Nara lokesh: కాపు రిజర్వేషన్లపై కీలక వ్యాఖ్యలు

by srinivas |   ( Updated:2023-05-22 16:08:04.0  )
Nara lokesh: కాపు రిజర్వేషన్లపై కీలక వ్యాఖ్యలు
X

దిశ, కర్నూలు ప్రతినిధి: అధికారంలోకి రాగానే కాపు రిజర్వేషన్లను పునరుద్ధరిస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీచ్చారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఆయన పాదయాత్ర చేపట్టారు. ఇందులో భాగంగా మహిళలతో ముఖా ముఖి నిర్వహించారు. టీడీపీ హయాంలో కాపులకు రిజర్వేషన్లు ఉండేవని, వైసీపీ అధికారంలోకి రాగానే ఆ రిజర్వేషన్లను రద్దు చేశారని లోకేశ్‌కు ఓ మహిళ తెలిపారు. తాను పీహెచ్‌డీ చేసినా రిజర్వేషన్ లేని కారణంగా ఉద్యోగం రాలేదని, రాబోయే కాలంలో టీడీపీ అధికారంలోకొస్తే మళ్లీ రిజర్వేషన్‌ను పునరుద్ధరిస్తారా అని అడిగిన ప్రశ్నకు నారా లోకేశ్ స్పందించారు. రెడ్డి సామాజిక వర్గంలో పేదలున్నారని, వారి కోసం కూడా సంక్షేమ పథకాలు అమలు చేసి ఆదుకుంటామని లోకేశ్ హామీ ఇచ్చారు.

జగన్ అధికారంలోకొచ్చిన నాటి నుంచి నేటి వరకు అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని, రైతులను నట్టేట ముంచారని మండిపడ్డారు. నకిలీ విత్తనాల మాఫియాకు జగన్ అండగా ఉండి కొమ్ము కాస్తున్నారని, ఎరువులు, పురుగు మందులు, విత్తనాల ధరలు పెంచి రైతుల నడ్డి విరుస్తున్నారని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి రాగానే రైతులకు మేలు చేకూర్చేలా పథకాలు వర్తింపజేస్తామన్నారు. నకిలీ విత్తన కంపెనీలపై ఉక్కుపాదం మోపి రైతులు నష్టపోకుండా చూస్తామన్నారు. అన్ని పంటలకు మద్దతు ధర కల్పించేలా చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. అలాగే సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు అందజేస్తామని లోకేశ్ స్పష్టం చేశారు.

Advertisement

Next Story