Ap News: ప్రతిపక్ష హోదాపై వైఎస్ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు

by srinivas |   ( Updated:2024-07-26 10:55:31.0  )
Ap News: ప్రతిపక్ష హోదాపై వైఎస్ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా అంశం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. శాసన‌సభ ఎమ్మెల్యేల నిష్పత్రి ప్రకారం ప్రతిపక్ష హోదా దక్కాలంటే 18 సీట్లు రావాల్సి ఉంది. అయితే ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 11 సీట్లకు మాత్రమే పరిమితమైంది. దీంతో నిబంధనల ప్రకారమే వైఎస్ జగన్ ప్రతిపక్ష హోదాను కోల్పోయారు. కానీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని జగన్ మోహన్ రెడ్డి కోరుతున్నారు. ఈ మేరకు స్పీకర్ అయ్యన్న పాత్రుడికి సైతం విజ్ఞప్తి చేశారు. అయితే స్పీకర్ నిరాకరించారు. శానససభ నిబంధనల ప్రకారం ప్రతిపక్ష హోదా ఇవ్వడం కుదరదని చెబుతున్నారు. దీంతో జగన్ మోహన్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. తనకు ప్రత్యేక హోదా ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నారు. ఇందుకు సంబంధించిన పిటిషన్‌పై విచారణ జరగాల్సి ఉంది.

ఇదిలా ఉంటే ప్రతిపక్ష హోదాపై తాజాగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రభుత్వ తప్పులను తాను అసెంబ్లీలో నిలదీస్తాననే భయంతోనే తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వడంలేదని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేతగా తనకు మైక్ ఇస్తే అధికారపక్షం తప్పులు బయటపడతాయని, అందుకే అధికార పార్టీ భయపడుతోందని ఆరోపించారు. ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిని గుర్తించరట అని సెటైర్లు వేశారు. ప్రతిపక్ష నాయకుడిగా తనను గుర్తిస్తే సభా నాయకుడికి ఎంతసేపు మైక్ ఇస్తారో తనకు అంతే సమయం ఇవ్వాల్సి వస్తుందని అధికార పక్షం భయపడుతోందని ఎద్దేవా చేశారు. తమకు అవకాశం ఇస్తే ప్రజా సమస్యలపై నిలదీస్తామని చంద్రబాబుకు భయంపట్టుకుందని విమర్శించారు. ఇకపై అసెంబ్లీ జరిగిన ప్రతిసారి ప్రెస్ మీట్ నిర్వహిస్తానని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story

Most Viewed