Heavy Rain Effect:కృష్ణమ్మ ఉగ్రరూపం..సీఎం చంద్రబాబు నివాసానికి వరద ముప్పు

by Jakkula Mamatha |
Heavy Rain Effect:కృష్ణమ్మ ఉగ్రరూపం..సీఎం చంద్రబాబు నివాసానికి వరద ముప్పు
X

దిశ,వెబ్‌డెస్క్:బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఇదిలా ఉంటే ఈ వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో ఎడతెరిపి లేకుండా అతి భారీ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా విజయవాడలో కుంభవృష్టి వర్షం కురిసింది. దీంతో నగరంలో సగభాగం జలమయం అయింది. మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ఇంటికి వరద ముప్పు పొంచి ఉంది. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా విజయవాడ జలదిగ్భందమైంది.

వరద నీటి కారణంగా విజయవాడలో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు ఎత్తి పూర్తిగా నీటిని విడుదల చేశారు. అవుట్ ఫ్లో 6,05,895 క్యూసెక్కులుగా ఉంది. వరద ప్రవాహం 7 లక్షల క్యూసెక్కులు దాటితే కరకట్ట వైపు నీళ్లు వెళ్లే అవకాశం ఉండడంతో ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి వరద ముప్పు పొంచి ఉంది. కృష్ణా నది కరకట్ట లోపల సీఎం చంద్రబాబు నివాసం ఉండటంతో వరద ఇంట్లోకి నీరు చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో అధికారుల్లో టెన్షన్ నెలకొంది. మరోవైపు..ప్రకాశం బ్యారేజ్‌కు అనూహ్యంగా గంట గంటకు వరద నీరు ప్రవాహం పెరుగుతోంది. ఇక, వాయుగుండం బలపడటంతో మరో రెండు రోజుల పాటు రాష్ట్రంలో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Advertisement

Next Story

Most Viewed