సీఎం జగన్‌కి హైకోర్టు నోటీసులు.. శుభపరిణామం అన్న ఎంపీ రఘురామ కృష్ణంరాజు

by Seetharam |
సీఎం జగన్‌కి హైకోర్టు నోటీసులు.. శుభపరిణామం అన్న ఎంపీ రఘురామ కృష్ణంరాజు
X

దిశ, డైనమిక్ బ్యూరో : అక్రమాస్తుల కేసులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు ఇవ్వడంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు స్పందించారు. వైఎస్ జగన్‌కు నోటీసులు ఇవ్వడం శుభపరిణామం అన్నారు. జగన్ అక్రమాస్తులపై త్వరగా విచారణ జరపాలని మాజీ ఎంపీ హరిరామ జోగయ్య పిటిషన్ వేయడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. జగన్‌కి తెలంగాణ హైకోర్టు నోటీసులు ఇవ్వడం శుభ పరిణామం అని చెప్పుకొచ్చారు. సీఐడీ చీఫ్ సంజయ్, ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి దేశమంతా తిరిగి ప్రెస్‌మీట్లు పెట్టవచ్చా? టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం కేసుపై మాట్లాడొద్దు అంటారా? ఢిల్లీలోని ఒక హోటల్‌లో సీఐడీ అధికారి సంజయ్, ఏఏజీ సుధాకర్ రెడ్డి పెట్టిన ప్రెస్‌మీట్‌కి ఎవరు డబ్బులు కట్టారు? బిల్లులు ఎలా చెల్లించారని ఎంపీ రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. ఇకపోతే టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పనితీరు అద్భుతంగా ఉందని ఎంపీ రఘురామ కృష్ణంరాజు కొనియాడారు. నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్నారని కితాబిచ్చారు. పాలకొల్లులో టిడ్కో ఇళ్లు ప్రజలకు ఇచ్చినట్టే ఇచ్చి వాటిపై ప్రభుత్వం లోన్ తీసుకుందని ఇది పెద్ద కుంభకోణం అని అన్నారు. ఈ విషయాన్ని నిమ్మల రామానాయుడు బయట పెట్టారని చెప్పుకొచ్చారు. భవిష్యత్‌లో ఏపీలో ఉన్న అందరి ఆస్తులను బ్యాంకుల్లో సీఎం జగన్‌ తాకట్టు పెట్టే అవకాశం ఉందని ఆరోపించారు. రాష్ట్రంలో ఆర్థిక కుంభకోణాలపై కోర్టులో పిటిషన్ దాఖలు చేశానని ఈ పిటిషన్‌ను వేరే ధర్మాసనం విచారించనుందని ఎంపీ రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

Advertisement

Next Story