Ap News: ఆ విషయంలో చంద్రబాబును మించిపోయిన లోకేశ్

by srinivas |   ( Updated:2023-03-06 11:34:38.0  )
Ap News: ఆ విషయంలో చంద్రబాబును మించిపోయిన లోకేశ్
X

దిశ,డైనమిక్ బ్యూరో: పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం వినూత్నం, ఆదర్శమని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు అన్నారు. విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ విజయవంతం కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. కేవలం రెండు రోజుల వ్యవధిలో లక్ష్యానికి మించి రూ. 13.41 లక్షల కోట్ల విలువైన 378 ఒప్పందాలు కుదుర్చుకోవడం సంతోషదాయకమన్నారు. వీటి ద్వారా 6.09 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు వెల్లడించారు.


విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మల్లాది విష్ణు గత టీడీపీ ప్రభుత్వం మాదిరిగా ఎంవోయూలు చేసుకుని వదిలేయకుండా వాటిని తక్షణం అమల్లోకి తీసుకువచ్చేలా సీఎస్ అధ్యక్షతన ఒప్పందాల పర్యవేక్షణ కమిటీని కూడా సీఎం జగన్ వేయడం అభినందనీయమన్నారు. అందువల్లే ప్రభుత్వ పని తీరుపై కేంద్రమంత్రులు, వ్యాపార దిగ్గజాలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారని..‘జే అంటే జగన్ –జే అంటే జోష్’ అంటూ కీర్తిస్తున్నట్లు మల్లాది విష్ణు చెప్పారు. వైసీపీ ప్రభుత్వంపై నమ్మకంతో ప్రపంచం నలుమూలల నుంచి పెట్టుబడిదారులు ముందుకువస్తే చంద్రబాబు, లోకేశ్‌ జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. అబద్ధాలు చెప్పడం, అసత్యాలు వల్లించడంలో చంద్రబాబును లోకేశ్ మించిపోయారని ఎద్దేవా చేశారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు హయాంలో ఆకర్షించిన పెట్టుబడులపై తెలుగుదేశం శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని ప్లానింగ్ బోర్డు చైర్మన్ మల్లాది విష్ణు డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed