టీడీపీకి బిగ్ షాక్.. విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా కేశినేని నాని

by srinivas |   ( Updated:2024-01-11 15:45:45.0  )
టీడీపీకి బిగ్ షాక్.. విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా కేశినేని నాని
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ ఎంపీ కేశినేని చెప్పినట్టుగా ఆ నియోజకవర్గం నుంచి మళ్లీ పోటీ చేయబోతున్నారు. అయితే ఈసారి ఆయన టీడీపీ నుంచి కాకుండా వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు. తమ్ముడు కేనినేని చిన్నితో విభేదాలు రావడంతో టీడీపీకి ఆయన గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. అటు అధినేత చంద్రబాబు కూడా కేశినేని చిన్నికే మద్దతుగా ఉండటంతో ఇకపై తన ప్రయాణం వైసీపీతోనే అని ప్రకటించారు. సీఎం జగన్‌ను కలిసి విజయవాడ ఎంపీగా పోటీ చేస్తానని తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. దీంతో ఆయనకే సీఎం జగన్ సీటు ఖరారు చేశారు.

గతంలో విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన పొట్లూరి వర ప్రసాద్.. కేశినేనిపై ఓడిపోయారు. అయితే అప్పటి నుంచి కూడా పీవీపీ వైసీపీకి దూరంగా ఉంటూ వచ్చారు. దీంతో ఎంపీ కేశినేని నానికి మంచి చాన్స్ దక్కినట్టైంది. టీడీపీకి రాజీనామా చేసిన వెంటనే వైసీపీలో చేరతానని జగన్‌ను కలిశారు. దీంతో కేశినేని నానికే విజయవాడ ఎంపీ సీటు ఇచ్చేందుకు జగన్ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు తాజాగా విడుదల చేసిన వైసీపీ ఇంచార్జుల మూడో జాబితాలో కేశినేని నాని పేరును పొందుపర్చారు. మంత్రి బొత్స సత్యనారాయణ వైసీపీ మూడో లిస్టును ప్రకటించారు. విజయవాడ ఎంపీ అభ్యర్థిగా వైసీపీ తరపున కేశినేని నానిని ఖరారు చేసినట్లు స్పష్టం చేశారు.

Advertisement

Next Story