ఎంపీ జీవీఎల్ చొరవ: ఓబీసీ జాబితాలోకి ఆ సామాజిక వర్గాలు?

by Seetharam |
ఎంపీ జీవీఎల్ చొరవ: ఓబీసీ జాబితాలోకి ఆ సామాజిక వర్గాలు?
X

దిశ, డైనమిక్ బ్యూరో: తూర్పుకాపులు, కళింగ వైశ్యులు, శిష్టకరణాలు, సోండి కులాలకు కేంద్రప్రభుత్వం తీపికబురు చెప్పిందని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఈ సామాజిక వర్గాలకు ఓబీసీ రిజర్వేషన్లకై కేంద్ర ప్రభుత్వానికి వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్ సిఫారసు చేసిందని తెలిపారు. ఈ మేరకు వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్ చైర్మన్ హన్సరాజ్‌ అహిర్‌కి బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు బీసీ ఇతర కులాల సంక్షేమ చర్యలను సమీక్షించేందుకు ఉత్తరాంధ్రలో పర్యటించాలని ఈ సందర్భంగా జీవీఎల్ కోరారు. ఎంపీ జీవీఎల్ కోరికపై బీసీ ఇతర కులాల సంక్షేమ చర్యలను సమీక్షించేందుకు త్వరలో విశాఖలో పర్యటిస్తానని ఎన్‌సీబీసీ చైర్మన్ హన్సరాజ్ అహిర్‌ హామీ ఇచ్చినట్లు ఎంపీ జీవీఎల్ తెలిపారు. న్యూఢిల్లీలో జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్‌ హన్సరాజ్ అహిర్‌ను కలిసి తూర్పుకాపులు, కళింగ వైశ్యులు, శిష్టకరణాలు, సోండి కులాల సమస్యలపై వివరించినట్లు తెలిపారు. కేంద్ర ఒబిసి జాబితాలో ఏదైనా కులాన్ని చేర్చడానికి ఎన్‌సిబిసి సిఫార్సు తప్పనిసరి అయిన నేపథ్యంలో ఎన్‌సిబిసి చేసిన ఈ సిఫార్సు చాలా కీలకమైనదిగా ఎంపీ జీవీఎల్ నరసింహారావు అభివర్ణించారు.

40లక్షల మందికి లబ్ధి

రాష్ట్రంలో 40 లక్షలకు పైగా వున్న తూర్పుకాపులు, కళింగ వైశ్యులు, శిష్టకరణాలు, సొండి కులాలకు కేంద్ర ఓబీసీ రిజర్వేషన్ల అంశాన్ని ఎంపీ జీవీఎల్ నరసింహారావు రెండేళ్లుగా పార్లమెంట్ లోపల, వెలుపల అనేక మార్లు లేవనెత్తుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఎంపీ జీవీఎల్ గత 12 నెలలుగా కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్, ఎన్‌సీబీసీ వద్దకు ఈ కులాల నేతల ప్రతినిధులను సైతం తీసుకెళ్లి వినతిపత్రాలు ఇప్పించిన సంగతి తెలిసిందే. దీంతో సెప్టెంబర్ 13న న్యూఢిల్లీలో ఎన్‌సీబీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా హియరింగ్ నందు పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిధులు, రాష్ట్ర అధికారులు, రాజకీయ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీలోని అన్ని జిల్లాల్లో నివసిస్తున్న తూర్పుకాపులు, కళింగ వైశ్యులు, శిష్టకరణాలు, సొండి మరియు అరవ వర్గాలను ఓబీసీల కేంద్ర జాబితాలో చేర్చాలని NCBC భారత ప్రభుత్వానికి ఈనెల 28న సిఫార్సు పంపిందని ఎంపీ జీవీఎల్ తెలిపారు. తుర్పు కాపులకు ఓబీసీ రిజర్వేషన్ ఉన్నప్పటికీ అది కేవలం ఉత్తరాంధ్ర జిల్లాలకే పరిమితమైందని దీని వల్ల ఇతర ప్రాంతాల్లోని తూర్పు కాపులు ఇబ్బందులు పడుతున్నారని జీవీఎల్ తెలిపారు. అయితే ఎన్‌సీబీసీ సిఫార్స్ వల్ల వారికి కూడా ఓబీసీ రిజర్వేషన్లు దక్కుతాయని ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed