Janasena: నిన్ను నమ్మడం ఎలా బాబూ!

by srinivas |   ( Updated:2023-06-26 12:10:27.0  )
Janasena: నిన్ను నమ్మడం ఎలా బాబూ!
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేడి రాజుకుంటుంది. ఒకవైపు యువగళం పాదయాత్ర మరోవైపు వారాహి విజయ యాత్రలతో రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. మరోవైపు వైసీసీ సైతం ప్రజల్లో నిత్యం తిరుగుతూనే ఉంటుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏదో ఒక కార్యక్రమం పేరుతో వారానికి ఒక సభ పెడుతున్న సంగతి తెలిసిందే. ఇకపోతే వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తుతో ఎన్నికలకు వెళ్తారనే ప్రచారం ఉంది. ఇప్పటికే పొత్తు జరిగిపోయిందని కానీ టికెట్ల సర్ధుబాటు తరువాయే అని ప్రచారం కూడా జరుగుతుంది. ఇలాంటి తరుణంలో చంద్రబాబుతో పవన్ కల్యాణ్‌ను కలవనీయకుండా ఉండేందుకు అధికార పార్టీ కత్తులు దూస్తోంది. పవన్‌ను ప్యాకేజీ స్టార్ అంటూ రెచ్చగొడుతుంది. మరోవైపు కులాల ఐక్యత కోసం తాను పోరాటం చేస్తానని పవన్ కల్యాణ్ చెప్తుంటే కాపు కులాల మధ్య చిచ్చు పెట్టేలా వైసీపీ వ్యవహరిస్తోందన్న ప్రచారం ఉంది.

మరోవైపు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం లేఖలతో పవన్ కల్యాణ్‌పై విరుచుకుపడటం.. వైసీపీలోని కాపు నేతలు పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేయడంతో రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. అధికార పార్టీలోని నాయకులతోపాటు కాపు సామాజిక వర్గంలోని కొందరుతో పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తూ వైసీపీ నాయకత్వం తిట్లదండం అందుకుంది. అయినప్పటికీ టీడీపీ మౌనంగా ఉండిపోయింది. గోడమీద పిల్లివాటం ప్రదర్శించింది. కనీసం టీడీపీలోని కాపు సామాజిక వర్గం నేతలు ఒక్కరు కూడా పవన్ కల్యాణ్‌కు మద్దతు ప్రకటించలేదు. దీంతో చంద్రబాబును నమ్మేదెట్ట అనే ప్రశ్న జనసైనికుల్లో మెుదలైంది. చంద్రబాబు నిను నమ్మం అంటూ కొందరు జనసైనికులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేనతో పొత్తుకోసం ప్రయత్నిస్తున్న చంద్రబాబు కనీసం పవన్ కల్యాణ్‌కు కష్టకాలంలో కూడా తోడు రాకపోవడంతో నిన్ను నమ్మేదెలా బాబు అంటూ జనసైనికులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

పొత్తు ఉంటే ఇలాగేనా?

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సమరం మెుదలైంది. మరికొన్ని నెలల్లోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పొత్తుల చుట్టూనే రాజకీయం నడుస్తోంది. వైసీపీ వచ్చే ఎన్నికల్లో సింగిల్‌గా వస్తామని తమకు పొత్తులు అవసరం లేదని ప్రకటించింది. అయితే అటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇటు జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజులు పొత్తులతోనే ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు. ఇప్పటికే జనసేన బీజేపీ పొత్తులో ఉన్న నేపథ్యంలో ఈ రెండు పార్టీలు కలిసే ఎన్నికలకు వెళ్తాయని ఇప్పటికే ఇరు పార్టీల అధ్యక్షులు ప్రకటించేశారు. మరోవైపు టీడీపీను కూడా కలుపుకుని ఈ మూడు పార్టీలు పొత్తుతో ఎన్నికలకు వెళ్లినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని ప్రచారం జరుగుతుంది. మరోవైపు టీడీపీతో పొత్తుకు బీజేపీ అంగీకారం చెప్పలేదని ఈ పరిణామాలతో టీడీపీ-జనసేనలు మాత్రమే ఎన్నికలకు పొత్తుతో వెళ్తాయనే ప్రచారం కూడా జరుగుతుంది. వైసీపీని గద్దె దించాలన్నదే అటు చంద్రబాబు ఇటు పవన్ కల్యాణ్ లక్ష్యం. అయితే బీజేపీతో పొత్తుపెట్టుకుని ఎన్నికలకు జనసేన వెళ్తే అది సాధ్యం కాదని గత ఎన్నికల ఫలితాల్లో రుజువు అయ్యింది. ఈ నేపథ్యంలో టీడీపీ-జనసేన కలిసి వెళ్తే వైసీపీని అధికార పీఠం నుంచి గద్దె దించే ఛాన్స్ ఉందని ఇరు పార్టీలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేనల మధ్య పొత్తు దాదాపు ఖరారైందని.. సీట్ల సర్ధుబాటే తరువాయని ప్రచారం జరుగుతుంది.

గోడమీద పిల్లిలా టీడీపీ

తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తే వైసీపీకి ముచ్చెమటలు పట్టించడం ఖాయం. ఈ నేపథ్యంలో వైసీపీ అలర్ట్ అయ్యింది. పొత్తును చెడగొట్టేందుకు అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈ ప్రయత్నంలో భాగంగానే పవన్ కల్యాణ్‌ను రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. 2014 నుంచి ప్యాకేజీ స్టార్ అంటూ పవన్‌ కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్న వైసీపీ ఈసారి మరింత దూకుడు పెంచింది. ప్యాకేజీ స్టార్ అంటూ తీవ్ర విమర్శలు చేయడంతో పవన్ కల్యాణ్ చెప్పు చూపించిన సంగతి తెలిసిందే. అనంతరం కాపుల ఆత్మగౌరవాన్ని చంద్రబాబుకు పవన్ కల్యాణ్ తాకట్టుపెడుతున్నాడనే ప్రచారం చేసింది.దీంతో కాపుల్లో చీలిక తీసుకురావచ్చని ప్రయత్నం చేసింది. ఈ ప్లాన్ వారాహి విజయయాత్రలో సక్సెస్ అయ్యింది. పవన్ కల్యాణ్‌పై కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. కాపులకు ఏం చేశారు పవన్ కల్యాణ్ అని ప్రశ్నిస్తూ రెండు లేఖలు రాశారు. ముద్రగడ లేఖలతో కాపుల్లో చీలిక వచ్చింది.

ముద్రగడ వర్సెస్ పవన్ కల్యాణ్ అన్నట్లుగా కాపుల్లో చీలిక వచ్చింది. అంతేకాదు వైసీపీలోని కాపు నేతలు పవన్ కల్యాణ్‌కు రెండు చెప్పులు చూపిస్తూ తీవ్ర విమర్శలు చేశారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా వైసీపీలోని ఇతర సామాజిక వర్గం నేతలు సైతం ముద్రగడను వెనకేసుకువస్తూ పవన్ కల్యాణ్‌ను తిట్టిపోశారు. దీంతో రాజకీయం వేడెక్కింది. ఇదంతా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చోద్యం చూస్తున్నట్లుగా చూస్తూ ఉన్నారు. కాపుల ఉద్యమం వేడికి చలికాచుకున్నారు. కనీసం టీడీపీ స్పందించలేదు. బొండా ఉమా, బుద్ధా వెంకన్న మినహా మిగిలిన వారెవరూ వైసీపీకి కౌంటర్ ఇవ్వలేదు. దీంతో జనసైనికులు టీడీపీపై గుర్రుగా ఉన్నారు. పొత్తుకోసం ప్రయత్నిస్తున్న చంద్రబాబు నాయుడు తమ పార్టీ అధినేతపై తీవ్ర విమర్శలు చేసినా కనీసం స్పందించకపోవడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు. నిన్ను ఎందుకు నమ్మాలి బాబు అంటూ ప్రశ్నిస్తున్నారు.

నిన్ను నమ్మడం ఎలా బాబూ!

మరోవైపు పవన్ కల్యాణ్‌ను ప్యాకేజీ స్టార్.. జనసేనను చంద్రబాబుకు హోల్‌సేల్‌గా అమ్మేశారంటూ వైసీపీ చేస్తున్న విమర్శలపై జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కల్యాణ్‌ను కొనుగోలు చేసే శక్తి సామర్థ్యం ఈ ప్రపంచంలో ఎవరికీ లేదని కౌంటర్ ఇస్తున్నారు. విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర భవిష్యత్ కోసం పవన్ కల్యాణ్ బీజేపీ, టీడీపీతో పొత్తు పెట్టుకుని 2014 ఎన్నికలకు వెళ్లారని ఈ విషయాన్ని చంద్రబాబు ఎందుకు ప్రజలకు తెలియజేయడం లేదని జనసైనికులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసమే పవన్ కల్యాణ్ 2014లో తమతో పొత్తు పెట్టుకున్నారని చంద్రబాబు ఇప్పటి వరకు ఎందుకు చెప్పడం లేదని అన్నారు. పవన్ కల్యాణ్‌ను ప్యాకేజీ స్టార్ అంటున్నా...టీడీపీకి జనసేనను అమ్మేశారంటున్నా..దత్తపుత్రుడు అంటున్నా కనీసం వాటిని చంద్రబాబు ఎందుకు ఖండించడం లేదని జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రంలో అటు టీడీపీని ఇటు కేంద్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు దేశ, రాష్ట్రాల భవిష్యత్ కోసం మద్దతు పలికితే ఆ విషయాన్ని ప్రజలకు తెలియజేయకుండా ప్యాకేజీ స్టార్ అంటూ విమర్శలు చేస్తున్నా స్పందించకపోవడంపై మండిపడుతున్నారు. ఈసారి కూడా పొత్తులో ఎన్నికలకు వెళ్తే ఆ తర్వాత చంద్రబాబు ఇలానే పవన్ కల్యాణ్‌ను వదిలేస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. నిన్ను నమ్మడం ఎలా బాబూ అంటూ జనసైనికులు ప్రశ్నిస్తున్నారు.

Read more: Chandrababu: రాష్ట్రమా..రావణ కాష్ఠమా ?.. రెండు నిమిషాల వీడియాతో తీవ్ర ఆగ్రహం

Advertisement

Next Story

Most Viewed