Ganta: ఆయన పరిస్థితి దురదృష్టకరం.. విజయసాయిరెడ్డికి టీడీపీ ఎమ్మెల్యే కౌంటర్

by Ramesh Goud |
Ganta: ఆయన పరిస్థితి దురదృష్టకరం.. విజయసాయిరెడ్డికి టీడీపీ ఎమ్మెల్యే కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: విజయసాయిరెడ్డి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని, స్టీల్ ప్లాంట్ వ్యవహరంపై చిత్తశుద్ది ఉంటే అప్పుడే రాజీనామా చేసి ఉండాల్సిందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు అన్నారు. ఇవాళ సింహాచలం వరాహా నర్సింహస్వామిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా స్టీల్ ప్లాంట్ వ్యవహారంపై విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్‌కు కౌంటర్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. విజయసాయి రెడ్డికి ప్రతీ దానిని రాజకీయం చేయడం అలవాటుగా మారిందని, ప్రస్తుతం ఆయన పరిస్థితి దురదృష్టకరంగా మారిందని ఎద్దేవా చేశారు. స్టీల్ ప్లాంట్ వ్యవహారంపై గత ప్రభుత్వంలో తాను స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేయడం జరిగిందని, దాన్ని స్పీకర్ కూడా ఆమోదించారని తెలిపారు.

కానీ అప్పుడు అధికార పార్టీ ఎంపీగా ఉన్న విజయసాయి రెడ్డి రాజీనామా చేయలేదని, ఆయనకు చిత్తశుద్ది ఉంటే అప్పుడే రాజీనామా చేసి ఉంటే బాగుండేదని అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే స్టీల్ ప్లాంట్ అంశంపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచారని, కేంద్రమంత్రి కుమారస్వామిని స్టీల్ ప్లాంట్ కు రప్పించి ప్రైవేటీకరణ లేదని స్పష్టం చేసినట్లు తెలిపారు. ఇక ఎంపీ భరత్, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావులపై విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు తగవని, వారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా శాయశక్తుల ప్రయత్నిస్తున్నారని, ప్రైవేటీకరణకు వ్యతిరేఖంగా ఆమరణ దీక్ష చేపట్టారని తెలిపారు. అంతేగాక సాయిరెడ్డి రాజకీయాలు చేయాలనుకుంటే వేరేలా చేసుకోవాలని, దిగజారుడు రాజకీయాలు తగదని ఎమ్మెల్యే గంటా సూచించారు.

కాగా శుక్రవారం వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారంపై ట్వీట్ చేశారు. ఇందులో విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేయాలనే కేంద్రం నిర్ణయానికి నిరసనగా అప్పటి తెలుగుదేశం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు 2021 ఫిబ్రవరిలో తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారని, ఆయన రాజీనామాను 2024 జనవరిలో స్పీకర్‌ ఆమోదించారని తెలిపారు. అలాగే అప్పటి గంటా శ్రీనివాసరావు గారిని ఆదర్శంగా తీసుకుని ప్రస్తుత వైజాగ్‌ పార్లమెంటు సభ్యుడు భరత్‌ మతుకుమల్లి, స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు వెంటనే రాజీనామా చేయాలని, వారు అలా రాజీనామా చేయకపోయినా, ప్రభుత్వంపై ఒత్తిడి చేయకపోయినా చరిత్ర వారిని ద్రోహులుగా, మోసగాళ్లుగా పరిగణిస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ప్రజలు వారిద్దరినీ క్షమించరని, వారు చేసిన ద్రోహానికి వారిద్దరికీ గట్టి గుణపాఠం చెబుతారని రాసుకొచ్చారు.

Advertisement

Next Story