పవన్‌తో మీటింగ్.. ప్రెస్‌మీట్‌లో నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు

by srinivas |   ( Updated:2023-10-23 13:51:42.0  )
పవన్‌తో మీటింగ్.. ప్రెస్‌మీట్‌లో నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: దసరా వేళ టీడీపీ, జనసేన సమావేశం రాష్ట్రానికి శుభసూచకమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు. టీడీపీ, జనసేన సమన్వయ సమావేశం తర్వాత పవన్ కల్యాణ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలకు మంచి అంశాలపైనే తాము చర్చించామని తెలిపారు. రెండు పార్టీల పొత్తుతో ఎన్నికలకు వెళ్లాలని ఇప్పటికే నిర్ణయించిన విషయాన్ని ఈ సందర్భంగా నారా లోకేశ్ గుర్తు చేశారు. వైసీపీ నేతలు, కార్యకర్తలు బీసీలను వేధిస్తున్నారని మండిపడ్డారు. బీసీలకు సంబంధించి చాలా సంక్షేమ పథకాలను సీఎం జగన్ రద్దు చేశారని ఎద్దేవా చేశారు. ఎస్సీలకు సంబంధించి 26 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారని ఆరోపించారు. వైసీపీ నేతల వేధింపులతో ముస్లిం సోదరులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా 34 లక్షల ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లిందని, సాగునీటి ప్రాజెక్టులో ప్రభుత్వ వైఫల్యం చాలా స్పష్టంగా కనిపిస్తోందని నారా లోకేశ్ విమర్శించారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదని ఆయన ఎద్దేవా చేశారు. జగన్ ప్రభుత్వంలో ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేక యువత పక్క రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారని చెప్పారు. ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఎటువంటి తప్పు చేయని చంద్రబాబును అక్రమంగా కేసులు పెట్టి జైల్లో ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవస్థలను సీఎం జగన్ మేనేజ్ చేస్తూ ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed