ఖరీఫ్ పంటల పై సర్కారు నిర్లక్ష్యం..ఆందోళనలో రైతులు

by Jakkula Mamatha |   ( Updated:2024-05-20 06:31:18.0  )
ఖరీఫ్ పంటల పై సర్కారు నిర్లక్ష్యం..ఆందోళనలో రైతులు
X

దిశ ప్రతినిధి,చిత్తూరు:రైతును రాజును చేస్తామని చెప్పుకునే రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. తొలకరి ప్రారంభమవుతున్నా రైతాంగానికి అందించాల్సిన ప్రభుత్వ సహకారాన్ని పూర్తిగా విస్మరిస్తోంది. దీంతో ఖరీఫ్ రైతుల్లో ఆందోళన తప్పడం లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ముఖ్యమంత్రి మొదలు మంత్రులు, ఎమ్మెల్యేలు వరకు కూడా ఎవరి స్థాయిలో వాళ్ళు ఆటవిడుపుగా విహారయాత్రలో ఉండటంతో ప్రభుత్వ యంత్రాంగం ఖరీఫ్ రైతాంగాన్ని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా గత వారం పది రోజులుగా ఆశించిన మేరకు వర్షాలు కురుస్తుండటంతో ఖరీఫ్ రైతులు సాగుకు సిద్ధమవుతున్నారు.

అయితే సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు వాటికి అవసరమైన పెట్టుబడి సాయం అందించే విషయంలో ప్రభుత్వ అధికార యంత్రాంగం తీసుకుంటున్న చర్యలు అంతంత మాత్రం గానే ఉన్నాయి. అయితే గత మూడు నెలల పాటు ఎన్నికల హడావుడిలో ఉండి అధికార పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలతో పాటు అధికారులు సైతం ఎన్నికల విధుల నుంచి దృష్టి ఇతర అంశాలకు సంబంధించిన పరిపాలనపై సారిస్తున్నట్లు లేదు. దాని ఫలితంగా ఖరీఫ్ రైతుల్లో ఆందోళన మొదలైంది. ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు పాలకులే కాకుండా అధికార యంత్రాంగం కూడా తమను పట్టించుకునే పరిస్థితిలో లేదనే ఆందోళన ఖరీఫ్ రైతుల్లో మొదలైంది.

అత్తెసరు విత్తనాల సరఫరా..

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఖరీఫ్ సీజన్ కు గాను 1,97,694 హెక్టార్ల సాధారణ సాగు విస్తీర్ణం కాగా అందులో గత ఏడాది 74,894 హెక్టార్లలో మాత్రమే సాగైనట్లు జిల్లా వ్యవసాయ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఈ సాగుకు గాను గత ఏడాది ఖరీఫ్ సీజన్లో 79,541 క్వింటాళ్ల వేరుశనగ రాయితీ విత్తనాలు అధికారులు రైతులకు రాయితీ పై పంపిణీ చేశారు. అయితే ఈ ఏడాది కూడా ఉమ్మడి జిల్లాలో అధికారులు అంచనాల ప్రకారం 1.97 లక్షల హెక్టార్ల సాధారణ సాగు విస్తీర్ణం గా ఉన్నప్పటికీ జిల్లాకు సరఫరా అయిన రాయితీ వేరుశనగ విత్తనాలు మాత్రం మూడింట ఒక భాగం కూడా లేదు.

జిల్లాలో ఇప్పటివరకు 38,655 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు మాత్రమే సరఫరా అయినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఒక ప్రకటనలో తెలియజేస్తూ ఆ విషయాన్ని ధృవీకరించారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం సరఫరా చేసిన విత్తనాలు కేవలం ఒకటి రెండు రోజుల పంపిణీకి మాత్రమే సరి పడినట్లు ఉన్నాయి. మిగిలిన రైతులకు చేతులెత్తేసిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రతి ఏటా ముందుగా వెళ్లిన రైతులకు తప్ప చివరగా వెళ్లే రైతులకు విత్తనాలు ఇచ్చిన దాఖలాలు లేవు. ఒక బస్తా రాయితీ విత్తనాలు తీసుకోవడం అంటే రైతులు ఒక విధంగా యుద్ధం చేసే అంత పని జరిగినట్టే. దీంతో ఖరీఫ్ రైతులకు రాయితీ వేరుశనగ విత్తనాలపై ఆందోళన మొదలైంది.

Advertisement

Next Story