రేపే వారాహి విజయయాత్ర.. పవన్ తొలి సభ ఆ గ్రామంలోనే..!

by Nagaya |   ( Updated:2023-06-13 13:03:44.0  )
రేపే వారాహి విజయయాత్ర.. పవన్ తొలి సభ ఆ గ్రామంలోనే..!
X

దిశ, డైనమిక్ బ్యూరో : జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టనున్న జనసేన వారాహి విజయ యాత్ర బుధవారం ప్రారంభం కానుంది. అన్నవరం రత్నగిరిపై కొలువైన సత్యదేవుని దర్శనం చేసుకొని ప్రజా క్షేత్రంలోకి వస్తారు. వారాహి నుంచి తొలి బహిరంగ సభను ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కత్తిపూడి కూడలిలో నిర్వహిస్తారు. వారాహి వాహనం నుంచి పవన్ కళ్యాణ్ తొలి ప్రసంగం ఇవ్వబోయే తొలి గ్రామం కత్తిపూడి కానుంది. ఇప్పటికే అన్నవరం, కత్తిపూడి ప్రాంతాల్లో జనసేన శ్రేణులు, నాయకులు సమధికోత్సాహంతో ఏర్పాట్లు చేస్తున్నారు. కత్తిపూడి నుంచి వారాహి విజయ యాత్ర ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో పలు నియోజకవర్గాల మీదుగా సాగుతుంది. పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్, ముమ్మిడివరం, అమలాపురం, పి.గన్నవరం, రాజోలు, నరసాపురం నియోజకవర్గాల మీదుగా భీమవరం చేరుతుంది. ప్రతి నియోజకవర్గంలో వివిధ వర్గాల ప్రతినిధులను కలిసి వారితో చర్చించాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా పార్టీ నాయకులు సన్నాహాలు చేస్తున్నారు.

అదే విధంగా వివిధ సమస్యలతో సతమతమవుతూ కష్టాలుపడుతున్న ప్రజల బాధలు స్వయంగా తెలుసుకోబోతున్నారు. ప్రతి నియోజకవర్గంలో ‘జనవాణి’ కార్యక్రమం చేపట్టనున్నారు. ప్రజలు ఇచ్చే విజ్ఞాపనలు పవన్ కల్యాణ్ స్వీకరించనున్నారు. వాటిని పరిశీలించి సంబంధిత శాఖలకు ప్రజల ఇబ్బందులు, సమస్యలు తెలియచేసి పరిష్కారం కోసం పార్టీ పక్షాన ముందుకు వెళ్లాలని ఇప్పటికే పవన్ కల్యాణ్ నాయకులకు సూచించారు. ప్రతి నియోజకవర్గంలో వారాహి యాత్ర, అనంతరం సభ నిర్వహిస్తారు. వారాహి నుంచి పవన్ కల్యాణ్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

యాత్ర దిగ్విజయానికి వివిధ కమిటీలు

ఈనెల 14నుంచి మొదలయ్యే వారాహి విజయ యాత్రను దిగ్విజయం చేసేందుకు వివిధ కమిటీలను జనసేన పార్టీ ఏర్పాటు చేసింది. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల అధ్యక్షులు, నాయకులతో పలు దఫాలు చర్చించి దిశానిర్దేశం చేశారు. ఏడు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు. నాయకులు, శ్రేణులు, వీర మహిళలు, ప్రజలను సమన్వయం చేసుకొంటూ ముందుకు సాగేలా ఈ కమిటీలు పని చేస్తాయి. వారాహి సభకు హాజరయ్యేవారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా మెడికల్ టీం కూడా పని చేస్తుంది.

పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు లైన్ క్లియర్ : ఎస్పీ సతీశ్

జనసేనాని పవన్ కల్యాణ్ చేపట్టనున్న వారాహి విజయ యాత్రకు లైన్ క్లియర్ అయింది. వారాహి యాత్రకు పోలీసులు అనుమతిని మంజూరు చేశారు. కాకినాడ ఎస్పీ సతీశ్ మాట్లాడుతూ వారాహి విజయ యాత్రకు ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. జనసేన నేతలతో డీఎస్పీలు టచ్ లో ఉన్నారని వెల్లడించారు. ఎవరికైనా ఎక్కడైనా పర్యటించే హక్కు ఉందని స్పష్టం చేశారు. అయితే భద్రతాపరమైన అంశాల నేపథ్యంలో వారాహి విజయ యాత్ర మినిట్ టు మినిట్ షెడ్యూల్ ఇవ్వాలని అడిగినట్టు వెల్లడించారు. వారాహి యాత్రకు అనుమతులు లభించడంతో జనసైనికులు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed