తెలుగు జాతి వెలుగు పీవీ: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

by srinivas |
తెలుగు జాతి వెలుగు పీవీ: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: పీవీ నిండైన తెలుగుదనానికి నిలువెత్తు రూపమని, దేశ భవిష్యత్తు కోసం దూరదృష్టి కలిగిన నిర్ణయాలు తీసుకున్న రాజకీయ మేధావి మాజీ ప్రధాని, భారతరత్న పీవీ. నరసింహ రావు అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీర్తించారు. శుక్రవారం పీ.వీ.ఘాట్‌లో నిర్వహించిన పీ.వీ. నరసింహారావు 103 జయంతి వేడుకల్లో ప్రభుత్వం తరఫున నివాళులర్పించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో ఆర్థిక సంస్కరణలకు బీజం వేసిన నేత అని అభివర్ణించారు. సంకీర్ణ రాజకీయాలను సమర్ధంగా నడిపించి దేశానికి కొత్త మార్గం చూపించిన రాజనీతిజ్ఞుడని అన్నారు. బహు భాషలు మాట్లాడినప్పటికి ఆయనకు తెలుగు భాషంటే విపరీతమైన అభిమానమన్నారు. తెలుగు భాష అభివృద్ధికి విశేషంగా కృషి చేశారని మంత్రి గుర్తు చేశారు. ఈ రోజు దేశంలో మనం ఐదు ట్రిలియన్లు, ఆరు ట్రిలియన్ల ఆర్ధికాభివృద్ధి గురించి మాట్లాడుతున్నామంటే అది కేవలం పీవీ ప్రవేశపెట్టిన ఆర్ధిక సంస్కరణల మూలంగానే సాధ్యమయ్యిందని అన్నారు. దేశాన్ని సంక్షోభం నుంచి సంక్షేమం వైపు మలిచిన ఒక గొప్ప శక్తి పీవీ అని చెప్పారు. ఆర్ధిక సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధిబాట పట్టించవచ్చని త్రికరణశుద్ధిగా నమ్మిన నాయకుడని గుర్తు చేశారు. పీవీ కుటుంబ సభ్యులతో మాట్లాడిన మంత్రి. పీ.వీతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు.



Next Story