బాలినేని నైరుతికి.. వైవీ ఈశాన్యానికి

by srinivas |   ( Updated:2022-11-28 15:01:35.0  )
బాలినేని నైరుతికి.. వైవీ ఈశాన్యానికి
X
  • బావా బామ్మర్దుల అంతర్యుద్ధ ఫలితమా !
  • సీఎం జగన్ వ్యూహంలో భాగమా !
  • మళ్లీ సుబ్బారెడ్డి చక్రం తిప్పుతారా ?

(దిశ, దక్షిణ కోస్తా): ఉమ్మడి ప్రకాశం జిల్లా వైసీపీలో ప్రస్తుతం ఇదే హాట్​ టాపిక్​. బావా బామ్మర్దుల మధ్య అంతర్యుద్ధం వల్లే అటొకరిని ఇటొకరిని పంపినట్లు పార్టీ వర్గాల్లో ఎడతెగని చర్చ నడుస్తోంది. అదేం కాదు.. వీళ్లిద్దరి జోక్యం వల్ల పార్టీలోని అన్ని నియోజకవర్గాల్లో వైషమ్యాలు పెరిగినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలు ఇవన్నీ కాదు.. నంబర్​టూ అధికార కేంద్రమనేది ఉండకూడదనే సీఎం జగన్​ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటూ పార్టీ శ్రేణులు చెవులు కొరుక్కుంటున్నాయి. బాలినేని కడప, తిరుపతి, నెల్లూరు జిల్లాల సమన్వయకర్తగా వెళ్లినందున ఇక వైవీ సుబ్బారెడ్డి జిల్లాలో చక్రం తిప్పుతారని ఆయన అనుచరులు సామాజిక మాధ్యమాల్లో హల్​చల్​ చేస్తున్నారు.

గత ఎన్నికల్లో ఒంగోలు సిట్టింగ్​ఎంపీగా ఉన్న వైవీ సుబ్బారెడ్డికి మళ్లీ టిక్కెట్​దక్కలేదు. టీడీపీకి ఎంపీ అభ్యర్థి దొరక్కుండా చేయాలనే ఎత్తుగడతో మాగుంట శ్రీనివాసులరెడ్డికి అవకాశమిచ్చినట్లు ప్రచారం జరిగింది. పార్టీలో మాత్రం సుబ్బారెడ్డి పెత్తనానికి గండి కొట్టాలని బాలినేని వేసిన ఎత్తుగడని వైవీ అనుచరులు వాపోయారు. నాడు వివిధ నియోజకవర్గాలకు టిక్కెట్ల కేటాయింపు విషయంలోనూ బావాబామ్మర్దులే చక్రం తిప్పారు. ఇద్దరూ ఒకే జిల్లావాసులు కావడం.. సీఎం జగన్​కు స్వయానా బంధువులు కావడంతో నాయకులు ఎవరూ నోరు మెదపలేకపోయేది. పార్టీ అధికారానికి వచ్చాక వీళ్లిద్దరి మధ్య ఆధిపత్య పోరు మరింతగా పెరిగింది. దీంతో వైవీ సుబ్బారెడ్డికి టీటీడీ చైర్మన్​పదవినిచ్చి తిరుపతి పంపారు. బాలినేనికి మంత్రి పదవిచ్చి జిల్లా పెత్తనం ఆయనకే అప్పగించారు. నాటి నుంచి వైవీ సుబ్బారెడ్డి జిల్లాలో పర్యటించడమే తగ్గించారు. దీనికితోడు ఉభయ గోదావరి జిల్లాల పార్టీ బాధ్యతల్లో తలమునకలవుతుండేది.కొంతకాలం తర్వాత ఇరువురి మధ్య విభేదాలు సమసిపోయాయని భావిస్తున్న తరుణంలో మంత్రి వర్గ విస్తరణ ముందుకొచ్చింది. అప్పటికే జిల్లాలో పార్టీ స్థితిగతులపై సీఎం జగన్​ కొంత పట్టు సాధించారు. ఏం జరిగిందో ఏమో బాలినేనికి మలివిడత మంత్రి పదవి దక్కలేదు. బాలినేని అవమానాన్ని తట్టుకోలేకపోయారు. పార్టీలో బాలినేని పవర్​ తగ్గించారనే ప్రచారం ఊపందుకుంది. దీనంతటికీ తమ పార్టీలోని ఓ పెద్ద తలకాయే కారణమని బాలినేని బాహాటంగా వాపోయారు.

మళ్లీ బావాబామ్మర్దుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేట్లు విభేదాలు పొడచూపాయి. లోక కల్యాణం కోసం బాలినేని తలపెట్టిన శ్రీనివాస కల్యాణానికి సుబ్బారెడ్డి అడ్డు పడుతున్నారంటూ బాలినేని ఏకంగా సీఎం జగన్​ దగ్గర పంచాయితీ పెట్టేదాకా వెళ్లింది. ఈ పరిణామాలన్నీ ఇద్దరి మధ్య మరింత దూరాన్ని పెంచింది. అప్పటికే టీటీడీ చైర్మన్ ​వైవీ సుబ్బారెడ్డి ఉమ్మడి విశాఖ జిల్లా సమన్వయర్త బాధ్యతల్లో ఉన్నారు. దీనికి అదనంగా విజయనగరం జిల్లా కలిపి సుబ్బారెడ్డిపై మరింత భారం మోపారు. మరోవైపు బాలినేనిని ఉమ్మడి ప్రకాశం జిల్లా బాధ్యతలను తప్పించి కడప, నెల్లూరు, తిరుపతి జిల్లాలకు మార్చారు. బాలినేని అటు వెళ్లినందున సుబ్బారెడ్డి మళ్లీ జిల్లాలో చక్రం తిప్పి ఎంపీగా పోటీ చేసే అవకాశాలు లేకపోలేదని ఆయన అనుచరులు చెబుతున్నారు.

ప్రస్తుత సిట్టింగ్​ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఎన్నికల నాటికి పార్టీలో కొనసాగుతారా మారతారా అనే చర్చ నిన్నమొన్నటిదాకా కొనసాగింది. ఇలాంటి సమయంలో వైవీ వస్తే ఎంపీగా గతాన్ని మరిపిస్తారనే భావం ప్రజల్లో నెలకొంది. అసలు వీళ్లిద్దరి జోక్యం లేకుంటే పార్టీలో నెంబర్​టూ పొజిషన్​అనేది లేకుండా పోతుందనే భావనతో సీఎం జగన్​ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు కొంతమంది కార్యకర్తల్లో వినిపిస్తోంది. ఇంతకీ పార్టీ అధినేత వైఎస్​జగన్​ మదిలో ఏముందో ఎవరికీ తెలీదు. బాలినేనికి జిల్లా పెత్తనాన్ని తప్పించినా.. వైవీని దూరంగా పంపినా పార్టీ శ్రేయస్సు కోసమే జగన్​ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి ;

Minister Pinipe Viswarup :'స్వామివారు పునర్జన్మ ప్రసాదించారు'

Advertisement

Next Story