వైసీపీ సోష‌ల్ మీడియా పోస్టింగ్‌లపై పోలీస్ పంజా

by Mahesh |
వైసీపీ సోష‌ల్ మీడియా పోస్టింగ్‌లపై పోలీస్ పంజా
X

దిశ, ఏపీ బ్యూరో: సీఎం చంద్రబాబు, లోకేశ్‌, ప‌వ‌న్ క‌ల్యాణ్‌, వంగ‌ల‌పూడి అనిత వంటి ప్రముఖుల‌పై రాయ‌లేని భాష‌లో అవాకులు, చెవాకులు సోష‌ల్ మీడియాలో వ్యాప్తి చేసిన వారిపై ఏపీ పోలీసులు గ‌త వారం రోజులుగా ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే ప‌లువురు వైసీపీ సోష‌ల్ మీడియా కార్యకర్తల‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. తాజాగా వైఎస్ భార‌తి రెడ్డి పీఏ వ‌ర్రా ర‌వీంద‌ర్‌రెడ్డిని అరెస్టు చేశారు. వ‌ర్రా త‌రువాత లిస్టులో గ‌తంలో వైసీపీ సోష‌ల్ మీడియా విభాగం అధ్యక్షుడిగా ప‌నిచేసిన స‌జ్జల భార్గవ‌రెడ్డి, అర్జున్‌రెడ్డి, శ్రీ‌రెడ్డి వంటివారు ఉన్నట్లు విశ్వస‌నీయ స‌మాచారం. రాష్ట్రంలోనే కాకుండా రాష్ట్రం వెలుపల‌, ఇత‌ర దేశాల్లో సైతం వైసీపీ సోష‌ల్ మీడియా నెట్‌వ‌ర్క్‌కు సంబంధించిన లింకుల‌ను గుర్తించే ప‌నిలో ఏపీ పోలీసులు తీవ్రంగా మునిగిపోయారు. ఈ నెట్‌వ‌ర్క్‌లో సుమారు 5 వేల మంది వ‌ర‌కూ ఉన్నట్లు ప్రాథమిక అంచ‌నా వేస్తున్నారు.

ప‌లు జిల్లాల‌కు సంబంధించిన వైసీపీ సోష‌ల్‌ మీడియా విభాగానికి చెందిన ప‌లువురిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై వైసీపీలో కొంత టెర్రర్ క్రియేట్ చేశారు పోలీసులు. ఇక‌పై ఎలాంటి విద్వేష పోస్టులు పెట్టన‌ని, జ‌రిగిన దానికి క్షమాప‌ణ కోరుతున్నట్లు శ్రీ‌రెడ్డి ఇప్పటికే ఒక వీడియో విడుద‌ల చేసింది. అంటే పోలీసులు నాలుగైదు రోజులుగా వైసీపీ సోష‌ల్ మీడియాలో విద్వేషాలు వ్యాప్తి చేసిన వారిపై తీసుకుంటున్న చ‌ర్యల వ‌ల్లే శ్రీ‌రెడ్డి భ‌య‌ప‌డిన‌ట్లు ఆ వీడియో ద్వారా అర్థమ‌వుతోంది. ఇక ఇదే భ‌యం స‌జ్జల భార్గవ‌రెడ్డి అండ్‌ టీం లో మొద‌లైన‌ట్లు తెలుస్తోంది. అందుకే స్వయంగా వైఎస్ జ‌గ‌న్ రంగంలోకి దిగారు. పార్టీ అండగా ఉంటుంద‌ని భ‌రోసానిచ్చారు. సోష‌ల్ మీడియా కార్యకర్తల‌కు క‌ష్టం వ‌స్తే ఆదుకోవ‌డానికి ముగ్గురితో కూడిన టీం పార్టీ కేంద్ర కార్యాల‌యంలో అందుబాటులో ఉంటుంద‌ని ప్రక‌టించారు. అంతేకాదు, ఏపీ ప్రభుత్వం, పోలీసుల తీరుపై హెకోర్టులో పిటిష‌న్ కూడా వేశారు. అంతటితో ఆగ‌కుండా జ‌గ‌న్ ఏకంగా పోలీసుల‌పై ప్రైవేటు కేసులు పెడ‌తామ‌ని కూడా వార్నింగ్ ఇచ్చారు.

ఇప్పటివ‌ర‌కు అరెస్టయిన వారు వీరే..

ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు ఫొటోలను అసభ్యకరంగా మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేసిన కేసులో గుంటూరు జిల్లా వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్‌ మేకా వెంకట రామిరెడ్డిని బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను గుంటూరు ఎక్సైజ్‌ కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్‌ విధించారు. అనంతరం ఆయనను జిల్లా జైలుకు తరలించారు. మరో వైసీపీ సోషల్‌ మీడియా యాక్టివిస్టు ఇంటూరి రవికిరణ్‌కు గుంటూరులోని అరండల్‌పేట పోలీసులు అదుపులోకి తీసుకుని.. నోటీసులు ఇచ్చి పంపించారు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఉన్న సమయంలో, 2019లో సోషల్‌ మీడియాలో ఆయన ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్‌ చేసి వైరల్‌ చేసిన కేసులో గుడివాడకు చెందిన ఇంటూరి రవికిరణ్‌ నిందితుడు. వీరితోపాటు వైఎస్ భార‌తి పీఏ వ‌ర్రా ర‌వీంద‌ర్‌రెడ్డిని కూడా క‌డ‌ప పోలీసులు ఒక కేసులో అరెస్టు చేసి 41ఏ నోటీసు ఇచ్చి పంపారు. మ‌రో కేసులో అరెస్టు చేయాల‌నేలోగా ఆయ‌న పోలీసుల క‌ళ్లుక‌ప్పి పారిపోయారు. ఎట్టకేలకు తెలంగాణలోని మహబూబ్ నగర్‌లో పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ వ్యవ‌హారంలో ఏకంగా జిల్లా ఎస్పీనే ప్రభుత్వం త‌ప్పించింది. సోష‌ల్ మీడియా వేదిక‌గా విద్వేషాలు రేపుతున్న ప‌లువురు వైసీపీ సోష‌ల్ మీడియా కార్యక‌ర్తలను గుర్తించిన పోలీసు శాఖ‌, వ‌రుస‌గా అదుపులోకి తీసుకుంటున్నది. ప‌లువురు ఇప్పటికే జైలు పాల‌య్యారు.

సీఎంతో డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్ భేటీ

సీఎం చంద్రబాబుతో శుక్రవారం డీజీపీ ద్వార‌కా తిరుమ‌ల‌రావు, ఇంటెలిజెన్స్ చీఫ్ మ‌హేంద్ర ల‌డ్డా భేటీ అయ్యారు. ఏపీలో శాంతిభ‌ద్రత‌లు, సోష‌ల్ మీడియా పోస్టింగుల‌పై చ‌ర్చించిన‌ట్లు తెలుస్తోంది. వైసీపీ విద్వేష పోస్టుల‌పై ఇప్పటివ‌ర‌కు తీసుకున్న చ‌ర్యలు, తీసుకోబోయే వాటి గురించి క్షుణ్ణంగా సీఎంకు అధికారులు ఇద్దరూ వివ‌రించిన‌ట్లు సమాచారం. వైసీపీ సోష‌ల్ మీడియాకు కీల‌కంగా ఉన్న స‌జ్జల భార్గవ్ అరెస్టు విష‌యం కూడా వీరి మ‌ధ్య చ‌ర్చకు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. శ్రీ‌రెడ్డిలాంటి వారిని కూడా క‌ట్టడి చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని, వీరితోపాటు ఫేక్ ఐడీల‌తో వైసీపీ స్లీప‌ర్ సెల్స్‌గా ఉన్నవారి అకౌంట్ల విష‌యంలో కూడా అనుస‌రించాల్సిన వ్యూహాన్ని ఈ భేటీలో చ‌ర్చించారు. త‌ప్పుడు ప్రచారం చేసిన ఏ ఒక్కరినీ వదలొద్దని, ఈ విష‌యంలో ఎవ‌రైనా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవ‌హ‌రిస్తే ఉపేక్షించ‌వద్దని కూడా సీఎం పోలీసు అధికారుల‌కు స్పష్టం చేసిన‌ట్లు తెలుస్తోంది. వైసీపీ ప‌క్షపాతం ప్రద‌ర్శిస్తున్న పోలీసు అధికారుల‌పై బదిలీ వేటు వేయాల‌ని కూడా సీఎం ఆదేశించిన‌ట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed