విశాఖకు రాజధాని తరలింపుపై హైకోర్టు‌లో విచారణ

by Seetharam |
ap highcourt
X

దిశ, డైనమిక్ బ్యూరో: అమరావతి నుంచి విశాఖపట్టణంకు క్యాంపు ఆఫీస్‌ల ముసుగులో రాజధాని తరలింపు పిటిషన్‌పై మంగళవారం ఏపీ హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. ఈ సందర్భంగా రాజధాని ఆఫీసులు ప్రస్తుతం తరలించడం లేదని ఏజీ హైకోర్టు న్యాయమూర్తికి తెలియజేశారు. అలాగే ఆఫీస్‌లు తరలిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం అపోహ మాత్రమేనని హైకోర్టులో ఏపీ ప్రభుత్వం తరఫున అఫిడవిట్‌ దాఖలు చేశారు. దీంతో ఈ పిటిషన్‌ను త్రిసభ్య ధర్మాసనం ముందుకు పంపాలని రిజిస్ట్రీలో అప్లికేషన్ ఇచ్చినట్లు ప్రభుత్వం తరఫు న్యాయవాది ఏజీ శ్రీరాం పేర్కొన్నారు.తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేయాలని ఏజీ న్యాయమూర్తిని విజ్ఞప్తి చేశారు. దీంతో కేసు విచారణను ఏపీ హైకోర్టు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.

హైకోర్టు ఆదేశాలివే!

విశాఖకు రాజధాని తరలింపు కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. క్యాంపు కార్యాలయాల ముసుగులో విశాఖకి రాజధాని తరలింపు పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రోస్టర్ ప్రకారం బెంచ్‌ ముందుకు పిటిషన్‌ వచ్చిందని..విచారించిన తర్వాతే ఆదేశాలు జారీ చేస్తామని హైకోర్టు న్యాయమూర్తి తెలిపారు. అయితే వైసీపీ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్న ఏజీ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో మధ్యంతర పిటిషన్ వేసుకునేందుకు ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు న్యాయమూర్తి అవకాశం ఇచ్చారు. రాజధాని వ్యవహారాలను విచారించే త్రిసభ్య ధర్మాసనం లేదా పాలనాపరంగా ఏం చేయాలనే అంశంపై ప్రభుత్వమే ఆలోచించుకోవాలని సూచించారు. ఈ అంశంపై ఒకవేళ ఎలాంటి ఆదేశాలు ఇవ్వకపోతే తానే విచారిస్తానని హైకోర్టు న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఇందుకు ఏజీ సైతం అంగీకారం తెలిపారు. అయితే ఈలోగా కార్యాలయాలు తరలించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, అందువల్ల మధ్యంతర ఆదేశాలు ఇవ్వాలని పిటీషనర్ తరపు న్యాయవాది ఉన్నం మురళీధర్ హైకోర్టుకు తెలియజేశారు.అయితే కార్యాలయాల తరలింపుపై ఇప్పటికిప్పుడు ఏమీ జరగదని, అది సుదీర్ఘ ప్రక్రియ అని ఏజీ హైకోర్టుకు వివరించారు. ప్రభుత్వం ఇలానే చెప్పి మళ్లీ తిరిగి కార్యాలయాలను తరలించేందుకు అంతర్గత ఏర్పాట్లు చేస్తోందని పిటీషనర్ తరపు న్యాయవాది హైకోర్టు న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం వైపు నుంచి రాజధానిని తరలించకుండా ఆదేశాలు తీసుకోవాలని హైకోర్టు ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించింది.

Advertisement

Next Story

Most Viewed