పోలవరం పరిహారంలో భారీ మోసం.. కమీషన్ల కక్కుర్తితో అధికారులు సైలెంట్!

by Satheesh |
పోలవరం పరిహారంలో భారీ మోసం.. కమీషన్ల కక్కుర్తితో అధికారులు సైలెంట్!
X

అధికారుల అండదండలతో.. పోలవరం పరిహారంలో అక్రమాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. అక్రమార్కులు బరితెగించినా పాలకుల్లో స్పందన శూన్యం. తాజాగా, ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలో పోలవరం నిర్వాసితుల జాబితాలో భారీ మోసం వెలుగుచూసింది. ఏ-బ్లాక్ లో ఇళ్ల పరిహారానికి సంబంధించి రెవెన్యూ అధికారులు నాలుగు రోజుల కిందట గ్రామసభ నిర్వహించారు. ఏ-బ్లాక్ లోని ఇళ్ల పరిహారానికి సంబంధించిన జాబితాను ప్రకటించారు. ఏ-బ్లాక్ లో ఇళ్లు లేని వారి పేర్లు సైతం ఆ లిస్టులో ఉండడం విస్మయం కలిగిస్తోంది. అంతేకాదు, ఏ-బ్లాక్ లో ఇల్లు ఉన్నప్పటికీ కొందరి పేర్లు నిర్వాసితుల జాబితాలో గల్లంతవడం అధికారుల మాయాజాలానికి నిదర్శనం.

దిశ, కుక్కునూరు: వారంతా త్యాగధనులు. రాష్ట్ర భవిష్యత్ కోసం ఉన్న ఊరిని, కష్టించి సాగు చేస్తున్న భూములను, తల దాచుకున్న ఇంటిని కోల్పోతున్న అభాగ్యులు. కానీ పైరవీకారుల కారణంగా వీరిలో చాలా మంది ఆర్థికంగా అన్యాయానికి గురయ్యే పరిస్థితి దాపురించింది. నిర్వాసితుల భూములకు సంబంధించి జరిగిన అక్రమాలు అప్పట్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాయి. ఎంతో మంది అనర్హులు పలుకుబడితో భూములు లేకుండానే పరిహారం తీసుకున్నారు. మళ్ళీ అటువంటి భారీ అక్రమాలు ఇంటి పరిహారం విషయంలో జరుగుతున్నాయి.

తాజాగా ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలో పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితుల జాబితాలో భారీ మోసం వెలుగుచూసింది. కుక్కునూరు ఏ-బ్లాక్ లో ఇంటి పరిహారానికి సంబంధించి ఇటీవలే గ్రామసభ ఏర్పాటు చేశారు. జాబితాలోని పేర్లను రెవెన్యూ అధికారులు వెల్లడించారు. ఏ-బ్లాక్ తో సంబంధం లేని వారికి ఈ జాబితాలో చోటు దక్కడం గమనార్హం. అధికారులు మొదట ఏ-బ్లాక్ లోని నిర్వాసితులను తరలించే ప్రక్రియ చేపట్టగా ఆ జాబితాలో పలు పేర్లు ఏ-బ్లాక్ తో సంబంధం లేనివి ఉన్నాయి. ఏ-బ్లాక్ లో వారికి ఇల్లే లేకపోయినా జాబితాలో వారికి చోటు దక్కడం పరిహారం విషయంలో జరుగుతున్న మోసాలను తేటతెల్లం చేస్తున్నది. ఏ-బ్లాక్ లో ఇళ్లు ఉండి, అర్హత ఉన్న పలు మంది పేర్లు నిర్వాసితుల జాబితాలో గల్లంతు కావడం కొసమెరుపు.

కమీషన్ల కక్కుర్తి..

పోలవరం పరిహారం విషయంలో మొదటి నుంచి అక్రమాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. స్థానిక అధికారులు, అక్రమార్కులు చేతులు కలిపి పరిహారం దండుకుంటున్నారు. తాజాగా ఇంటి పరిహారం విషయంలో కూడా అక్రమార్కులు, అధికారులు ఒక్కటై జాబితాలో అర్హత లేని వారి పేర్లు చేర్చి భారీ మొత్తంలో కమీషన్ తీసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

ఏ బ్లాక్ లో ఇల్లు లేకుండా ఇంటి పన్ను 10, 15 ఏళ్ల నుంచి కట్టి రికార్డుల్లో చేర్చినట్టు విశ్వసనీయత సమాచారం . అసలు బీ, సీ బ్లాక్ లో ఉన్న వారు ఏ-బ్లాక్ లో చోటు సంపాదించడం వెనుక ఎవరెవరి హస్తం ఉందో విచారిస్తే బండారం బయటపడుతుంది. ఏసీ ఇళ్లు, కొబ్బరి, మామిడి మొక్కలు ఉన్నట్లు కూడా జాబితాలో చేర్చారు. ఇళ్లు లేకుండా వీరికి అధికారులు చోటు కల్పించడం, పైగా వీరి పేర్లను బయటికి రానివ్వకుండా గోప్యత పటించడంపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

లక్షకు రూ.40 వేల కమీషన్?

ఇళ్ల పరిహారం విషయంలో లక్షకు రూ.40 వేల వరకు కమీషన్ ఇచ్చేలా అధికారులు, అక్రమార్కులు ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి . ఏ-బ్లాక్ లో ఇళ్ల పరిహారం విషయంలో జాబితాలో అడ్డదారిలో చేరిన వీరికి బీ, సీ బ్లాక్ లలో సొంత ఇళ్ళు ఉన్నాయి. వీరు అయా చోట్ల మరో మారు పరిహారం పొందే వీలుంది. ఇప్పటికే మండలంలో పలు చోట్ల గ్రామసభలు నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో కూడా ఇలా అనర్హులు అడ్డదారిలో పరిహారం పొందేందుకు వీలుంది. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నిర్వాసితులు, రాజకీయ పక్షాల నేతలు కోరుతున్నారు.

నిలదీసినా స్పందన లేదు...

పోలవరం ప్రాజెక్టు ముంపులో అధికారులు అక్రమార్కులకే అగ్రతాంబూలం కట్టబెడుతున్నారు. ఇళ్లు లేకుండా పెత్తనం చెలాయిస్తున్న పలువురికి ఇంటి నష్ట పరిహారం చెల్లించేందుకు అధికారులు పూనుకున్నారు. ఇటీవల ఏర్పాటుచేసిన గ్రామసభలో నిర్వాసితులు ఇదే విషయమై అధికారులను నిలదీశారు.

ఇవిగో ఆధారాలు :

- ఓ వ్యక్తి పొట్టకూటి కోసం పొరుగు ప్రాంతం నుంచి వచ్చి కుక్కునూరు బీ బ్లాక్ లో స్థిరపడ్డాడు. ఆయనకు ఏ బ్లాక్ లో ఇల్లు ఉన్నట్టు ధ్రువీకరించారు. 116 మంది నిర్వాసితుల పేర్లలో అతని పేరు కూడా ఉంది. రేపోమాపో..ఇంటి పరిహారం పొందేందుకు అవకాశం ఉంది.

★ ఆయనో వ్యాపారవేత్త. ఆయన కుటుంబంలో ముగ్గురికి కుక్కునూరు ఏ బ్లాక్ లో ఇళ్లు ఉన్నట్లు నిర్ధారించారు. ఆ కుటుంబానికి వాస్తవంగా అక్కడ ఇళ్లు లేకున్నా.. జాబితాలో పేర్లు ఉండడంతో అర్హులైన నిర్వాసితులు మండిపడుతున్నారు. కుక్కునూరు ఏ బ్లాక్ లో ఇలాంటి సిత్రాలు కోకొల్లలు

ఉన్నతాధికారులు దృష్టి పెట్టాలి..

- యర్రంశెట్టి నాగేంద్ర రావు, కుక్కునూరు మండల సీపీఎం కార్యదర్శి

కుక్కునూరు ఏ బ్లాక్ లో అవకతవకలు చోటుచేసుకున్నాయి. బీ, సీ బ్లాక్ లలో ఉంటున్న కొందరు నిర్వాసితులకు.. నాలుగు రోజుల క్రితం నిర్వహించిన గ్రామసభలో ఏ బ్లాక్ లో ఇళ్లు ఉన్నట్టు ప్రకటించారు. అక్రమార్కులు అడ్డదారిలో ప్రభుత్వాన్ని మోసం చేసి లక్షల్లో పరిహారం కాజేసేందుకు కుట్ర చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమార్కులపై తగిన చర్యలు తీసుకోవాలి.

Advertisement

Next Story

Most Viewed