- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైసీపీ పాలనలో రైతులు వ్యవసాయం అంటే భయపడుతున్నారు: Nadendla Manohar
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందో లేదో అన్న అనుమానం కలుగుతుందని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. మాండూస్, అకాల వర్షాల వల్ల రైతులు సర్వం కోల్పోతే ఆదుకోవాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తోందంటూ మండిపడ్డారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో శుక్రవారం తెనాలి, కొల్లిపర మండలాల్లో తుపాను ప్రభావంతో నష్టపోయిన పంటలను నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. తేలప్రోలు, అత్తోట గ్రామాల పరిధిలో మొలకలు వచ్చిన వరిని రైతులు మనోహర్‌కి చూపించి తమ గోడు వెల్లబోసుకున్నారు. ఇంత నష్టం వచ్చినా కనీసం పంట నష్టం అంచనా వేసేందుకు ఏ అధికారి రాలేదని కన్నీటి పర్యంతమయ్యారు.
కాలువల నిర్వహణ సరిగా లేకపోవడం వల్లే ఎక్కువ నష్టం వాటిల్లిన విషయాన్ని నాదెండ్ల మనోహర్ దృష్టికి రైతులు తీసుకెళ్లారు. రైతుల దయనీయ పరిస్థితి చూసి చలించిపోయిన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వైసీపీ పాలనలో రైతాంగం, వ్యవసాయం అంటే ఆలోచించే పరిస్థితులు వచ్చాయని చెప్పుకొచ్చారు. తుఫాను వచ్చి పంటలు నష్టపోతే పలకరించే నాథుడు లేకపోవడం దారుణమన్నారు. కౌలు రైతుల్ని అసలు పట్టించుకునే పరిస్థితులే లేవని అన్నారు. రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం వారికి అండగా ఉండకుండా రైతుకి రాజకీయం.. కులం అంటగడుతుందని నాదెండ్ల మనోహర్ ధ్వజమెత్తారు.
కౌలు రైతులను ఆదుకోవాలి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు పరిస్థితి చాలా దయనీయంగా ఉందని గత మూడున్నరేళ్లుగా విపత్తులతో సర్వం కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలలో తెనాలి, కొల్లిపర మండలాల్లో కలిగిన పంట నష్టం చూస్తే బాధేస్తోందని చెప్పుకొచ్చారు. వీఆర్వోలు, వలంటీర్లు, వ్యవసాయ అధికారులు ఎవ్వరూ పొలాల్లోకి వచ్చి పంట నష్టం అంచనా వేయడం లేదని మండిపడ్డారు.
వేల కోట్లు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాల నుంచి ఒక్క అధికారి గాని, స్థానిక ప్రజా ప్రతినిధులు గాని వచ్చి రైతులను ఓదార్చకపోవడం అన్యాయమన్నారు. మరోవైపు కౌలు రైతుల్ని అయితే ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసిందని ఆరోపించారు. దీంతో గుంటూరు లాంటి జిల్లాలోనే 300 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆ కుటుంబాలను ఆదుకునేందుకు ఈ నెల 18న సత్తెనపల్లిలో కౌలు రైతు భరోసా సభ నిర్వహించి కుటుంబానికి రూ. లక్ష చొప్పున పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్వయంగా సాయం అందజేస్తారని నాదెండ్ల మనోహర్ తెలిపారు.
విత్తనం లేదు, ఎరువు ఇవ్వడం లేదు. కనీసం పంట కాలువల్లో పూడిక కూడా తీయలేదు. జాతీయ ఉపాధి హామీ పథకం నిధులు ఏమయ్యాయో అర్థం కావడం లేదు. రైతులు సమస్యల్లో ఉంటే ప్రభుత్వానికి స్పందించే మనస్థత్వం ఎందుకు లేకుండా పోయిందో అర్థం కావడం లేదని పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ చెప్పుకొచ్చారు.
రైతులకు అండగా జనసేన
జనసేన పార్టీ రైతులకు ఎల్లవేళలా అండగా ఉంటుందని నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. గతేడాది తుఫాను వచ్చినప్పుడు రాష్ట్రవ్యాప్తంగా జనసేన పార్టీ తరఫున నిరసన దీక్షలు చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. పవన్ కల్యాణ్ రైతాంగానికి మేలు చేసే విధంగా ప్రతి రైతుకీ రూ. 25 వేలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తే రూ. 6 వేలు చొప్పున ఇచ్చారని అది కూడా తూతూ మంత్రంగా కొంతమందికే ఇచ్చి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు.
ప్రస్తుతం మాండూస్, అకాల వర్షాలతో నష్టపోయిన ప్రతి ఎకరానికి రూ. 10 వేల చొప్పున తక్షణ పరిహారం అందించాలని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. దేశంలో ఇప్పటికీ 70 శాతం మందికి జీవనాధారమైన వ్యవసాయ రంగాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. అలాగే తేమ శాతం పేరు చెప్పి ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే పోరాటం చేస్తామని నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు.