విజయవాడలో రైలు లోకో పైలట్ హత్య.. బీహార్ వాసి అరెస్ట్ (అసలు జరిగిందిదే)

by srinivas |   ( Updated:2024-10-12 10:55:33.0  )
విజయవాడలో రైలు లోకో పైలట్ హత్య.. బీహార్ వాసి అరెస్ట్ (అసలు జరిగిందిదే)
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడలో రైలు లోకో పైలట్ డి. ఎబినేజర్ హత్యకు గురైన విషయం తెలిసిందే. విధుల్లో ఉండగా ఆయన తలపై దుండగుడు బలంగా కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో చికిత్స పొందుతూ ఎబినేజర్ మృతి చెందారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడు బీహార్ రాష్ట్రం షైనీ దర్ఫారీ గ్రామ వాసి దేవ్ కుమార్‌గా గుర్తించారు. బతుకుదెరువు కోసం దేవ్ కుమార్ కుటుంబంతో కలిసి విజయవాడకు వచ్చారు. చెడు వ్యసనాలకు బానిసకావడంతో రాత్రి సమయంలో ఒంటరిగా కనిపించిన వాళ్లను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై దాడి చేసి డబ్బులు లాక్కునే వాడు.

ఇలా ఈ నెల 10న విజయవాడ రైల్వే స్టేషన్ ఎఫ్ క్యాబిన్ వద్ద లోక్ పైలట్ ఎబినేజర్ కనిపించారు. దీంతో ఆయన్ను దేవ్ కుమార్ అడ్డగించి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే ఎబినేజర్ లేవని చెప్పడంతో దేవ్ కుమార్ ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. తనతో తెచ్చుకున్న రాడ్డుతో లోక్ పైలట్ ఎబినేజర్ తలపై బలంగా కొట్టారు. అనంతరం జేబులోని రూ. 750ను తీసుకుని చేతిలోని రాడ్డును చెట్ల పొదల్లో విసిరేసి అక్కడి నుంచి పారిపోయారు. తలకు బలమైన గాయం కావడంతో ఎబినేజర్‌ను స్థానికులు విజయవాడ ఆంధ్ర ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఎబినేజర్ మృతి చెందారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. అయితేగతంలోనూ ఓ వ్యక్తిపై దాడి చేసినట్లు విచారణలో నిందితుడు దేవ్ కుమార్ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed