పద్మనాభ ‘వ్యూహం’.. పాలిటిక్స్‌లోకి ముద్రగడ రీ ఎంట్రీ..?

by Vinod kumar |
పద్మనాభ ‘వ్యూహం’.. పాలిటిక్స్‌లోకి ముద్రగడ రీ ఎంట్రీ..?
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాజకీయాల్లో ఆయన సీనియర్ ఎంపీగా, ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలందించారు. అనంతరం తన సొంత సామాజిక వర్గానికి అండగా నిలివాలని నిర్ణయించుకున్నారు. రిజర్వేషన్లు ఇతర అంశాలపై పోరాటం చేశారు. నిరాహార దీక్షలు, ఇంట్లోనే బంధీ కావడం ఇలా అనేక రూపాల్లో ఉద్యమాన్ని తారా స్థాయికి తీసుకెళ్లారు. అనంతరం తన సామాజిక వర్గానికి అండగా నిలిచే పార్టీలకు ఎన్నికల్లో మద్దతుగా నిలవాలని పిలుపును సైతం ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఆయన మాత్రం పోటీ చేయలేదు. అయితే రాబోయే రోజుల్లో మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని అనుచరులు, పార్టీలు ఒత్తిడి పెంచడంతో పోటీ చేయాలని భావిస్తున్నారట.

మరి ఇంతకీ పాలిటిక్స్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్న ఆ ఉద్యమ నాయకుడు ఎవరో ఇప్పటికే తెలిసే ఉంటుంది కదా.. ఇంకెవరు ముద్రగడ పద్మనాభం.. కాపు ఉద్యమనేతగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు అందరికీ సుపరిచితమే. తుని రైలు ఘటనకు సంబంధించి కేసులు కొట్టివేయడంతో ఇక ప్రజా జీవితంలూ దూకుడు పెంచాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

పాలిటిక్స్‌లో రీ ఎంట్రీ..?

కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం 2024 ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. కాపు ఉద్యమనేతగా ఉన్న ముద్రగడ పద్మనాభం ఇకపై ఫుల్ టైం పొలిటీషియన్‌గా రూపాంతరం చెందబోతున్నారంటూ వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ముద్రగడ పద్మనాభం తన రాజకీయ ప్రస్థానంలో మూడుసార్లు శాసనసభ్యుడిగా, ఒకసారి ఎంపీగా, రెండుసార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే. అనంతరం కాపు సామాజిక వర్గం కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నారు. రాజకీయాల్లో వరుస ఓటమిలు ఎదుర్కొంటున్న ముద్రగడ పద్మనాభంను కొంతమంది కాపు నేతలు ‘కాపు ఉద్యమం’ను ముందుకు తీసుకుని వెళ్ళమని కోరడంతో ఆయన ఉద్యమానికి సారథిగా మారారు.

2015 నుంచి కాపు ఉద్యమానికి సారథ్యం వహించి ముందుకు తీసుకెళ్లారు. ఇదే ఉద్యమంలో భాగంగా 2016 జనవరి 31 నాడు తూర్పు గోదావరి జిల్లా తునిలో ప్రారంభమైన కాపు ఐక్యగర్జన సభ ద్వారా ఉద్యమ పంథాలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో తునిలోని వి. కొత్తూరు వద్ద గల మైదానంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఆ సభ ముగిసిన తర్వాత విధ్వంసకర ఘటనలు చోటు చేసుకున్నాయి. ఆందోళనకారులు రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ను ధ్వంసం చేశారు. ఈ కేసును విజయవాడ రైల్వే కోర్టులో విచారణ జరుగుతుంది. అయితే ఇటీవలే కోర్టు ఈ కేసును కొట్టివేసిన నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం ఇక ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారని తెలుస్తోంది.

ఏ పార్టీలో చేరతారంటే..?

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఎన్నికల్లో గెలుపొందేందుకు వ్యూహరచనలు చేస్తున్నాయి. మరోవైపు ఇప్పటి వరకు సైలెంట్‌గా ఉన్న నేతలు, రాజకీయాల్లో పోటీ చేసేందుకు అవకాశం కోసం ఎదురుచూస్తున్న నేతలు సైతం అలర్ట్ అయ్యారు. అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు ఉద్యమ జీవితంలో రథసారథిగా వ్యవహరిస్తున్న ముద్రగడ పద్మనాభం మళ్లీ ప్రజా జీవితంలోకి రావాలని భావిస్తున్నారంటూ ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలోనే కాదు తూర్పుగోదావరి జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ముద్రగడ ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనేదానిపై ఆసక్తికర చర్చ జరుగుతుంది.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అంటేనే మండిపడుతున్నారు. చంద్రబాబుకు ముద్రగడకు మధ్య పచ్చగడ్డి వేస్తేనే భగ్గుమనేలా రాజకీయం హీటెక్కింది. అలా అని సొంత సామాజిక వర్గానికి చెందిన పవన్ కల్యాణ్ ఏర్పాటు చేసిన జనసేన పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. టీడీపీ హయాంలో చంద్రబాబు తనను ఎన్ని ఇబ్బందులు పెట్టినా పవన్ కల్యాణ్ స్పందించలేదనే గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ముద్రగడ పద్మనాభం కాస్త సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. వైఎస్ జగన్‌తోనూ వైఎస్ కుటుంబంతోనూ ముద్రగడ పద్మనాభంకు సత్సంబంధాలు ఉన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

ముద్రగడ పద్మనాభంను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదనలు సైతం పంపినట్లు తెలుస్తోంది. ముద్రగడ కోరితే అసెంబ్లీ లేదా లోక్‌సభ టికెట్ ఇచ్చేందుకు సీఎం వైఎస్ జగన్ సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాకినాడ జిల్లాలోని పిఠాపురం లేదా ప్రత్తిపాడు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తే బెటర్ అని అభిమానులు, అనుచరులు కోరుతున్నట్లు తెలుస్తోంది. పిఠాపురం నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం నేతలు అత్యధికంగా ఉన్న నేపథ్యంలో ఆ నియోజకవర్గం నుంచిపోటీ చేస్తే గెలుపు ఈజీ అవుతుందని పలువురు సూచిస్తున్నారట.

మరి అదే సీటును ప్రస్తుత కాకినాడ ఎంపీ వంగా గీత సైతం ఆశిస్తున్నారు. మరి ఇద్దరిలో సీఎం వైఎస్ జగన్ ఎవరికి టికెట్ ఇస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇంతకీ మరి ముద్రగడ పద్మనాభం పాలిటిక్స్‌లోకి రీ ఎంట్రీ ఇస్తారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడండ ఎంతమేర నిజం? పిఠాపురం నుంచే పోటీ చేస్తారా లేక ప్రత్తిపాడు బరిలో నిలుస్తారా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Advertisement

Next Story