మే నెలలో కరెంటు బిల్లుల షాక్! విపక్షాల ఫైర్

by Rajesh |
మే నెలలో కరెంటు బిల్లుల షాక్! విపక్షాల ఫైర్
X

జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నపుడు చంద్రబాబు ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శించే వారు. లీటరు పెట్రోలుపై రెండు రూపాయల సర్ చార్జ్ విధిస్తే బాదుడే బాదుడు అన్నారు. కరెంటు చార్జీలు, ఆర్టీసీ చార్జీలు.. ఇలా వేటిని స్వల్పంగా పెంచినా బాదుడే బాదుడని జగన్ గుండెలు బాదుకున్నారు. ప్రతి సభలోనూ టీడీపీ ప్రభుత్వంపై పరుషమైన వ్యాఖ్యలు చేసే వారు. వైసీపీ అధికారంలోకి వస్తే అన్ని చార్జీలూ తగ్గిపోతాయని భ్రమపడిన ఓటర్లు 2019 ఎన్నికల్లో జగన్ కు అధికారం కట్టబెట్టారు.

సీన్ కట్ చేస్తే.. నేడు సాధారణ కుటుంబాలకు కూడా నెలకు వేలకు వేలు కరెంటు బిల్లులు వస్తున్నాయి. ట్రూ అప్ పేరుతో కరెంటు చార్జీలను ఎడాపెడా బాదేస్తున్నారు. టీడీపీ హయాంలో ఏ చార్జీలనైనా పెంచే ముందే ప్రజలకు చెప్పే వారు. ఇప్పుడు చెప్పడం లేదు. ఇష్టారాజ్యంగా పెంచేస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా చెత్తపై పన్ను వసూలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో లీటరు పెట్రోలు, డీజిలుపై రూ.8-11 వరకు అధికంగా వసూలు చేస్తున్నారు.

దిశ, ఏపీ బ్యూరో

“ఏప్రిల్​ నెల నుంచే వడగాడ్పులు వీచాయి. ఆ నెలలో ఎంత కరెంటు వాడుకున్నామో మే నెలలో కూడా అంతే వినియోగించినా బిల్లు రెట్టింపు వచ్చింది. ఇదేదో కరెంటు బిల్లు కడుతున్నట్లు లేదు. రెండోసారి ఇంటి అద్దె కడుతున్నట్లుంది...!” అంటూ గుంటూరు నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రమంతటా ఇదే పరిస్థితి. పెరిగిన కరెంటు చార్జీలతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు.

మే నెల బిల్లు చూసి బావురుమంటున్నారు. రెట్టింపు చార్జీలు ఎలా వేస్తారని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన చార్జీలపై టీడీపీతోపాటు వామపక్షాలు ఆందోళన చేపట్టాయి. సీఎం జగన్​ ఎన్నికల ముందు చెప్పిందేంటీ.. చేస్తున్నదేంటీ అని ఆయా పార్టీల నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడబలుక్కొని ప్రజలపై అలవికాని భారాలు మోపుతున్నాయని విమర్శిస్తున్నారు.

ఇక నెలనెలా బాదుడే..

రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు చెల్లించాల్సిన సొమ్మును ప్రజల నుంచి ముక్కు పిండి వసూలు చేయాలని నిర్ణయించింది. దీంతో 2014 నుంచి 2019 వరకు లెక్కలు బయటకు తీసింది. ఆ కాలంలో బిల్లుల ద్వారా వసూలైన సొమ్ముకు, సరఫరా చేసిన కరెంటు విలువకు మధ్య వ్యత్యాసం ఉందని గుర్తించారు. తేడా ఉన్న సొమ్మును తిరిగి ప్రజల నుంచి ట్రూ అప్ చార్జీల పేరిట వసూలు ప్రారంభించింది.

ఇలా సుమారు రూ.2,900 కోట్లు వసూలు చేసింది. తర్వాత 2021 –22 దాకా ఇలా తేడా వచ్చిన సొమ్ము రూ.3083 కోట్లను ట్రూ అప్​ చార్జీల పేరుతో బాదేసింది. ఇక ఏడాది దాకా ఆగి లెక్కలు వేసే కన్నా ప్రతి నెలా లెక్కించి ట్రూ అప్​ చార్జీలు విధించాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్​ నుంచి ప్రతి నెలా డిస్కంలు సరఫరా చేసే దానికి, బిల్లుల ద్వారా వసూలైన సొమ్ము మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజల నుంచి రాబట్టేందుకు ప్రతి నెలా ట్రూ అప్​ చార్జీలను వేస్తోంది.

మే నెలలో ఎంత పెరిగిందంటే..

ఇవిగాక కరెంటు సరఫరాలో లోడ్​ కు సంబంధించి యూనిట్​ ధరలు మారుతుంటాయి. పీక్​ అవర్స్​లో కరెంటు వినియోగానికి అధిక ధరలు బాదేస్తోంది. ప్రతి నెలా ఉత్పత్తి సంస్థల నుంచి ఏ ధరకు కొనుగోలు చేస్తే దానికి తగ్గట్లు యూనిట్​ ధరను నిర్ణయిస్తున్నారు. అందువల్లే మే నెలలో యూనిట్​కు 40 నుంచి 80 పైసలు పెరిగినట్లు తెలుస్తోంది. థర్మల్​ విద్యుత్​ కేంద్రాలకు అవసరమైన బొగ్గు టన్ను రూ.5 వేలకు దొరుకుతుంటే కేంద్రం ఒత్తిడితో విదేశాల్లోని అదానీ బొగ్గును రూ.20 వేల దాకా వెచ్చించి కొనాల్సిన అవసరమేంటని విపక్షాలు నిలదీస్తున్నాయి. అసలు కరెంటు కొనుగోలు, సరఫరాలో పారదర్శకత లేదని గొంతెత్తి నిరసిస్తున్నాయి. బయటి నుంచి కొనే కరెంటుకు ప్రతినెలా ధరలు పెరుగుతాయా అంటూ విపక్ష నేతలు నిలదీస్తున్నారు.

మీటర్లలోనూ బాదుడే..

ప్రతినెలా వచ్చే బిల్లులో వాడుకున్న యూనిట్ల విలువతో సమానంగా ట్రూ అప్​, సర్దుబాటు చార్జీలు, విద్యుత్​ సుంకం, ఇతర చార్జీలు ఉండడమేంటని వినియోగదారులు ప్రభుత్వంపై కన్నెర్ర జేస్తున్నారు. ఈ బాదుడు ఇంతటితో ఆగేట్లు లేదు. త్వరలో ప్రతి ఇంటికీ స్మార్టు మీటర్లు బిగించనున్నారు. ఒక్కో మీటరు బిగింపు, మెయింటినెన్స్​కు అయ్యే వ్యయాన్ని అధికంగా చూపి వినియోగదారుల జేబులు కొల్లగొట్టేందుకు సిద్దమవుతున్నట్లు విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. యూపీలో ఒక్కో మీటరుకు రూ.10 వేలు వసూలు చేస్తుంటే ఇక్కడ మాత్రం దాన్ని రూ.17 వేలుగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ సొమ్మును వినియోగదారుడి నుంచి పదేళ్ల పాటు బిల్లుల్లో కలిపి వసూలు చేస్తారు. రానున్న కాలంలో కరెంటు చార్జీల మోత మరింత పెరుగుతుందని వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed