Pawan Kalyan : మరాఠా గడ్డపై పవన్ కల్యాణ్ నోట 'జై తెలంగాణ'

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-11-17 12:25:41.0  )
Pawan Kalyan : మరాఠా గడ్డపై పవన్ కల్యాణ్ నోట జై తెలంగాణ
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ అంటే నాకు గుండెలో కొట్టుకుంటుందని, తనకు తెలంగాణ అంటే ఎంతో ఇష్టమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అన్నారు. మహారాష్ట్ర(Maharashtra)ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ఆయన 'జై తెలంగాణ' అని నినదించారు. 'బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి' పాట తనకు ఇష్టమని పేర్కొన్నారు. అలాంటి పోరుగడ్డ తెలంగాణ నుంచి ఇక్కడికి వచ్చిన వారని, మీరు మహారాష్ట్రలో ఉన్నా..బోకర్ లో ఉన్న తమ గుండెల్లో మరాఠా శౌర్యాన్ని, తెలంగాణ పోరాట స్ఫూర్తిని నింపుకున్నారని చెప్పారు. కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేదంటూ పవన్ తన ప్రసంగంలో విమర్శించారు. మహిళలకు ఇస్తామన్న 2,500 ఆర్థిక సహాయం ఇవ్వలేదన్నారు.

అనంతరం పవన్ కల్యాణ్ బల్లార్పూర్ బహిరంగ సభలో మహారాష్ట్ర, చంద్రాపూర్ జిల్లా, బల్లార్ పూర్ నియోజకవర్గంలో మహాయుతి కూటమి అభ్యర్థి సుధీర్ ముంగటివర్ కు మద్దతుగా ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. బల్లార్పూర్ ఒక మినీ భారతదేశం, ఇక్కడ అన్ని భాషలూ, అన్ని ప్రాంతాల ప్రజలు కలిసి ఉంటారని, మన బతుకమ్మ, మన సమ్మక్క సారక్క జాతర ఇక్కడ ఈ నేలపై జరుగుతుందన్నారు. కొంతమంది హైదరాబాద్ నుంచి వచ్చి మన సమ్మక్క సారక్క జాతరను, బతుకమ్మను అపహాస్యం చేస్తారని, అన్ని మతాలను సమానంగా చూసే మన సనాతన ధర్మంపై దాడి జరిగితే కచ్చితంగా బయటకు వస్తాను, పొరాడుతానన్నారు. జనసేన పార్టీని బలంగా తీసుకెళ్లడంలో మహారాష్ట్ర స్ఫూర్తి కూడా ఉందని, ఒకరు ఛత్రపతి శివాజీ మహారాజ్, ఇంకొకరు హిందూ హృదయ్ సామ్రాట్ బాలసాహెబ్ ఠాక్రే అని చెప్పుకొచ్చారు. శతాబ్దాల ఎదురుచూపులు తరవాత మనకు అయోధ్య రామ జన్మభూమి లో రామ్ లల్లా విగ్రహం ప్రతిష్ట జరిగిందని, మన బలార్ష ప్రజల అదృష్టం... ఆ ఆలయానికి తలుపులు ఇక్కడ టేకుతో తయారు అయ్యాయని గుర్తు చేశారు. దారి పొడవునా వస్తుంటే హైవే మ్యాన్ ఆఫ్ ఇండియా నితిన్ గడ్కరీ మొత్తం హైవేలు నిర్మించారని, నిర్మించడానికి రోడ్లు ఏమీ లేవు మన అభ్యర్ధి చెప్పారని, ఇది ఎన్డీయే ప్రభుత్వం సాధించిన ప్రగతి అన్నారు. శివసేన - జనసేన రెండు కూడా సనాతన ధర్మ పరిరక్షణ కోసం పని చేసేవని, అలాంటి భావనకు స్ఫూర్తి ఇచ్చిన వ్యక్తి బాలాసాహెబ్ ఠాక్రే ఆయన స్ఫూర్తితో ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం పొందుపరిచానన్నారు. ఆర్ఎస్ఎస్ ఉంది కాబట్టే విచ్ఛిన్న శక్తులు దేశాన్ని విడగొట్ట లేకపోయాయన్నారు. ఎన్డీయే ప్రభుత్వం మహారాష్ట్ర అభివృద్ది కోసం అనేక ప్రత్యేక చర్యలు తీసుకుందని, ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం స్థాపించేందుకు మీరు అందరూ ఓటు వేయాలి అని కోరారు. నూతనంగా నిర్మించిన పార్లమెంట్ భవనంలో తమిళనాడు సంస్కృతిని ప్రతిబింబించే సెంగోల్ ఏర్పాటు చేశారని, మహారాష్ట్ర నుండి మరాఠా భాషకు పార్లమెంట్ లో క్లాసికల్ భాషగా గుర్తింపు ఇచ్చారని గుర్తు చేశారు.

10 ఏళ్ల క్రితం దేశంలో ఎక్కువ ఉగ్రవాద దాడులు జరిగేవని, అలాంటి సమయంలో నేను దేశానికి బలమైన వ్యక్తి ప్రధానిగా ఉండాలి అని కోరుకున్నానన్నారు. అప్పుడు నాకు కనిపించిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ అని, ఆయన నేతృత్వంలో బలమైన దేశంగా భారత్ ఎదిగిందని, ఉగ్రవాద దాడుల తగ్గిపోయాయన్నారు. భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలంటే మహారాష్ట్ర ఆర్థిక వ్యవస్థగా అభివృద్ది చెందాలన్నారు. మహారాష్ట్ర అభివృద్ది చెందాలన్నా, బల్లార్పూరు అభివృద్ది చెందాలన్నా, లక్ష కోట్ల ఆర్థిక వ్యవస్థగా మహారాష్ట్ర ఎదగాలంటే ఎన్డీయే కూటమి అభ్యర్థిని గెలిపించండన్నారు. నేను ఆంధ్ర ప్రదేశ్ లో మార్పు తీసుకొచ్చి చూపించానని, వైసీపీని ఓడించలేరు అంటే ఓడించి చూపించానని, ఇప్పుడు మీరు కూడా ఎన్డీయే ప్రభుత్వాన్ని గెలిపించడానికి సిద్దం కావాలన్నారు. నా పిల్లలు ఇద్దరితో నేను మరాఠీలో మాట్లాడుతాను, భాష మీద గౌరవంతో నేర్చుకున్నానన్నారు. విదేశీ భాషలు నేర్చుకునే మనం, మన సరిహద్దు రాష్ట్రాల భాషలు నేర్చుకోవాలి కదా. కనీసం 5 ప్రాంతీయ భాషలు నేర్చుకోవాలి. మన భాష, సంస్కృతిని నేర్చుకోవాలన్నారు.

Advertisement

Next Story