Kakinada Port: నిఘా నీడలో కాకినాడ పోర్టు.. సీసీ కెమెరాల ఏర్పాటుతో నిరంతర పర్యవేక్షణ

by Maddikunta Saikiran |
Kakinada Port: నిఘా నీడలో కాకినాడ పోర్టు.. సీసీ కెమెరాల ఏర్పాటుతో నిరంతర పర్యవేక్షణ
X

దిశ, కాకినాడ: రేషన్ బియ్యం(Ration Rice) అక్రమ రవాణా నేపథ్యంలో కాకినాడ పోర్టు(Kakinada Port)లో నిఘా మరింత పటిష్టం కాబోతుంది. సీనియర్ ఐపీఎస్‌ అధికారి ఆధ్వర్యంలో స్పెషల్ సెక్యూరిటీ టీమ్‌(SST)తో భద్రతా వ్యవస్థ ఏర్పాటు కానుంది. కాకినాడ పోర్టు భద్రతలో భాగంగా చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ను నియమించి ఆయన ఆధ్వర్యంలోనే పోర్టు పరిసర ప్రాంతాల్లో నిఘాను పటిష్టం చేయనున్నారు. షిఫ్టుల వారీగా అధికారుల పర్యవేక్షణ, సీసీ కెమెరా(CC camera)ల ఏర్పాటు చేయటం ద్వారా పోర్టును తమ ఆధీనంలోకి తీసుకుని రేషన్‌ బియ్యం మాఫియాను అరికట్టేలా చర్యలు చేపట్టనున్నారు. విదేశాలకు బియ్యం ఎగుమతికి అడ్డాగా ఉన్న కాకినాడ పోర్టునే పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుంటే రైస్ మాఫియా ఆగడాలను అడ్డుకోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

పకడ్బందీ వ్యూహం రెడీ

ఇప్పటి వరకు జరిగిందంతా అధికారుల వైఫల్యం వల్లేనన్నట్లుగా నివేదికల ద్వారా వెల్లడవుతోంది. ప్రత్యేక భద్రతా అధికారి పర్యవేక్షణలో కాకినాడ పోర్టులో జరుగుతోన్న దందాను అరికట్టవచ్చన్నది ప్రభుత్వ ఆలోచన. స్పెషల్ టీమ్ నిరంతరం పోర్టులోనే విధులు నిర్వహించటం ద్వారా పకడ్బందీ వ్యూహం రెడీ అవుతోంది. ఇప్పటికే రెవెన్యూ, పోలీస్‌, సివిల్‌ సప్లై, పోర్ట్‌, కస్టమ్స్‌ అధికారులతో టీమ్ ఏర్పాటు చేశారు. ఈ టీములతో పాటు ప్రత్యేక టీమ్‌లు కూడా క్షేత్రస్థాయి పరిశీలన చేయనున్నారు. ఎక్కడెక్కడి నుంచి బియ్యం పోర్టుకు చేరుతున్నాయో, ఎవరెవరి లింకులు ఏంటో బయటికి తీసేందుకు రెడీ అవుతున్నారు.

మాఫియాకు అధికారుల సహకారం?

రేషన్‌ బియ్యం అక్రమ రవాణా, కాకినాడ పోర్టులో వ్యవహారాలపై మంత్రులు జరిపిన సమీక్షలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. కిందిస్థాయి అధికారుల నుంచి ఉన్నతాధికారుల వరకు చాలామంది రైస్ మాఫియాకు సహకరిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. అధికారుల సహకారంతోనే గ్రామీణ స్థాయి నుంచి పోర్టు వరకు బియ్యం సరఫరా జరుగుతోందని నివేదికల ద్వారా వెల్లడవుతోంది. రేషన్‌ బియ్యం విదేశీ ఎగుమతులకు అడ్డాగా మారిన కాకినాడ పోర్టులోనే బియ్యం రీసైక్లింగ్‌ కూడా జరుగుతోందనే అనుమానాలు వెల్లడవుతున్నాయి. పోర్టులోని గోదాములను లీజుకు తీసుకుని రేషన్‌ బియ్యాన్ని నూకలు చేయడం, పాలిష్‌ పట్టి సిల్కీ రైస్‌గా మార్చడానికి యంత్రాలను ఏర్పాటు చేసుకున్నట్లు ఫిర్యాదులందుతున్నాయి. దీంతో పోర్టుపై పోలీస్ నిఘాను మరింత పటిష్టం చేసి బియ్యం అక్రమ రవాణా జరిగే ప్రాంతాల్లో అధికారులను నియమించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed