AP News:వైసీపీకి తలనొప్పి తెచ్చిపెడుతున్న పార్టీ నేతలు..కారణం ఏంటంటే?

by Jakkula Mamatha |   ( Updated:2024-08-25 14:55:10.0  )
AP News:వైసీపీకి తలనొప్పి తెచ్చిపెడుతున్న పార్టీ నేతలు..కారణం ఏంటంటే?
X

దిశ, డైనమిక్​ బ్యూరో:గత ఎన్నికల్లో ఓటమి పాలైన వైసీపీకి..నేతల తీరు కొత్త తలనొప్పి తెచ్చిపెడుతోంది. పార్టీలో కొందరు ముఖ్య నేతల వ్యక్తిగత వ్యవహారాలు మొత్తం పార్టీకే చెడ్డపేరు తెస్తున్నాయి. మొన్నటి వరకు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్​ ఇంటిపోరు రచ్చకెక్కింది. చివరకు ఆయనను టెక్కలి పార్టీ ఇన్​చార్జి పదవి నుంచి తప్పించేవరకు ఈ ఎపిసోడ్​ సాగింది. ఆ వ్యవహారం అలా సద్దుమణుగుతుంది అనుకోగానే.. మరో ఎమ్మెల్సీ అనంత బాబు ముద్దులు పెడుతూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు ఉన్న వీడియో సోషల్​ మీడియాలో ప్రస్తుతం వైరల్​ అవుతోంది. ఇటువంటి వారిని పార్టీ అధినేత వెనకేసుకు వస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది.

గతంలోనూ ఇటువంటి ఆరోపణలే..

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆ పార్టీ నేతలు కొందరిపై ఇటువంటి ఆరోపణలే వచ్చాయి. అప్పట్లో అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్‌లకు సంబంధించిన ఆడియోలు.. గోరంట్ల మాధవ్‌కు చెందిన వీడియో చర్చనీయాంశం అయ్యాయి. ఎంపీ విజయసాయి రెడ్డి ఓ మహిళా ఉద్యోగిని వ్యవహారంలో వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. వీటన్నిటిపై ఏనాడు పార్టీ స్పందించలేదు. ఆ రోజే ఇటువంటి వారిపై చర్యలు తీసుకుని ఉంటే ఇటువంటి చర్యలకు అడ్డుకట్ట పడేదని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. జగన్ గుర్తించేది, ప్రోత్సహించేది ఇలాంటి నేతలని.. వీళ్లా మన నేతలు ? పెద్దల సభకు ఇలాంటి ఏ సర్టిఫికెట్ వాళ్ళని పంపించి, ప్రోత్సహించి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎలాంటి సంకేతాలు ఇస్తున్నావ్ జగన్ రెడ్డి? అంటూ ట్విట్టర్​ వేదికగా ప్రశ్నించింది. త్వరలోనే గవర్నర్​ కలిసి ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరతామని డొక్కా మాణిక్య వరప్రసాద్​ గుంటూరులో తెలిపారు. మహిళలకు వైసీపీ వచ్చే గౌరవం ఇదేనా అటూ ఎమ్మెల్యే శిరీష ప్రశ్నించారు.

మార్ఫింగ్​ చేశారంటూ..

ఇటువంటి వీడియోలు బయటకు వచ్చిన సందర్భంలో సహజంగా నేతలు చెబుతున్న వాదన వీడియోలను మార్ఫింగ్​ చేశారంటూ వాదిస్తున్నారు. గతంలో గోరంట్ల మాధవ్​ ఇదే వాదన వినిపించారు. ఇది కొందరు దుర్మార్గం చేసిన దుశ్చర్య అంటూ ఆయన వాపోయారు. దీనిలో నిజానిజాలు ఎంత ఉన్నా పార్టీకి డ్యామేజి జరిగి పోయింది. ఇప్పుడు వైరల్​ అవుతున్న వీడియో పై కూడా అనంత బాబు స్పందించారు. పుట్టినరోజు సంద్భంగా వీడియోకాల్‌లో పిల్లలకు ముద్దులు పెట్టిన వాటిని ఎడిట్ చేశారని, మార్ఫింగ్‌ వీడియోతో తెలంగాణకు చెందిన ఒకరు గత ఆరు నెలలుగా తనను బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారని ఆయన అన్నారు. తన వీడియోలను మార్ఫింగ్‌ చేసి, తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్సీ వెల్లడించారు. హనీట్రాప్‌ చేసి ఉద్దేశపూర్వకంగానే ఇరికించారని ఎమ్మెల్సీ చెప్పారు.

వైసీపీ పరువు గోవిందా..

రాజకీయాలు చేస్తున్నప్పుడు ఆదర్శవంతంగా ఉండాలని వైసీపీ అధినేత వైఎస్​ జగన్​ పదే పదే చెబుతుంటారు. అయితే క్షేత్ర స్థాయిలో ఆ పరిస్థితి లేదు. సొంత పార్టీ నేతలో ఇటువంటి వ్యవహారాల్లో ఇరుక్కుని వైసీపీ పరువును బజారుకీడుస్తున్నారు. ప్రత్యర్థి పార్టీ నేతల ఆరోపణలకు ఊతం ఇచ్చినవారవుతున్నారు. ఇప్పటికైన తమ పార్టీ నేతలపై వస్తున్న ఆరోపణలపై పార్టీ ముఖ్యులు స్పందించాల్సి ఉంది. పార్టీ ప్రతిష్ట మసకబారక ముందే మేల్కోవలసిన అవసరం ఉంది.

Advertisement

Next Story

Most Viewed