BREAKING: వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి హైకోర్టులో భారీ షాక్.. ఏ క్షణమైనా అరెస్ట్ అయ్యే ఛాన్స్..!

by Satheesh |   ( Updated:2024-06-26 11:06:22.0  )
BREAKING: వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి హైకోర్టులో భారీ షాక్.. ఏ క్షణమైనా అరెస్ట్ అయ్యే ఛాన్స్..!
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ నేత, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో భారీ షాక్ తగిలింది. ఈవీఎంల ధ్వంసం, ఎన్నికల్లో అల్లర్లు, ఓ సీఐపై హత్యాయత్నం, మహిళపై బెదిరింపుల కేసులో అరెస్ట్ నుండి రక్షణ కోరుతూ పిన్నెల్లి దాఖలు చేసిన నాలుగు ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. పోలీసుల తరఫున స్పెషల్ కౌన్సిల్‌గా న్యాయవాది ఎన్‌.అశ్వినీకుమార్‌ వాదించగా.. ఫిర్యాదుదారు నంబూరి శేషగిరిరావు తరఫున లాయర్ పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం.. పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్లు తోసిపుచ్చింది. కాగా, మే 13 జరిగిన ఎన్నికల్లో ఓ పోలింగ్ బూత్‌కు వెళ్లిన పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఈ వీడియో సోషల్ మీడియాలో సంచలనం రేపింది.

ఈ ఘటనపై సీరియస్ అయిన ఎన్నికల కమిషన్ పిన్నెల్లిపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఈసీ ఆదేశాల మేరకు పోలీసులు పిన్నెల్లిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా.. ఆయన దాదాపు వారం రోజుల పాటు పరారీలో ఉండి.. కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ల దాఖలు చేశారు. పిన్నెల్లిపై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని న్యాయస్థానం పోలీసులను ఆదేశించడంతో తిరిగి మాచర్లకు వచ్చాడు. ఈ క్రమంలో ఇవాళ పిన్నెల్లి బెయిల్ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు నాలుగు ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టేసింది. పిన్నెల్లిపై ఎలాంటి యాక్షన్ తీసుకోవద్దని గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను తాజాగా హైకోర్టు డిస్మిస్ చేసింది. దీంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. హైకోర్టు పిన్నెల్లి బెయిల్ పిటిషన్లను కొట్టేసిన నేపథ్యంలో మాచర్లలో హై టెన్షన్ నెలకొంది.

Advertisement

Next Story