కోడికత్తి కేసు : సీఎం జగన్ కోర్టుకు రావాలి లేదా నిందితుడికి బెయిల్ ఇవ్వాలి

by Seetharam |   ( Updated:2023-08-29 07:18:41.0  )
కోడికత్తి కేసు : సీఎం జగన్ కోర్టుకు రావాలి లేదా నిందితుడికి బెయిల్ ఇవ్వాలి
X

దిశ, డైనమిక్ బ్యూరో : విశాఖపట్నం ఎయిర్ పోర్టులో నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న సీఎం జగన్ పై కోడికత్తితో దాడి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ హత్యకేసులో నిందితుడు జనిపల్లి శ్రీనివాస్ ఇప్పటి వరకు బెయిల్‌పై విడుదల కాలేదు. అయితే ఈ కేసు విచారణను విజయవాడ ఎన్ఐఏ కోర్టు నుంచి విశాఖ ఎన్ఐఏ కోర్టుకు బదిలీ అయ్యింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఎన్ఐఏ కోర్టులో విచారణ జరిగింది. నిందితుడు శ్రీనివాస్‌ను పోలీసులు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి విశాఖ ఎన్ఐఏ కోర్టుకు తీసుకువచ్చారు. ఈ కేసు విచారణకు నిందితుడు శ్రీనివాస్ కుటుంబ సభ్యులు సైతం హాజరయ్యారు. విశాఖ ఎన్ఐఏ కోర్టులో వాదనలు జరిగాయి. ఈ కేసు విచారణకు సీఎం వైఎస్ జగన్ హాజరుకావాలని నిందితుడు శ్రీనివాస్‌ తరఫు న్యాయవాది సలీం కోర్టును కోరారు. లేని పక్షంలో బెయిల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు 2018 అక్టోబర్ 25న విశాఖ ఎయిర్ పోర్టులో ఈ ఘటన జరిగిందని అప్పటి నుంచి ఇప్పటి వరకు నిందితుడు శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు కాలేదని అన్నారు. ఈ కేసులో ఎలాంటి కుట్ర కోణం లేదని ఎన్ఐఏ విచారణలో తేల్చినప్పటికీ ఎందుకు బెయిల్ ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఈ కేసులో సీఎం వైఎస్ జగన్ ఎన్‌వోసీ అయినా ఇవ్వాలి లేదా వచ్చి వాదనలు అయినా వినిపించాలి అని కోరారు. ఈ కేసులో ఎలాంటి కుట్రకోణం లేదని ఎన్ఐఏ తేల్చి చెప్పినప్పటికీ సీఎం జగన్ కోర్టుకు హాజరుకాకపోవడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. రాజకీయాల కోసమే కేసు విచారణను వాయిదా వేస్తున్నారా అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఈ అంశాన్ని వాడుకోవాలని చూస్తున్నారేమోనని నిందితుడు శ్రీనివాస్ తరఫు న్యాయవాది అనుమానం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తరఫున న్యాయవాది వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. ఇకపోతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోర్టు విచారణకు హాజరుకావాలని దళిత సంఘాల ఐక్య వేదిక డిమాండ్ చేసింది.

Advertisement

Next Story

Most Viewed