తమ్మిలేరు జలాశయానికి వరద ముప్పు..మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

by Jakkula Mamatha |
తమ్మిలేరు జలాశయానికి వరద ముప్పు..మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
X

దిశ,ఏలూరు:ఏలూరుకు తమ్మిలేరు నుంచి వరద ముప్పు పొంచి వుంది. చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం వద్ద ఉన్న తమ్మిలేరు రిజర్వాయర్‌లో భారీ స్థాయిలో వరద నీరు ఎగువ తెలంగాణ నుండి ప్రవహిస్తోంది. ఆదివారం సాయంత్రానికి అందిన సమాచారం మేరకు రిజర్వాయర్‌లో 50 అడుగుల నీటిమట్టం నమోదయింది. పూర్తి సామర్థ్యం 353 అడుగులు కాగా, ఇప్పుడు 350కి చేరుకోవడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రిజర్వాయర్‌‌లోకి 9726 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండడంతో మూడు గేట్లు తెరిచి 7 వేల 227 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజక్టు పరిధిలో పరీవాహక ప్రాంతాలలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇరిగేషన్‌ అధికారులు హెచ్చరించారు. మరోవైపు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి కూడా తమ్మిలేరు వరద తీవ్రత దృష్ట్యా నగరవాసులు ముఖ్యంగా ఏటిగట్టు ప్రాంతాల్లో వారు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

కాగా తమ్మిలేరుకు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ కావడంతో పోలీసులు రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తం అయింది. జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప శివ కిశోర్‌, జాయింట్‌ కలెక్టర్‌ ధాత్రి రెడ్డి అధికారులతో కలిసి ఎక్కడెక్కడ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయనే విషయాలపై క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డ్రోన్ కెమెరాతో శనివారం పేట కాజ్వే పైన తంగెళ్ళమూడి నుండి ఎస్ఎంఆర్ నగర్ వెళ్లే రోడ్డును, తూర్పులాకులు పడమర లాకులు, వైయస్సార్ కాలనీ ప్రాంతాల్లో పరిశీలన చేశారు. ఎక్కడెక్కడ నేత మునిగే అవకాశాలు ఉన్నాయని దానిపై పరిశీలిచిన అనంతరం ఎస్పీ, జాయింట్‌ కలెక్టర్‌ అధికారులకు సూచనలు సలహాలు ఇచ్చారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని కోరారు. వారికోసం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారని చెప్పారు. ఆ కేంద్రాల వద్ద ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ, జాయింట్‌ కలెక్టర్‌ వెల్లడించారు. ప్రాణ నష్టం జరగకుండా పోలీసులకు సహకరించాలని వారు కోరారు.

Advertisement

Next Story

Most Viewed