Pawan Kalayan: వాళ్ల వల్లే ఈ రాష్ట్రం నాశనం!

by srinivas |
Pawan Kalayan: వాళ్ల వల్లే ఈ రాష్ట్రం నాశనం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: నేరగాళ్లు రాజకీయాలు చేస్తే ఆ రాష్ట్రం నాశనమవుతుందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అభిప్రాయపడ్డారు. నేరగాళ్ల బెదిరింపులకు మంచివాళ్లు కూడా లొంగిపోతారని, అందుకే ప్రజాస్వామ్యం కుంటుపడుతుందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఏపీలో వైసీపీ నేతలు పులివెందుల సంస్కృతిని అన్ని చోట్లకు తీసుకువచ్చారంటూ సంచలన ఆరోపణలు చేశారు.

డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం నేతలతో పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాదిరిగా తాను కుల రాజకీయాలు చేయలేనని చెప్పారు. విభిన్న కులాలు, మతాల నుంచి జనసేన సభ్యులను పార్టీలోకి తీసుకున్నట్లు స్పష్టం చేశారు. జనసేన పార్టీ ఓటమి పాలైన తర్వాత కూడా నిలదొక్కుకోవడమే గొప్ప విషయమని అన్నారు. ఈ రాష్ట్ర ప్రజలకు జనసేన భావజాలం, జనసేన అవసరం ఉందని పవన్ కల్యాణ్ చెప్పారు. రాజకీయ పదవుల్లో మూడోవంతు మహిళలు ఉండాలని పవన్ పేర్కొన్నారు. మహిళలకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో జనసేన ముందుండి పోరాటం చేస్తుందని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.

ప్రజల హక్కులకు భంగం కలిగితే ఎంతటి పోరాటానికైనా తాను సిద్ధమని పవన్ కల్యాణ్ ప్రకటించారు.అవసరమైతే తానే ఎదురు తిరుగుతానని కార్యకర్తల సమావేశంలో అన్నారు. రూ.200 లంచం తీసుకున్న ఉద్యోగికి శిక్ష పడుతుంది కానీ వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసే నాయకులు మాత్రం పరిపాలన చేస్తున్నారని, ఇది దౌర్భాగ్యమన్నారు. ఈ రాజకీయ నేరగాళ్లు ఓట్లు తీసేస్తారని, దొంగ ఓట్లు వేస్తారని ఆరోపించారు. మన ఓటుతో గెలిచి జవాబుదారీతనం లేకపోతే ఎలా అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.

గోదావరి జిల్లాల నుంచే మార్పు మొదలు కావాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. అందుకే తాను ఉభయగోదావరి జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. ఈ ఉభయగోదావరి జిల్లాల నుంచి ఒక్క సీటు కూడా వైసీపీకి వెళ్లకూడాదన్నారు. అందుకు తగ్గట్లుగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పవన్ కల్యాణ్ వెల్లడించారు. 2019 ఎన్నికల్లో రాజోలు నియోజకవర్గంలో వెలిగిన చిరు ద్వీపం తాజాగా ఉమ్మడి కడప జిల్లా రాజంపేట వరకు వెలుగుతోందని పవన్ కల్యాణ్ చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed