానీ బీజేపీకి ప్రత్యామ్నాయంగా జాతీయ స్థాయిలో ప్రభావం చూపగలిన పార్టీ ఒక్కటీ లేదు. గత్యంతరం లేని స్థితిలోనే వైసీపీ కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సామరస్యంగా మెలుగుతూ పనులు చక్కబెట్టుకుంటూ వస్తోంది. అప్పుల కోసం కేంద్రం విధించిన అనేక షరతులను రాష్ట్రంలో తూచా తప్పకుండా అమలు చేస్తున్నారు. పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్​ ధరలు పెంచుతున్నా నోరు మొదపలేక పోయింది. కేంద్రానికి సంబంధం లేని నదీ జలాల విషయంలో మితిమీరిన జోక్యం చేసుకుంటున్నా మౌనం వహించింది. కేంద్ర పెద్దల మౌఖిక ఆదేశాలతోనే పోర్టులను అదానికీ అప్పగించారు. చివరకు ఒకటికి నాలుగు రెట్లు అధిక ధరలతో అదానీ బొగ్గు కొనాలని అదేశించినా వైసీపీ ప్రభుత్వం కిక్కురుమనలేదు.

ఇంకా విద్యుత్​ సంస్కరణలను పలు రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నా వైసీపీ ప్రభుత్వం కిమ్మనకుండా అమలు చేస్తోంది. వ్యవసాయ పంపుసెట్లకు స్మార్టు మీటర్లు బిగిస్తోంది. త్వరలో విద్యుత్​పంపిణీ రంగాన్ని ప్రైవేటు చేతిలో పెట్టేందుకు వెనుకాడడం లేదు. ఇంకా అర్బన్​సంస్కరణల్లో భాగంగా ఆస్తి, చెత్తపై పన్నులు విధిస్తున్నారు. నీళ్లకు మీటర్లు ఏర్పాటు చేస్తున్నారు. కాలక్రమంలో అవన్నీ రాష్ట్ర ప్రభుత్వం మెడకు చుట్టుకుంటాయని తెలిసినా వైసీపీ సర్కారు అప్పటికప్పుడు గట్టెక్కడానికి కేంద్రం చెప్పిందల్లా చేస్తూ వచ్చింది. ఇటీవల ప్రధాని విశాఖ పర్యటన నుంచి ఇరువురి మధ్య సంబంధాలు ఏవో బెడిసి కొట్టినట్లు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

తాజాగా ఏపీకి ప్రత్యేక హోదా ప్రసక్తే లేదని కేంద్రం స్పష్టం చేసింది. పోలవరం ప్రాజెక్టును 2024 నాటికి పూర్తి చేయడం కుదరదని తేల్చేసింది. సవరించిన అంచనాల ప్రకారం నిధులు ఇచ్చేది లేదని ఈపాటికే కేంద్ర సర్కారు మెలిక పెట్టిన సంగతి తెలిసిందే. మంగళవారం రాజ్యసభలో విభజన హామీలపై టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర మంత్రి పంకజ్​చౌదరి ఇచ్చిన సమాధానం వైసీపీ సర్కారును మరింత ఇరుకున పెట్టింది. ఇప్పటిదాకా రాజధాని నిర్మాణానికి రూ.2,500 కోట్లు ఇచ్చినట్లు మంత్రి వెల్లడించారు. మూడు రాజధానుల ప్రస్తావన లేనేలేదు. విశాఖ స్టీల్​ ప్లాంటుపై సీఎం జగన్, వైసీపీ ఎంపీలు చేస్తున్న సూచనలను కూడా కేంద్రం తోసిపుచ్చింది. అమ్మకం నుంచి వెనుకడుగు వేసేది లేదని పదే పదే చెబుతోంది. ఈ పరిణామాలన్నీ వైసీపీ సర్కారును ఊపిరాడని స్థితిలోకి నెట్టేసినట్లయింది.

సీఎం జగన్ పై అక్రమాస్తుల కేసులు నడుస్తున్నాయి. వివేకా మర్డర్​తోపాటు లిక్కర్​కేసులు మెడకు చుట్టుకున్నందువల్లే వైసీపీ సర్కారు కేంద్రం వద్ద మెడలు వంచుతోందని ప్రతిపక్షాలు పదేపదే ఆరోపణలు గుప్పిస్తున్నాయి. అలవికాని అప్పుల కోసం విభజన హామీలు, స్టీల్ ప్లాంటు, పోలవరం, రైల్వేజోన్​ విషయంలో మెతక వైఖరి అవలంబిస్తుందంటూ విపక్షాలు కోడై కూస్తున్నాయి. ఇవన్నీ రానున్న ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలను దెబ్బతీసే ప్రమాదం ఉందని వైసీపీ పెద్దలు పసిగట్టి ఉండొచ్చని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్​ఎస్​తో పొత్తు పెట్టుకున్నా లేకున్నా కేంద్ర సర్కారును ఢీ కొడుతున్నామనే సంకేతాలు ఇచ్చేందుకు ఎత్తుగడ అయి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Tuniలో బీటలు.. మాజీ మంత్రి యనమల భవిష్యత్తేంటో..!

Ys Jagan: పెన్షన్‌దారులకు శుభవార్త.. Cabinet Meetలో కీలక నిర్ణయం

Advertisement

Next Story

Most Viewed