AP Politics:జనసేనాని పై జగనాస్త్రం..పిఠాపురం ఓట‌ర్ల‌పైనే జ‌గ‌న్ గురి!

by Jakkula Mamatha |   ( Updated:2024-05-08 08:13:23.0  )
AP Politics:జనసేనాని పై జగనాస్త్రం..పిఠాపురం ఓట‌ర్ల‌పైనే జ‌గ‌న్ గురి!
X

దిశ ప్రతినిధి, కాకినాడ: రాష్ట్రంలో కొద్ది రోజుల్లోనే సార్వ‌త్రిక ఎన్నిక‌ల ప్రచార తంతు ముగిసి పోలింగ్ జరగనున్న నేప‌థ్యంలో ఆయా పార్టీ నేత‌లు రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌చారాల జోరుతో ప‌రుగులు పెడుతున్నారు. ఈనేప‌థ్యంలో ఆఖ‌రి అస్త్రంగా వైసీపీ నేత‌లు పిఠాపురాన్ని ఎంచుకున్న‌ట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా జ‌గ‌న్ పిఠాపురం ఓట‌ర్ల‌పైనే గురి పెట్ట‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మైంది. జ‌గ‌న్ పోటీ చేస్తున్న పులివెందుల‌ను సైతం ప‌క్క‌న పెట్టి పిఠాపురం వైపే వైసీపీ దృష్టిసారించ‌డం వెనుక ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు అడ్డుక‌ట్ట వేయ‌డమే ప్ర‌ధాన ఉద్దేశ్యంగా రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నాలు వేస్తున్నారు.

పిఠాపురం పేరు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగుతోంది. దీనికి కార‌ణం ప‌వ‌న్ ఇక్క‌డ నుంచి పోటీ చేయ‌డ‌మే. అయితే ప‌వ‌న్ క‌ళ్యాణ్ గెలుపుకు ఏమి ఢోకా ఉండ‌ద‌న్న ప్రచారం బాగానే ఉన్న‌ప్ప‌టికీ, ప‌వ‌న్ ఓట‌మి ల‌క్ష్యంగా వైసీపీ పావులు క‌దుపుతోంది. ఇందుకు ఏకంగా ముఖ్య‌మంత్రి ఎన్నిక‌ల ప్ర‌చారం కూడా పిఠాపురం నుండే ముగింపు ప‌ల‌క‌డానికి సిద్ధ‌మ‌య్యారు.చివ‌రి స‌భ ను పిఠాపురంలోనే భారీగా ఏర్పాటు చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఈనెల 10వ తేదిన పిఠాపురంలో వైసీపీ భారీ స‌భ‌ను నిర్వ‌హించనుంది. ఈమేర‌కు ఇప్ప‌టికే పార్టీ లోక‌ల్ నాయ‌క‌ల‌కు, ఇన్‌ఛార్జిల‌కు స‌మాచారం అందిన‌ట్లుగా తెలుస్తోంది. ఈస‌భ కేవ‌లం ప‌వ‌న్ క‌ళ్యాణ్ టార్గెట్‌గానే ఉంటుంద‌ని అంటున్నారు.

పిఠాపురానికి సినిమా రంగం నుండి పెద్ద ఎత్తున సినీ న‌టులు ప్ర‌చారానికి రావడం జ‌న‌సేనలో జోష్ ఎక్కువగా ఉండ‌టంతో వీట‌న్నింటికి స‌రియైన స‌మాధానం ఇవ్వాల‌నే ఉద్దేశ్యంతోపాటు, పవ‌న్ ను ఏలాగైనా ఓడించాల‌న్న సందేశం ఇవ్వ‌డానికి వైసీపీ ముమ్మ‌ర య‌త్నాలు మొద‌లు పెట్టిన‌ట్టుగా తెలుస్తోంది. ఆఖరి అస్త్రంగా జ‌గ‌న్ పిఠాపురంలో జ‌రగబోయే స‌భ‌ను ఎంచుకున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్ప‌టికే జ‌గ‌న్‌ను టార్గెట్ చేసి ప్ర‌చార స‌భ‌ల్లో ప్ర‌సంగాల‌ తో అల‌జ‌డి సృష్టిస్తున్నా రు.ఈ ప‌రిస్థితుల్లో ప‌వ‌న్ పోటీ చేసే స్థానంపై వైసీపీ గురి పెట్టి, ప‌వ‌న్ స్పీడ్ కు బ్రేక్ వేయాల‌ని వైసీపీ యోచిస్తోంది.పిఠాపురంలో ప‌వ‌న్ ను ఓడించాల‌నే ప్ర‌ణాళిక‌ల‌తో సిద్ధం కావ‌డం, అందుకు నేరుగా జ‌గ‌న్ ఆఖ‌రి స‌భ పిఠాపురంలో పెట్ట‌డం చ‌ర్చనీయాంశ‌మైంది.

పిఠాపురానికి వ‌రాల జ‌ల్లు..?

జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి పిఠాపురం స‌భ ద్వారా పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధికి వ‌రాల జ‌ల్లు ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంద‌ంటున్నారు. పిఠాపురంలో ప‌వ‌న్ గెలిస్తే రూపు రేఖ‌లు మారిపోతా య‌నే ప్ర‌చారాన్ని జ‌న‌సైనికులు,కూట‌మి నాయ‌కులు చెబుతూ వ‌స్తున్నారు. అయితే అవ‌న్ని అబ‌ద్దాల‌ని, వైసీపీ ప్ర‌భుత్వ‌మే పిఠాపురాన్ని అభివృద్ధి చేసి చూపిస్తోం ద‌నే న‌మ్మ‌కాన్ని ప్ర‌జ‌ల్లోకి వెళ్లేలా జ‌గ‌న్ ప‌లు హామీలతోపాటు, వంగా గీత ప‌నిత‌నాన్ని బ‌లంగా చెప్పే ప్ర‌య‌త్నం చేస్తార‌న్న‌ట్టుగా చెబుతు న్నారు.

ముఖ్యంగా ప‌వ‌న్‌ను టార్గెట్ చేసి, మెజార్టీ ఓట్లున్న సామాజిక వ‌ర్గాన్ని కూడా వైసీపీ వైపు తిప్పుకునే ప్ర‌య‌త్నాల‌ను వైసీపీ ముమ్మ‌రం చేసింది. ఇక బిసీ,ఎస్సీ ఓటర్లను ఆక‌ర్షించేందుకు వైసీపీ నేత‌లు ఇప్ప‌టికే క్షేత్ర‌స్థాయిలో ముమ్మ‌ర య‌త్నాలు చేస్తున్నారు. ఇక జ‌గ‌న్ కూడా ఆయా మైనార్టీ వ‌ర్గాల‌ను ఆక‌ట్టుకునేలా ప్ర‌క‌ట‌నలిచ్చే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు. పిఠాపురంలో జ‌గ‌న్ ప్ర‌చార స‌భ‌కు సంబంధించి ఆ పార్టీ అధికారిక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.

Advertisement

Next Story