ఏపీలో అభివృద్ధిపై సీఎం జగన్ దూకుడు.. మూడు జిల్లాల్లో కొత్త కార్యక్రమాలకు శ్రీకారం

by srinivas |
ఏపీలో అభివృద్ధిపై సీఎం జగన్ దూకుడు.. మూడు జిల్లాల్లో కొత్త  కార్యక్రమాలకు శ్రీకారం
X

దిశ, ఏపీ బ్యూరో: ఈ రోజు వండర్‌పుల్‌ మూమెంట్‌ అని, దాదాపుగా రూ. 1425 కోట్ల పెట్టుబడితో మూడు జిల్లాల్లో మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. గురువారం వర్చువల్ విధానంలో క్రిబ్‌కో గ్రీన్‌ ఎనర్జీ ప్రైవేట్‌ లిమిటెడ్, విశ్వసముద్ర బయో ఎనర్జీ, సీసీఎల్‌ పుడ్‌ అండ్‌ బెవరేజెస్‌ పరిశ్రమలకు వర్చువల్‌గా శిలాఫలకం ఆవిష్కరించి, శంకుస్ధాపన చేయడంతో పాటు గోద్రెజ్‌ ఆగ్రోవెట్‌ లిమిటెడ్‌ సంస్ధను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ వీటి ద్వారా దాదాపుగా 2500 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. శంకుస్ధాపన చేసిన ప్లాంట్లన్నీ కూడా త్వరలో నిర్మాణం పూర్తవుతాయని చెప్పారు.

నెల్లూరులో క్రిబ్‌కో ఆధ్వర్యంలో దాదాపుగా రూ.610 కోట్ల పెట్టుబడితో ఇథనాల్‌ తయారీ ప్లాంట్‌ 12 నెలల్లోపే పూర్తవుతుందన్నారు. క్రిబ్‌కో యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. ఏ సాయం కావాలన్నా ఒక్క ఫోన్‌ కాల్‌ దూరంలో అందుబాటులో ఉంటానని చెప్పారు. నెల్లూరు జిల్లాలో విశ్వసముద్ర బయో ఎనర్జీ ప్లాంట్‌ వస్తోందని, రూ.315 కోట్లతో వచ్చే ఈ ప్రాజెక్టు కూడా మరో 18 నెలల్లో అందుబాటులోకి వస్తుందన్నారు. తిరుపతి జిల్లాలో కాంటినెంటిల్‌ కాఫీ కూడా ఫ్యాక్టరీ పెడుతోందని, రూ.400 కోట్ల పెట్టుబడితో ఏటా 16 వేల టన్నుల కెపాసిటీతో ఈ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 400 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు.

ఏలూరు జిల్లాలో గోద్రెజ్‌ ఆగ్రోవెట్‌ లిమిటెడ్‌ సంస్ధ రూ.100 కోట్ల పెట్టుబడితో 400 టన్నుల సామర్ధ్యంతో ఎడిబుల్‌ ఆయిల్‌ రిఫైనరీ ప్రాజెక్టు విస్తరణకు చేస్తున్నట్లు చెప్పారు. కేవలం 9 నెలల్లోనే యూనిట్‌ను ప్రారంభోత్సవం చేసుకోవడం అభినందనీయమన్నారు. దీంతో 500 మందికి ఉద్యోగ ఉఫాధి అవకాశాలు లభిస్తాయన్నారు. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, సీఎస్‌ డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌ రెడ్డి, పరిశ్రమల శాఖ స్పెషల్‌ సీఎస్‌ కరికాల వలవెన్, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, పరిశ్రమల శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ పద్మావతి, ఏపీ పుడ్‌ ప్రాసెసింగ్‌ సీఈఓ ఎల్‌ శ్రీధర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed