వీడిన కర్నూలు జంట హత్యల కేసు మిస్టరీ.. అవమానించారని అంతమొందించారు

by sudharani |
వీడిన కర్నూలు జంట హత్యల కేసు మిస్టరీ.. అవమానించారని అంతమొందించారు
X

దిశ, కర్నూలు ప్రతినిధి : కర్నూలు జిల్లా కేంద్రంలోని చెన్నమ్మ సర్కిల్ పరిధిలోని చింతలముని నగర్‌లో జరిగిన జంట హత్యల కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. అవమాన భారంతోనే హత మార్చినట్లు నిందితులు పోలీసుల ఎదుట నేరాన్ని అంగీకరించారు. వివరాలను జిల్లా కేంద్రంలోని నాలుగో పట్టణ పోలీసు స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సీఐ శంకరయ్య.. ఎస్ఐలు రామయ్య, ముని రామయ్యతో కలిసి వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని చెన్నమ్మ సర్కిల్‌లోని చింతముని నగర్‌లో నివాసం ఉంటున్న వరప్రసాద్, కృష్ణవేణి కుమారుడు శ్రవణ్ కుమార్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నెల ఒకటో తేదీన తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన కొత్త వెంకటేష్, రమాదేవి (38) దంపతుల కుమార్తె రుక్మిణి (18)తో శ్రవణ్ కుమార్‌కు వివాహమైంది.

నిందితుడి తల్లిదండ్రులు పట్టణంలోని వీధుల్లోఇడ్లీ అమ్ముతూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేవారు. అయితే శ్రవణ్ కుమార్‌కు అనారోగ్య కారణాల రీత్యా నూతన దంపతులకు మొదటి రాత్రి వాయిదా వేస్తూ వచ్చారు. ఈ క్రమంలో వధువు తల్లిదండ్రులు వెంకటేష్, రమాదేవిలు వరుడికి మగతనం లేదని, వివాహం చేసి తమ పిల్ల గొంతు కోశారని ఆరోపించారు. ఈ మేరకు వరుడి తల్లిదండ్రులతో గొడవ పడ్డారు. ఈ విషయాలను అవమానంగా భావించిన వరుడి తల్లిదండ్రులు.. ఎలాగైనా వధువు కుటుంభాన్ని హతమార్చాలని పథకం పన్నారు.

కొడుకుపై ఏదో దుష్ట ప్రయోగం చేశారని..

శ్రవణ్ కుమార్‌పై తన అత్తమామలు ఏదో దుష్ట ప్రయోగం చేశారని వరప్రసాద్, కృష్ణవేణి అపోహ పడ్డారు. ఈ నేపథ్యంలో రుక్మిణితోపాటు ఆమె తల్లిదండ్రులను హతమార్చాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం ఈ నెల 14న ఆంధ్రా ప్యారిస్ మాల్‌లో రెండు కత్తులు కొనుగోలు చేశాడు. అనంతరం అదే రోజున వరుడు తన భార్యతోపాటు అత్తామామలను వనపర్తి జిల్లా కేంద్రం నుంచి కర్నూలులోని తన ఇంటికి తీసుకొచ్చాడు. అప్పటికే పథకం పన్నిన శ్రవణ్ తండ్రి అనుకున్నట్లుగానే తన భార్యను ఇంటి బయట కాపలాగా ఉంచాడు.

ఇంటిలోని పై అంతస్తులోకి వధువుని శ్రవణ్ కుమార్ తీసుకెళ్లాడు. వధువు తల్లిదండ్రులను కింద అంతస్తులో ఉంచారు. పై అంతస్తులో వధువును తన భర్త, కింద అంతస్తులతో వధువు తల్లిదండ్రులను వరుడు తండ్రి కత్తులతో దాడి చేశారు. దీంతో రుక్మిణి, ఆమె తల్లి రమాదేవి అక్కడికక్కడే మృతి చెందారు. వధువు తండ్రి వెంకటేష్ తీవ్రంగా గాయపడ్డాడు. ఇంట్లో కేకలు వినిపించడంతో చుట్టుపక్కల వారు వచ్చారు. ఇంతలో నిందితులు పరారయ్యారు.

ప్రత్యేక బృందాలతో గాలింపు

విషయం తెలిసిన వెంటనే సీఐ శంకరయ్య సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. వధువు తండ్రి వెంకటేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఆదేశాల మేరకు డీఎస్పీ కేవీ మహేష్ ఆధ్వర్యంలో బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులు జిల్లా కేంద్రంలోని గుత్తి పెట్రోల్ బంక్ సమీపంలో ఉండగా అదుపులోకి తీసుకున్నారు. నిందితులు నేరాన్ని అంగీకరించారు. వారి నుంచి రెండు కత్తులు, దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హజరు పరచనున్నట్లు సీఐ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed