కృష్ణానదికి వరద.. ఆందోళనలో బెజవాడ వాసులు

by Y.Nagarani |
కృష్ణానదికి వరద.. ఆందోళనలో బెజవాడ వాసులు
X

దిశ, వెబ్ డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పగలే చీకట్లు కమ్మి.. భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. ఇప్పటికే కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయడంతో పాటు.. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు అధికారులు. మరో రెండు నెలల్లో పంట చేతికొస్తుందని ఆశగా ఎదురుచూస్తున్న రైతన్నలపై వరుణదేవుడు నీళ్లు చల్లాడు. మరో మూడ్రోజులపాటు భారీ వర్షసూచన, ఏపీకి తుపాను గండం పొంచి ఉండటంతో రైతాంగం ఆందోళనలో ఉంది.

కాగా.. ఇటీవలే వరదల నుంచి తేరుకున్న బెజవాడ వాసులకు మళ్లీ వరదభయం పట్టుకుంది. ఏపీతో పాటు.. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో కృష్ణానదికి మళ్లీ వరద తాకిడి పెరుగుతోంది. సోమవారం నుంచి నదికి వరద ప్రవాహం పెరిగిందని ఏఈ దినేశ్ వెల్లడించారు. నిన్న 45 వేల క్యూసెక్కుల వరదనీరు రావడంతో.. ఆ నీటిని గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేసినట్లు తెలిపారు. కాగా.. నదికి వరద ప్రవాహం ఉండటంతో.. కృష్ణానదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అలాగే నదిలో చేపలవేటకు వెళ్లొద్దని సూచించారు.

మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టుకు కూడా వరదనీరు వస్తోంది. మంగళవారం ప్రాజెక్టుకు 1,27,548 క్యూసెక్కుల ఇన్ ఫ్లో రాగా.. 77,821 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు జలవనరుల శాఖ అధికారులు తెలిపారు.

Next Story