Atrocious: బాలుడి ప్రాణం తీసిన వైద్యుల నిర్లక్ష్యం.. వినూత్న రీతిలో నిరసన

by Indraja |
Atrocious: బాలుడి ప్రాణం తీసిన వైద్యుల నిర్లక్ష్యం.. వినూత్న రీతిలో నిరసన
X

దిశ వెబ్ డెస్క్: శ్రీకాకుళం జిల్లాలో ఓ తల్లికి కడుపుకోత’ పేరిట వెలసిన ఫ్లెక్సీలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.పాముకాటుకు, ముళ్లుగుచ్చు కోవడానికి తేడా తెలియని స్థితిలో వైద్య సిబ్బందికి డాక్టర్ సర్టిఫికేట్‌ ఎవర్రా ఇచ్చిందని ప్రజలు మండిపడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి మండలం, రావివలస పంచాయతీ, చిన్ననారాయణపురం గ్రామాని చెందిన మురళి, నిరోషా దంపతులకు సాయివినీత్‌(12) అనే కుమారుడు ఉన్నారు.

కాగా సాయివినీత్‌ మే 21న తోటిపిల్లలతో కలిసి క్రికెట్‌ ఆడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో క్రికెట్‌బాలు పక్కనే ఉన్న పొదల్లో పడింది. ఈ క్రమంలో ఆ బాలును తీసుకువచ్చేందుకు సాయివినీత్‌ పొదల్లోకి వెళ్లారు. కాగా పొదల్లోకి వెళ్లిన సాయివినీత్‌‌కు ఏదో కరిచింది. దీనితో కాసేపటికి సాయివినీత్‌ స్పృహ తప్పి పడిపోయాడు. ఉన్నటుండి బాలుడు స్పృహ కోల్పోవడంతో వెంటనే ఆ బాలుడ్ని కుటుంబ సభ్యులు టెక్కలిలోని జిల్లాకేంద్రాసుపత్రికి తరలించారు.

అయితే బాలుడికి ఏం జరిగిందో పరీక్షించకుండా ముల్లు గుచ్చుకుని ఉంటుందేమోనని భావించారు. బాలుడు ఎందుకు స్పృహ కోల్పాయాడు..? సాధారణ ముల్లు గుచ్చుకుంటే ఎవరైనా స్పృహ కోల్పోతారా..? అనే ఆలోచన సైతం చేయకపోగా, ఉలుకుపలుకు లేకుండా పడి ఉన్న బాలుడికి తగిన వైధ్యం అందిచలేదు. సుమారు రెండు గంటలపాటు నిర్లక్ష్యం చేశారు.

దీనితో బాలుడి పరిస్థితి విషమించింది. ఈ నేపథ్యంలో నాంకీవాస్థి వైద్యం అందించి, చివరికి తమ వల్లకాదని చేతులెత్తేసిన వైద్యులు శ్రీకాకుళంలో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి(రిమ్స్‌)కి తీసుకువెళ్లాలని సూచించారు. దీనితో కుటుంబ సబ్యులు సాయివినీత్‌‌ను అంబులెన్స్‌లో తరలిస్తుండగా.. నరసన్నపేట చేరుకునేసరికి బాలుడి పరిస్థితి మరింత విషమించింది.

ఈ నేపథ్యంలో అక్కడ ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా సాయివినీత్‌ మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. ఒక్కగానొక్క కుమారుడు మరణించడంతో ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపిస్తున్నారు. అల్లారుముద్దుగా పెంచుకున్న తన ఒక్కగానొక్క కొడుకు మరణాన్ని జీర్ణించుకోలేని బాలుడి తల్లి మే 22న నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

కాగా ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. కానీ నిన్న మొన్నటి వరకు కళ్లముందు తిరుగుతూ అల్లరి చేసిన కొడుకు వదిలిన వెళ్లిన అతని జ్ఞాపకాలు వెంటాడుతునే ఉండడంతో ఆ దంపతులకు కన్నీళ్లు ఆగడం లేదు. అయితే అంతటి బాధలోనూ తమకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదనే ఉద్దేశంతో ఓ వినూత్న నిరసన చేపట్టారు.

‘ఓ తల్లికి కడుపుకోత’ అంటూ తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ టెక్కలిలో పలుచోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీల ద్వారా మాకు కడుపుకోత మిగిల్చిన మీకు శ్రద్ధాంజలి. పాముకాటుకు, ముళ్లు గుచ్చుకోవడానికి తేడా తెలియని వారికి శతకోటి వందనాలు అంటూ వైద్యుల నిర్లక్ష్యం తీరును ఎండగట్టారు. కాగా టెక్కలిలోని జిల్లాకేంద్రాసుపత్రి ఇప్పటికే రిఫరల్‌ ఆస్పత్రిగా పేరొందింది. ఈ నేపథ్యంలో బాలుడిపట్ల నిర్లక్ష్యం వహించిన వైద్యుల తీరు చర్చనీయాంశమవుతోంది.

Advertisement

Next Story