భవిష్యత్‌లో కూడా అండగా ఉంటాం: Nara lokesh

by srinivas |
భవిష్యత్‌లో కూడా అండగా ఉంటాం: Nara lokesh
X

దిశ, కర్నూలు ప్రతినిధి: సమాజంలో ఒక భాగమైన జర్నలిస్టులు సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు, దౌర్జన్యాలు, మూఢ నమ్మకాలు, సామాజిక రుగ్మతలు, ఆర్థిక అసమానతలు తదితర అన్ని అంశాలను తమ కలం ద్వారా సమాజం దృష్టికి తీసుకొస్తున్నారని, అయితే అలాంటి జర్నలిస్టులు కూడా సమస్యలతో సతమతమౌతున్నారని, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) నేతలు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను కోరారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని వెంకటాపురం గ్రామంలో భోజన విరామ సమయంలో నారా లోకేష్‌ను జర్నలిస్టు నాయకులు కలిసి సమస్యను విన్నవించారు. గతంలో ఆర్ఎన్ఐ కలిగిన ప్రతి పత్రికకు అక్రిడేషన్లు ఇచ్చేవారని, అయితే ప్రస్తుతం అక్రిడేషన్ ఇవ్వాలంటే అనేక నిబంధనలు విధించి కోత విధిస్తున్నారన్నారు. అలా కాకుండా గతంలో మాదిరిగా ఆర్ఎన్ఐ కలిగిన ప్రతి పత్రికకు అక్రిడేషన్లు ఇవ్వాలని కోరారు. అలాగే జర్నలిస్టుల హెల్త్, ఇన్సూరెన్స్ స్కీం లను పునరుద్ధరించాలని, అర్హులైన ప్రతి జర్నలిస్టుకు మూడు సెంట్ల ఇంటి స్థలంతో పాటు ఇల్లు నిర్మించి ఇవ్వాలని కోరారు.

తెలంగాణ తరహాలో వైద్యం అందించాలి..

తెలంగాణ తరహాలో జర్నలిస్టులకు కార్పొరేట్ ఆస్పత్రులలో ఉచిత వైద్యం అందించాలని, జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్, కాలేజీలలో ఉచిత విద్య అందించాలని కోరారు. అలాగే తమిళనాడు, బీహార్ తరహాలో 55 ఏళ్లు నిండిన ప్రతి జర్నలిస్టుకు రూ.10వేలు పింఛన్ ఇవ్వాలన్నారు. ప్రత్యేకించి కర్నూలు జగన్నాథ గట్టులో జర్నలిస్టులకు కేటాయించిన స్థలాల్లో ఎర్రమట్టి అక్రమ తవ్వకాలను నిలిపివేయాలని, అలాగే జర్నలిస్టుల స్థలాల్లో రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, తాగునీరు తదితర మౌలిక వసతులు కల్పించాలని లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. జర్నలిస్టులపై దాడుల నియంత్రణకు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. కరోనాతో మృతి చెందిన జర్నలిస్టు కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి జర్నలిస్టులకు అండగా నిలవాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. అందుకు స్పందించిన నారా లోకేష్ టీడీపీ ప్రభుత్వం మొదటి నుంచి జర్నలిస్టులకు అండగా నిలుస్తోందన్నారు. భవిష్యత్‌లో కూడా అండగా నిలుస్తుందన్నారు. ముఖ్యమంత్రి జగన్ తమ వైఫల్యాలు, అక్రమాలను ఎండగట్టే మీడియాపై విషం కక్కుతున్నారన్నారు.

అక్రిడిటేషన్లు నిలిపివేస్తున్నారు..

తమకు అనుకూలంగా లేని ఛానళ్ల సిగ్నల్స్ కట్ చేయడం, పత్రికలకు అక్రిడిటేషన్లు నిలిపేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి మోసం చేశారన్నారు. కర్నూలులో జర్నలిస్టులకు ఇచ్చిన స్థలాల్లో వైసీపీ నేతలు అక్రమ మైనింగ్ చేయడం దారుణమన్నారు. టీడీపీ అధికారంలోకొచ్చాక జర్నలిస్టుల సమస్యలపై సీనియర్ పాత్రికేయులతో కమిటీ వేసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా కల్పించారు. జర్నలిస్టులకు గతంలో మాదిరిగా హెల్త్, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తామని హామిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఐజేయూ జాతీయ సమితి సభ్యులు కొండప్ప, కే.నాగరాజు, ఏపీయూడబ్ల్యూజే జిల్లా గౌరవాధ్యక్షులు ఎన్.వీ.సుబ్బయ్య, గౌరవ సలహాదారులు వైవీ.కృష్ణారెడ్డి, జిల్లా, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి ఈ.ఎన్.రాజు, శ్రీనివాస్ గౌడ్, ఆర్గనైజింగ్ కార్యదర్శి సుంకన్న, కోశాధికారి అంజి, జిల్లా సహాయ కార్యదర్శి భాష్యం మధుసుధన్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు రాజేష్, జిల్లా సహాయ కార్యదర్శులు శివరాజ్ కుమార్, శ్రీధర్, వీడియో జర్నలిస్టు యూనియన్ జిల్లా అధ్యక్షుడు స్నేహల్, జిల్లా కార్యవర్గ సభ్యుడు ఇర్ఫాన్, ఆలూరు విలేకర్లు భీమా, మల్లి, బాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed