నిరుద్యోగులకు తప్పని నిరీక్షణ..! మెడికల్ విభాగంలో పోస్టుల భర్తీపై నీలినీడలు

by Shiva |
నిరుద్యోగులకు తప్పని నిరీక్షణ..! మెడికల్ విభాగంలో పోస్టుల భర్తీపై నీలినీడలు
X

దిశ ప్రతినిధి, కర్నూలు: గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం, ముడుపులకు అలవాటుపడిన ఓ అధికారి తీరు నిరుద్యోగులకు శాపంగా మారింది. మెడికల్ విభాగంలో మంజూరు చేసిన కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ పోస్టుల భర్తీపై నీలినీడలు కమ్ముకున్నాయి. 9 నెలలుగా ఉద్యోగాల కోసం ఎదురుచూపులు తప్పడంలేదు. నోటిఫికేషన్ ఆధారంగా ఉద్యోగాలు భర్తీ చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించినా ఆరోగ్య శాఖలోని ఓ అధికారి కాసుల కోసం నిర్లక్ష్యం చేస్తూ నిరుద్యోగుల పాలిట యమకింకరుడిలా తయారయ్యారు. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వంపై నిరుద్యోగులు ఆశలు పెట్టుకున్నారు.

గత నవంబరులో నోటిఫికేషన్..

ఉమ్మడి కర్నూలు జిల్లాలో కర్నూలు మెడికల్ కళాశాల, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల, నంద్యాల మెడికల్ కళాశాల, నంద్యాల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, ఆదోని మెడికల్ కళాశాల, ఆదోని ఏరియా ఆస్పత్రుల్లో వివిధ విభాగాల్లో ఉన్న ఖాళీగా ఉన్న పోస్టులను కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు గత వైసీపీ ప్రభుత్వం 2023 నవంబర్ 23న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎన్నికలకు ముందు 30 కేటగిరీలకు 60 విభాగాల్లో దాదాపు 463 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసి సింపతీని కొట్టేయాలని భావించింది. ఈ పోస్టులకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 12 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు.

గత ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసినా వాటిని భర్తీ చేయడంలో అటు గత వైసీపీ ప్రభుత్వం, ఇటు ఆరోగ్య శాఖలో ముడుపులకు అలవాటు పడ్డ ఓ అధికారి తీరు వల్ల పోస్టుల భర్తీ ప్రక్రియ ఆలస్యమైంది. గత వైసీపీ ప్రభుత్వం కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ పోస్టులను ఏపీ కార్పొరేషన్‌లో కలిపేసింది. దీంతో వైసీపీ ఐదేళ్ల పాలనలో ఈ పోస్టులు వదలలేదు. ఫలితంగా నిరుద్యోగులు ఉద్యోగాల కోసం నానా అవస్థలు పడ్డారు. అంతిమంగా ఎన్నికలకు ముందు నోటిఫికేషన్ జారీ చేసి సింపతి కొట్టేయాలని జగన్ ప్రభుత్వం చూసింది. కానీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది గానీ అభ్యర్థులను భర్తీ చేయకుండా చేతులు దులిపేసుకుంది.

అనుకున్నంత డబ్బు అందలేదని..

కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ముడుపులకు అలవాటు పడ్డ ఓ అధికారి పోస్టుల భర్తీ విషయంలో మీనమేషాలు లెక్కించారు. పోస్టుల భర్తీపై నిర్లక్ష్యం వద్దని, వెంటనే నోటిఫికేషన్ ప్రకారం సిబ్బందిని నియమించుకోవాలని ప్రస్తుత కలెక్టర్ పి.రంజిత్ బాషా ఈ ఏడాది జూలై 25న ఆదేశించారు. కానీ అభ్యర్థుల నుంచి అడిగినంత డబ్బులు రాలేదనే ఉద్దేశంతో పోస్టుల భర్తీలో నిర్లక్ష్యం వహిస్తున్నాడనే ఆరోపణలున్నాయి. ప్రస్తుతం అధికారం చేపట్టిన టీడీపీ ప్రభుత్వంపై నిరుద్యోగులు ఆశలు పెట్టుకున్నారు. ఈ ప్రభుత్వంలోనైనా ఈ పోస్టులు భర్తీ చేస్తారని కొండంత ఆశతో ఎదురు చూస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed