నిరాశలో కైకలూరు తెలుగు తమ్ముళ్లు.. మరో బలమైన నేత కోసం బాబు ఫోకస్!

by Satheesh |
నిరాశలో కైకలూరు తెలుగు తమ్ముళ్లు.. మరో బలమైన నేత కోసం బాబు ఫోకస్!
X

దిశ, జంగారెడ్డిగూడెం: రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నికల హడావుడి మొదలైంది. ఎవరికి వారే ఎత్తుకు పై ఎత్తులేసుకుంటూ పార్టీలను బలపరుస్తూ ముందుకు సాగుతున్నారు. ఏలూరు జిల్లాలో కైకలూరు రాజకీయం రచ్చకెక్కింది. టీడీపీ ఇన్ చార్జిగా ఉన్న జయమంగళం వెంకట రమణ తాజాగా ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీలో చేరిపోయారు. ఏపీలో ఖాళీ ఉన్న 14 ఎమ్మెల్సీ స్థానాల్లో జయ మంగళం పేరును వైసీపీ అధిష్టానం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఆ హామీ మేరకు ఆయన టీడీపీని వీడినట్లు ప్రచారం జరుగుతుంది.

నిజమైన ఊహాగానాలు

1999లో రాజకీయ రంగప్రవేశం చేసిన జయ మంగళ వెంకటరమణ 2005లో జడ్పీటీసీగా గెలుపొందారు. 2009లో అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందారు. 2014లో బీజేపీ, టీడీపీ పొత్తుతో టికెట్ దక్కలేదు. 2019లో జరిగిన ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. అప్పటి నుంచి టీడీపీ ఇన్ చార్జిగా ఉన్నారు. ఇటీవల కాలం నుంచి అధిష్టానంపై అసంతృప్తి గా ఉన్నారు. త్వరలో పార్టీ వీడతారని ఊహాగానాలు నిజమయ్యాయి.

టీడీపీ టిక్కెట్ ఇవ్వదనే..

వైసీపీ భారీ ఆఫర్ ఇచ్చి జయమంగళను స్వాగతం పలికినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం బలోపేతానికి తెలుగు తమ్ముళ్లు కష్టపడుతున్న సమయంలో ఇన్ చార్జిగా ఉన్న ఆయన పార్టీని వీడటంతో కాస్తా నిరాశలో ఉన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పొందిన తరువాత వెంకటరమణ డీలా పడిపోయారు. టీడీపీ కార్యక్రమాల్లో క్రియాశీలత తగ్గించారు.

అధిష్టానం మాత్రం నియోజకవర్గ ఇన్చార్జ్ పదవిని ఆయనకే కట్టబెట్టింది. ఈయన పనితనం మీద అధిష్టానానికి అందిన నివేదిక ఆధారంగా వచ్చే ఎన్నికల్లో ఆయనకు పార్టీ టిక్కెటు లేదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నారు. పార్టీ శ్రేణుల్లో కూడా పట్టును కోల్పోవడంతో ఆయన వైసీపీ దరి చేరినా పెద్దగా ప్రభావం ఉండదని అంటున్నారు.

వైసీపీకి ఏం లాభం

కైకలూరు టీడీపీ ఇంచార్జ్ జయమంగళ వెంకటరమణ పై ఆ పార్టీ అధిష్టానం వేటు వేస్తున్నట్లు వస్తున్న ప్రచారాన్ని వైసీపీ నేతలు ఆసరాగా తీసుకున్నట్లు కనిపిస్తుంది. ప్రతిపక్ష పార్టీ నుంచి చేరికలను ప్రచారం చేసి పట్టు సాధిద్దాం అనే దిశగా అధికార పార్టీ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

కనపించని ప్రభావం

కైకలూరు టీడీపీని ఆ పార్టీ ఇన్ చార్జ్ జయమంగళ వెంకటరమణ వీడారు. తెలుగు తమ్ముళ్లు నిరాశకు గురైనా, పెద్దగా ప్రభావం కనిపించడం లేదు. ఇప్పటివరకు నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న జయ మంగళం పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలతను చూపించలేదు. వర్గంగా చీలి పార్టీకి దూరంగా ఉన్నారు. టీడీపీ అధిష్టానం నియోజవర్గ ఇన్చార్జి మార్పుపై దృష్టి పెట్టింది. వర్గ పోరుతో సంబంధం లేకుండా బలమైన నాయకుడు ఇన్చార్జి స్థానంలో దింపితే గట్టి పోటీ ఇవ్వొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed